ఆ బౌలర్‌ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్‌

14 ఏళ్ల క్రితం.. అప్పుడు 11 ఏళ్ల వయసున్న ఓ బాలుడు భవిష్యత్‌లో ఇంగ్లాండ్‌ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి నమ్మాడు. దీనిపై పందెం కూడా కాశాడు. ఇప్పుడదే నిజమైంది.

Updated : 03 Jun 2023 03:51 IST

లండన్‌: 14 ఏళ్ల క్రితం.. అప్పుడు 11 ఏళ్ల వయసున్న ఓ బాలుడు భవిష్యత్‌లో ఇంగ్లాండ్‌ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి నమ్మాడు. దీనిపై పందెం కూడా కాశాడు. ఇప్పుడదే నిజమైంది. ఆ ఆటగాడు జోష్‌ టంగ్‌ కాగా.. ఆ వ్యక్తి అతని కుటుంబ సన్నిహితుడు టిమ్‌ పైపర్‌. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌ తరపున 25 ఏళ్ల పేసర్‌ జోష్‌ అరంగేట్రం చేశాడు. దిగ్గజం జేమ్స్‌ అండర్సన్‌ నుంచి అతను టోపీ అందుకున్నాడు. దీంతో గతంలో తాను వేసిన బెట్‌కు గాను పైపర్‌ ఇప్పుడు సుమారు రూ.51.52 లక్షలు (50 వేల పౌండ్లు) గెలిచాడు. ‘‘ఇదెంతో అద్భుతంగా ఉంది. ఈ విషయంతో ఇంతలా ఆదరణ పొందుతానని అనుకోలేదు. జోష్‌ తండ్రి ఫిల్‌ గత 35 ఏళ్లుగా నా స్నేహితుడు. జోష్‌ను క్రికెటర్‌ చేయడం కోసం ఫిల్‌ దంపతులు పడ్డ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు అండర్సన్‌ నుంచి అతను టోపీ అందుకున్న సమయంలో వీళ్లు మైదానంలో ఉండడం ఎంతో గొప్పగా అనిపించింది. ఇదో అద్భుతమైన కథ. మంగళవారం రాత్రి ఒకరు నాకు ఫోన్‌ చేసి జోష్‌ ఇంగ్లాండ్‌కు ఆడుతున్నాడని చెప్పారు. వెంటనే నేను పై అంతస్తుకు వెళ్లి అల్మారాలో బెట్టింగ్‌ రశీదును చూశా. 14 ఏళ్లుగా నా పాస్‌పోర్టు పక్కన  అది అలాగే పడి ఉంది. అతనిపై పందెం కాశానని జోష్‌కు కూడా తెలుసు. ఇప్పుడు నేను 50 వేల పౌండ్లు గెలవడం కంటే.. జోష్‌ కుటుంబం పట్ల చాలా సంతోషంగా ఉంది’’ అని పైపర్‌ శుక్రవారం పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు