పీఎస్జీని వీడనున్న మెస్సి

పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ (పీఎస్జీ) క్లబ్‌తో రెండేళ్ల బంధానికి అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ ఆటగాడు లియొనాల్‌ మెస్సి ముగింపు పలకనున్నాడు. ఈ విషయాన్ని ఆ క్లబ్‌ కోచ్‌ క్రిస్టోఫె గాల్టియర్‌ గురువారం వెల్లడించాడు.

Published : 02 Jun 2023 01:44 IST

పారిస్‌: పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ (పీఎస్జీ) క్లబ్‌తో రెండేళ్ల బంధానికి అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ ఆటగాడు లియొనాల్‌ మెస్సి ముగింపు పలకనున్నాడు. ఈ విషయాన్ని ఆ క్లబ్‌ కోచ్‌ క్రిస్టోఫె గాల్టియర్‌ గురువారం వెల్లడించాడు. శనివారం తమ సొంతగడ్డ పార్క్‌ ది ప్రిన్సెస్‌ స్టేడియంలో క్లెర్మాంట్‌తో మ్యాచే మెస్సికి చివరిదని కోచ్‌ తెలిపాడు. ‘‘సాకర్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడికి కోచ్‌గా వ్యవహరించే గౌరవం నాకు దక్కింది. పార్క్‌ ది ప్రిన్సెస్‌ స్టేడియంలో మెస్సి చివరి మ్యాచ్‌ ఆడబోతున్నాడు. అతనికి ఘన స్వాగతం దొరుకుతుందని ఆశిస్తున్నా’’ అని గాల్టియర్‌ చెప్పాడు. ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలవాలనే లక్ష్యంతో మెస్సితో 2021 ఆగస్టులో పీఎస్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ ఆశ తీరలేదు. ఫ్రెంచ్‌ లీగ్‌ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బంది పడ్డ మెస్సి.. పీఎస్జీ తరపున తొలి 26 మ్యాచ్‌ల్లో ఆరు లీగ్‌ గోల్స్‌ మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత ఎంబాపె జతగా మంచి ప్రదర్శన చేసిన మెస్సి.. పీఎస్జీ తరపున మొత్తం 21 గోల్స్‌ కొట్టడంతో పాటు మరో 20 గోల్స్‌ చేయడంలోనూ సహాయపడ్డాడు. అయితే క్లబ్‌తో అతనికి పొసగడం లేదు. తమ అనుమతి లేకుండా సౌదీ అరేబియా వెళ్లాడని అతణ్ని క్లబ్‌ సస్పెండ్‌ చేసింది. ఇప్పుడు ఆ క్లబ్‌ వీడనున్న మెస్సి.. తిరిగి బార్సిలోనాతో చేరతాడనే వార్తలు వస్తున్నాయి. తన 13వ ఏట నుంచి పీఎస్జీకి వచ్చే ముందు వరకూ అతను బార్సిలోనాకే ఆడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని