Shubman Gill: కప్పు కొట్టకున్నా ఛాంపియనే

సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లి.. ఇలా భారత క్రికెట్లో ఒక్కో తరానికి ఒక్కో బ్యాటింగ్‌ సూపర్‌ స్టార్‌ వచ్చారు. ఇప్పుడు 23 ఏళ్ల శుభ్‌మన్‌  గిల్‌ అదే బాటలో సాగుతున్నాడు.

Updated : 31 May 2023 07:14 IST

సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందుల్కర్‌, విరాట్‌ కోహ్లి.. ఇలా భారత క్రికెట్లో ఒక్కో తరానికి ఒక్కో బ్యాటింగ్‌ సూపర్‌ స్టార్‌ వచ్చారు. ఇప్పుడు 23 ఏళ్ల శుభ్‌మన్‌  గిల్‌ అదే బాటలో సాగుతున్నాడు. నిరుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే గుజరాత్‌ విజేతగా నిలిచిందన్నా.. ఈ ఏడాది రన్నరప్‌ అయిందన్నా.. అందుకు ప్రధాన కారణం ఈ 23 ఏళ్ల కుర్రాడే. ఈ ఐపీఎల్‌ భారత క్రికెట్లో గిల్‌ శకానికి శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు!

ఈనాడు క్రీడావిభాగం

ఐపీఎల్‌-16లో మూడు శతకాలు.. సీజన్‌లో 890 పరుగులు.. జట్టులో మరే ఇతర బ్యాటర్‌ అతని పరుగుల్లో సగం కూడా చేయలేదు.. గుజరాత్‌ టైటాన్స్‌ ప్రదర్శనలో శుభ్‌మన్‌ గిల్‌ ఎంతటి కీలకమో చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు. స్టార్లు లేని జట్టుకు అతనే సూపర్‌ స్టార్‌ అయ్యాడు. బ్యాటింగ్‌లో అన్నీ తానై జట్టును ముందుకు నడిపించాడు. గత మ్యాచ్‌ల్లో మాదిరే భారీ స్కోరు చేయకపోయినా.. ఫైనల్లోనూ అతను ఉపయుక్తమైన ఇన్నింగ్సే ఆడాడు. ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను.. ఐపీఎల్‌లోనూ దూకుడు కొనసాగించి తనకు తిరుగులేదని చాటాడు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని, బలహీనతలను అధిగమించడంలో శుభ్‌మన్‌ రాటుదేలాడు. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా భారత్‌ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన గిల్‌.. అదే ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. 2020, 2021 సీజన్లలో నిలకడగా రాణించి 400కు పైగా పరుగులు సాధించాడు. కానీ స్ట్రైక్‌ రేట్‌ చూస్తే 120 లోపే. వేగంగా ఆడాల్సిన టీ20ల్లో గిల్‌ ఇలాంటి స్ట్రైక్‌రేట్‌ నమోదు చేయడంపై విమర్శలు వచ్చాయి. నిరుడు గుజరాత్‌ టైటాన్స్‌కు మారడంతో అతని జోరు పెరిగింది. స్ట్రైక్‌రేట్‌ 130 దాటింది. ఈసారి మాత్రం 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఈ సీజన్‌లోనే మూడు సెంచరీలు చేశాడు.

అదే తేడా..: ఈ మధ్య కాలంలో చాలా మంది యువ ఆటగాళ్లు ఒక మ్యాచ్‌లోనో లేదా ఒక సీజన్‌లోనో మెరిసి ఆ తర్వాత నిలకడ కోల్పోయి కనుమరుగవుతున్నారు. కానీ గిల్‌ అలా కాదు. ఒక్క సెంచరీతో సంతృప్తి చెందే ఆటగాడు కాదతను. తీరని ఆ పరుగుల దాహం అతణ్ని నడిపిస్తోంది. సంప్రదాయ క్రికెటింగ్‌ షాట్లతోనే శుభ్‌మన్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. అతని షాట్ల ఎంపిక, ఆటను అర్థం చేసుకునే విధానం, కింది చేతిని ఉపయోగించే తీరు, బ్యాటింగ్‌ భారాన్ని భుజాలపై మోస్తూ జట్టును గెలిపించే బాధ్యత, అన్నింటికి మించి క్రీజులో తన ప్రశాంత చిత్తం.. ఇవే గిల్‌ను మిగతా వాళ్లకంటే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.  కోహ్లీని ఆరాధిస్తూ, అతని ఆట నుంచి నేర్చుకుంటూ ఎదిగిన గిల్‌.. విరాట్‌ లాగే నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించి, కుదురుకున్నాక జూలు విదిలిస్తాడు. గిల్‌ ఆటలో గుడ్డిగా కొట్టే షాట్లు కనిపించవు. బంతిని సరిగ్గా అంచనా వేసి, కొలిచినట్లు కొడతాడు. మరే యువ బ్యాటర్‌ అయినా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడంటే.. ఆ ఊపులో తర్వాతి బంతి ఎలా పడినా షాట్‌ ఆడాలని చూస్తాడు. ఆ క్రమంలో ఔటైపోతుంటాడు. కానీ శుభ్‌మన్‌ అలా కాదు. రెండు షాట్లు కొట్టాక ఓ మంచి బంతి పడితే దాన్ని గౌరవిస్తాడు. డిఫెన్స్‌ ఆడతాడు. ఈ సంయమనమే మిగతా యువ బ్యాటర్ల నుంచి అతణ్ని వేరుగా నిలుపుతోంది. పరిస్థితులకు తగ్గట్లుగా అతను ఖాళీల్లో నుంచి ఫోర్లు కొట్టగలడు, సిక్సర్ల మోతా మోగించగలడు. సన్‌రైజర్స్‌పై 101 పరుగుల ఇన్నింగ్స్‌లో గిల్‌ కొట్టిన సిక్సర్‌ ఒకటే. ఫోర్లు 13. అదే ఆర్సీబీ (104 నాటౌట్‌)పై 8 సిక్సర్లు, ముంబయి (129)పై 10 సిక్సర్లు దంచాడు. గుజరాత్‌ అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించిందన్నా.. క్వాలిఫయర్లో అలవోకగా ముంబయిని ఓడించిందన్నా అందులో గిల్‌ పాత్ర అత్యంత కీలకం. ఫైనల్లోనూ జట్టుకు అతను బలమైన పునాది వేశాడు. ప్రపంచ మేటి బౌలర్లు ఆడే ఐపీఎల్‌లో గిల్‌ చూపించిన నిలకడ.. అతను కొట్టిన షాట్లు.. ఆడిన భారీ ఇన్నింగ్స్‌లు.. మున్ముందు ప్రపంచ క్రికెట్లో అతడి ఆధిపత్యానికి సూచికలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లి తర్వాత కొత్త తరానికి శుభ్‌మన్‌ రూపంలో ఒక సూపర్‌ స్టార్‌ దొరికినట్లే అన్న అంచనాను అతను ఎంతమేర నిజం చేస్తాడో చూడాలి మరి.


శుభ్‌మన్‌కు 4 అవార్డులు

ఈ సీజన్‌లో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌ అవార్డులనూ కొల్లగొట్టాడు. అత్యధిక పరుగులు సాధించిన అతడు ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకోవడంతో పాటు.. గేమ్‌ చేంజర్‌, టోర్నీలో ‘విలువైన ఆటగాడు’ అవార్డులను గెలుచుకున్నాడు. అత్యధిక ఫోర్ల పురస్కారం అతడి ఖాతాలోనే చేరింది. ఈ సీజన్‌లో ఉత్తమ ‘వర్ధమాన ఆటగాడు’ అవార్డును యశస్వి జైస్వాల్‌ (రాజస్థాన్‌) దక్కించుకున్నాడు. ఫెయిర్‌ప్లే అవార్డు దిల్లీ క్యాపిటల్స్‌ సొంతమైంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన షమి (గుజరాత్‌) పర్పుల్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని