దూసుకెళ్తున్న స్వైటెక్‌

ఫ్రెంచ్‌ ఓపెన్లో ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) దూసుకెళ్తోంది. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్‌ చేరింది. గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌ 6-4, 6-0తో క్లెయిర్‌ లూ (అమెరికా)ను ఓడించింది.

Published : 02 Jun 2023 01:46 IST

మూడో రౌండ్లో ప్రవేశం
రిబకీనా, రూడ్‌ ముందంజ
ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్లో ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) దూసుకెళ్తోంది. ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పెద్దగా కష్టపడకుండానే మూడో రౌండ్‌ చేరింది. గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌ 6-4, 6-0తో క్లెయిర్‌ లూ (అమెరికా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇగా.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆమె జోరు చూస్తే సెట్‌ 6-0తో గెలుస్తుందేమో అనిపించింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న లూ.. స్వైటెక్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేయడమే కాక ఆ తర్వాత 3-3తో స్కోరు సమం చేసింది. అయితే ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఇగా.. అదే జోరుతో సెట్‌ గెలిచింది. రెండో సెట్లో స్వైటెక్‌ పదునైన సర్వీసులు, మెరుపు రిటర్న్‌లకు లూ బదులే ఇవ్వలేకపోయింది. దీంతో ఒక్క గేమ్‌ను కూడా ప్రత్యర్థికి చేజార్చుకోకుండా స్వైటెక్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. నాలుగోసీడ్‌ రిబకీనా (ఉక్రెయిన్‌) కూడా ముందంజ వేసింది. ఆమె 6-3, 6-3తో నోస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. 20వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) ఇంటిముఖం పట్టింది. ఏకంగా 74 అనవసర తప్పిదాలు చేసిన ఆమె 2-6, 6-4, 4-6తో  కైలా డే చేతిలో ఓడింది. పెరా (అమెరికా), హడాడ్‌ (బ్రెజిల్‌), ఆండ్రీవా (రష్యా), జాబెర్‌ (ట్యునీసియా) కూడా రెండో రౌండ్‌ అధిగమించారు.

చెమటోడ్చిన రూడ్‌: పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) మూడో రౌండ్‌ చేరాడు. అన్‌సీడెడ్‌ గెలియో జెపెరి (ఫ్రాన్స్‌)పై 6-3, 6-2, 4-6, 7-5తో అతడు కాస్త కష్టపడి గెలిచాడు. తొలి రెండు సెట్లు తేలిగ్గానే నెగ్గిన రూడ్‌కు మూడో సెట్లో గట్టిపోటీ ఎదురైంది. ఈ సెట్‌ను దక్కించుకున్న గెలియో.. నాలుగో సెట్లోనూ గట్టిగా పోరాడాడు. కానీ పదకొండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన రూడ్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రూడ్‌ 2 ఏస్‌లతో పాటు 34 విన్నర్లు కొట్టాడు. ఎనిమిదో సీడ్‌ సినర్‌ (ఇటలీ)కి షాక్‌ తగిలింది. 5 గంటలకు పైగా సాగిన పోరులో అతడు 7-6 (7-0), 6-7 (7-9), 6-1, 6-7 (4-7), 5-7తో అల్ట్‌మైర్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. టియోఫో (అమెరికా), దిమిత్రోవ్‌ (బల్గేరియా) ముందంజ వేశారు. పన్నెండోసీడ్‌ టియాఫో 3-6, 6-3, 7-5, 6-2తో కరత్సెవ్‌ (రష్యా)పై నెగ్గగా.. దిమిత్రోవ్‌ 7-6 (7-4), 6-3, 6-3తో ఇమిల్‌ (ఫిన్లాండ్‌)ను ఓడించాడు. కొరిచ్‌ (క్రొయేషియా) 6-3, 4-6, 4-6, 6-3, 6-4తో కాహిన్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు. 18వ సీడ్‌ డిమినర్‌ (ఆస్ట్రేలియా) ఓడిపోయాడు. థామస్‌ మార్టిన్‌ (అర్జెంటీనా) 6-3, 7-6 (7-2), 6-3తో డిమినర్‌ను కంగుతినిపించాడు. మరోవైపు తొలి రౌండ్లో అయిదుసెట్లు పోరాడి సెబాస్టియిన్‌ బేజ్‌ (అర్జెంటీనా)పై గెలిచిన మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌).. గాయంతో రెండో రౌండ్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆరో సీడ్‌ రూన్‌ (డెన్మార్క్‌) బరిలో దిగకుండానే ముందంజ వేశాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు