ముంచినా.. తేల్చినా.. వాళ్లే!

విదేశాల్లో పేస్‌, స్వింగ్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై గత కొన్నేళ్లలో భారత్‌ చిరస్మరణీయ టెస్టు విజయాలు సాధించిందంటే అందుకు ప్రధాన కారణం బౌలర్లు.

Updated : 03 Jun 2023 07:23 IST

విదేశాల్లో పేస్‌, స్వింగ్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై గత కొన్నేళ్లలో భారత్‌ చిరస్మరణీయ టెస్టు విజయాలు సాధించిందంటే అందుకు ప్రధాన కారణం బౌలర్లు. ప్రత్యర్థుల కంటే మెరుగ్గా రాణించిన మన పేసర్లు.. టీమ్‌ఇండియాను పైచేయిలో నిలిపారు. కానీ ఈ మధ్య పాత కథే పునరావృతమవుతోంది. ప్రధాన బౌలర్లకు గాయాలు, ఉన్నవాళ్లకు నిలకడ లేమి సమస్యగా మారింది. మరి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మన బౌలర్లు ఏం చేస్తారో?

ఈనాడు క్రీడావిభాగం

టీమ్‌ఇండియా గత కొన్నేళ్లలో ఆస్ట్రేలియాలో వరుస సిరీస్‌లు సాధించిందన్నా.. ఇంగ్లాండ్‌లో చక్కటి ప్రదర్శన చేసిందన్నా.. అందులో బౌలర్లది ప్రధాన భూమిక. బుమ్రా, షమి, భువనేశ్వర్‌, ఇషాంత్‌, ఉమేశ్‌, అశ్విన్‌, జడేజా.. ఇలా పేసర్లు, స్పిన్నర్లు కలిపి జట్టును విజయాల దిశగా నడిపించారు. కానీ గాయంతో ప్రధాన పేసర్‌ బుమ్రా చాలా కాలం నుంచి జట్టుకు దూరంగా ఉండడం ఏడాదిగా జట్టు పేస్‌ విభాగంపై ప్రభావం చూపుతోంది. ఈ నెల 7న ఆస్ట్రేలియాతో మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్‌ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల బృందాన్ని విడివిడిగా చూస్తే బౌలింగ్‌ విభాగం పర్వాలేదనే అనిపిస్తోంది. కానీ మొత్తంగా బౌలింగ్‌ విభాగాన్ని పరిశీలిస్తే నిలకడైన ప్రదర్శన కనిపించడం లేదు. పేసర్లు షమి, సిరాజ్‌, శార్దూల్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌తో పాటు స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా, అక్షర్‌ జట్టుకు ఎంపికయ్యారు. ఫైనల్‌ జరిగే లండన్‌లోని ఓవల్‌లో ఫాస్ట్‌బౌలర్లదే ఆధిపత్యమనే అంచనాల నేపథ్యంలో మన పేసర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

ఈ ఇద్దరే కీలకం..: బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో షమి, సిరాజ్‌ జట్టుకు కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా షమి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌- 16లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమి (28 వికెట్లు) జోరుమీదున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఇటీవల అతడి రికార్డు గొప్పగా ఉంది. పేస్‌ను అందుకునే విధానం, పిచ్‌ పరిస్థితులను బట్టి వికెట్లు కూల్చే తీరు, నిలకడగా ఒకే ప్రదేశంలో బౌలింగ్‌ చేయడం, స్వింగ్‌పై నియంత్రణ, అవసరమైనప్పుడు బౌన్సర్లతో హడలెత్తించడం.. ఇలాంటి నైపుణ్యాలు అతణ్ని ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను మరింతగా విజృంభిస్తున్నాడు. బంతి పాతబడ్డాక రివర్స్‌ స్వింగ్‌తో షమి అదరగొడుతున్నాడు. కానీ ఇంగ్లాండ్‌లో అతని రికార్డు మాత్రం కలవరపెట్టేదే. 12 టెస్టుల్లో 42.14 సగటుతో 34 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక తక్కువ కాలంలోనే భారత టెస్టు జట్టులో కీలక పేసర్‌గా ఎదిగాడు సిరాజ్‌. దూకుడుతో కూడిన పేస్‌తో బ్యాటర్లపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించే అతను.. నిలకడగా సరైన ప్రదేశాల్లో బౌలింగ్‌ చేస్తూ బ్యాటర్లకు పీడకలను మిగిలిస్తున్నాడు. ముఖ్యంగా కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయడంతో పాటు పిచ్‌ నుంచి అధిక బౌన్స్‌ రాబట్టే నైపుణ్యాలతో బ్యాటర్లకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా బౌలింగ్‌ చేస్తున్న సిరాజ్‌ ఇప్పటివరకూ 18 టెస్టుల్లో 47 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌లో అయితే 5 టెస్టుల్లో 18 వికెట్లు సాధించాడు.

బంతితో పాటు..: ఆరంభంలో బంతిని స్వింగ్‌ చేయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు అందించడంలో శార్దూల్‌ ముందుంటాడు. ఫీల్డింగ్‌ ఏర్పాట్లకు అనుకూలంగా బ్యాటర్లను ఉచ్చులోకి దించడమే అతని ప్రత్యేకత. ఇక బ్యాట్‌తోనూ సత్తాచాటి బ్యాటింగ్‌ ఆర్డర్‌ లోతును పెంచగలడు. ఈ నైపుణ్యాలతోనే టెస్టుల్లో టీమ్‌ఇండియాకు కావాల్సిన ఆటగాడిగా మారుతున్నాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా పట్టు వదలని మొండి ధైర్యంతో అతను పోరాడతాడు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 67 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఓవల్‌లోనే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు నమోదు చేశాడు. 3 వికెట్లతోనూ రాణించాడు. ఇప్పటివరకూ 8 టెస్టులాడిన అతను 27 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శనతో 12 ఏళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో (నిరుడు బంగ్లాదేశ్‌పై)కి వచ్చిన జైదేవ్‌.. ఐపీఎల్‌- 16లో అయిన భుజం గాయం నుంచి కోలుకుని తాజాగా కనిపిస్తున్నాడు. ఈ ఎడమ చేతి వాటం పేసర్‌ తన బౌలింగ్‌ వైవిధ్యంతో ప్రభావం చూపగలడని భావిస్తున్నారు. ఇక సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ ఇప్పటివరకూ ఇంగ్లాండ్‌లో ఆడిన రెండు టెస్టుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఓవల్‌లో ఆడిన మ్యాచ్‌లో 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని