ప్రిక్వార్టర్స్‌లో స్వైటెక్‌

టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఆమె 6-0, 6-0తో వాంగ్‌ (చైనా)ను చిత్తు చిత్తుగా ఓడించింది.

Updated : 04 Jun 2023 02:41 IST

రూడ్‌, రూన్‌ ముందుకు
ఫ్రెంచ్‌ ఓపెన్‌
పారిస్‌

టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఆమె 6-0, 6-0తో వాంగ్‌ (చైనా)ను చిత్తు చిత్తుగా ఓడించింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటెక్‌ ముందు.. వాంగ్‌ తేలిపోపోయింది. ఒక్క గేమ్‌ కూడా నెగ్గలేపోయింది. మ్యాచ్‌లో రెండు ఏస్‌లు సంధించిన స్వైటెక్‌ 21 విన్నర్లు కొట్టింది. వాంగ్‌ 22 అనవసర తప్పిదాలు చేసింది. ఆరో సీడ్‌ గాఫ్‌ (అమెరికా) కూడా నాలుగో రౌండ్లో అడుగుపెట్టింది. మూడో రౌండ్లో ఆమె 6-7 (5-7), 6-1, 6-1తో ఆంద్రీవా (రష్యా)పై విజయం సాధించింది. హోరాహోరీ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన గాఫ్‌.. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. తర్వాతి రెండు సెట్లలో ప్రత్యర్థిని అలవోకగా ఓడించింది. గాఫ్‌ 35 విన్నర్లు కొట్టింది. నాలుగో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌) అనారోగ్యంతో మూడో రౌండ్లో సారిబెస్‌ టొర్మోకు వాకోవర్‌ ఇచ్చింది. 14వ సీడ్‌ హదద్‌ మయా (బ్రెజిల్‌) 5-7, 6-4, 7-5తో అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో పెరా 6-4, 7-6 (7-2)తో కొకైరెటోపై, ష్మీద్లోవా 6-1, 6-3తో కేలా డేపై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ రూడ్‌ (నార్వే) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో అతడు 4-6, 6-4, 6-1, 6-4తో జాంగ్‌ (చైనా)పై విజయం సాధించాడు. రూడ్‌ 6 ఏస్‌లు, 39 విన్నర్లు కొట్టాడు. ఆరో సీడ్‌ హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌) అలవోకగా ముందంజ వేశాడు. మూడో రౌండ్లో అతడు 6-4, 6-1, 6-3తో ఒలివీరి (అర్జెంటీనా)ని చిత్తుగా ఓడించాడు. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అతడు మ్యాచ్‌లో 4 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. 9వ సీడ్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) కథ మూడో రౌండ్లోనే ముగిసింది. అతడు 6-3, 3-6, 4-6, 5-7తో సెరుండొలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో నిషియోకా 3-6, 7-6 (10-8), 2-6, 6-4, 6-0తో సెబోత్‌ వైల్డ్‌పై, జారీ 6-2, 6-3, 6-7 (7-9), 6-3తో గిరాన్‌పై, ఎచెవెరీ 6-3, 7-6 (7-5), 6-2తో కోరిచ్‌పై విజయం సాధించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు