World Test Championship: బ్యాటింగ్ మారేనా?
2021లో న్యూజిలాండ్‌తో మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత్ బలంగా కనిపించింది. కానీ.. చివరకు అదే బ్యాటింగ్‌లో వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది.
2021లో న్యూజిలాండ్‌తో మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో భారత్ బలంగా కనిపించింది. కానీ.. చివరకు అదే బ్యాటింగ్‌లో వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడు.. రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరు. దాదాపుగా అదే బ్యాటింగ్ ఆర్డర్‌తో దిగుతున్న టీమ్‌ఇండియా.. ఈ సారి అత్యుత్తమ ప్రదర్శనతో గత చేదు జ్ఞాపకాలను చెరిపేయాలనే పట్టుదలతో ఉంది. మరి.. సీనియర్లు, స్టార్ బ్యాటర్లు, యువ క్రికెటర్లతో నిండి ఉన్న జట్టు.. బ్యాటింగ్‌లో సత్తాచాటి భారత్‌ను విజేతగా నిలుపుతుందా?
ఈనాడు క్రీడావిభాగం
ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనగానే.. ప్రధానంగా భారత బ్యాటర్లకు, కంగారూ బౌలర్లకు మధ్య పోటీ ఉంటుందనే అంటున్నారంతా. కానీ 2021లోనూ ఆ అంచనాలను అందుకోలేక, ఒత్తిడికి నిలబడలేక టీమ్‌ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లిష్ గడ్డపై కివీస్ పేసర్ల ధాటికి చేతులెత్తేశారు. అప్పుడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, పంత్, జడేజా, అశ్విన్‌తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బరిలో దిగింది. ఈ సారి పంత్ మినహా.. మిగతా ఆటగాళ్లందరూ జట్టులో ఉన్నారు. ఇప్పుడు మన బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే కొంత అయోమయంగానే కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ దూరమవడం జట్టుకు దెబ్బ. అదీ కాకుండా గతంలో లాగే ఇప్పుడూ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడి వచ్చారు. ఈ లీగ్‌లో ఆట వేరు. ఇక్కడ నిరంతరంగా మ్యాచ్‌లు ఆడి ఆటగాళ్లు అలసిపోతారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తగ్గట్లుగా తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు అనుగుణంగా ఆటలో సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడదే ఇంగ్లాండ్‌లోని కఠిన పరిస్థితుల్లో కంగారూ బౌలర్ల సవాలును దాటి మన బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకం.
ఆ ఇద్దరు నిలబడితే..: ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా, కోహ్లీలతో ఆస్ట్రేలియాకు ప్రమాదమే’’.. ఇవీ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు. పుజారా, కోహ్లి నిలబడితే ఈ తుది పోరులో భారత్‌కు తిరుగుండదు. వీళ్ల ప్రస్తుత ఫామ్ కూడా అంచనాలను పెంచేదే. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో (2021-23) భారత్ తరపున బ్యాటింగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు పుజారా (887 పరుగులు), కోహ్లి (869)నే. ఇంగ్లాండ్‌లోని కౌంటీల్లో ఆడుతూ.. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకున్న పుజారా జట్టుకు కీలకం కానున్నాడు. ససెక్స్ తరపున ఈ సీజన్‌లో అతను 68.12 సగటుతో 545 పరుగులు చేయడం విశేషం. ఇక ఆస్ట్రేలియా అంటే చాలు పుజారా పరుగుల వేటలో ముందుంటాడు. ఇప్పటివరకూ ఆ జట్టుపై 24 టెస్టుల్లో 2033 పరుగులు సాధించాడు. మరోవైపు చివరిగా ఆడిన టెస్టు (అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా) తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి.. సుదీర్ఘ ఫార్మాట్లో మూడేళ్ల శతక నిరీక్షణకు తెరదించాడు. ఈ బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులతో (4 మ్యాచ్‌ల్లో 297) తిరిగి జోరందుకున్న విరాట్.. ఇటీవల ఐపీఎల్‌లోనూ దూకుడు కొనసాగించాడు. ఇక ఆసీస్ అంటే అతనికి కూడా ప్రియమైన ప్రత్యర్థే. ఈ జట్టుపై ఇప్పటివరకూ 24 టెస్టుల్లో 1979 పరుగులు సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వేదికైన ఓవల్‌లో టీమ్‌ఇండియా చివరగా ఆడిన (2021లో ఇంగ్లాండ్‌తో) టెస్టులోనూ మంచి ప్రదర్శన (50, 44) చేశాడు.
వీళ్లపై ఆశలు..: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్న శుభ్‌మన్ గిల్‌పై భారీ ఆశలే ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్‌లో ఈ యువ ఓపెనర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ అనే కాకుండా.. 2023లో అంతర్జాతీయ క్రికెట్లో గిల్ జోరు మామూలుగా లేదు. బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి ఓ శతకం సహా 154 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతను మంచి ఆరంభాలనిస్తే జట్టు విజయావకాశాలు మెరుగుపడ్డట్లే. మరోవైపు బ్యాటింగ్‌లో సాధికారత ప్రదర్శించలేకపోతున్న రోహిత్‌కు ఓవల్‌లో మంచి రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం. అక్కడ ఒకే టెస్టు (2021 ఇంగ్లాండ్‌తో) ఆడిన అతను.. అందులో సెంచరీ సాధించాడు. విదేశాల్లో అతనికి ఇదే తొలి టెస్టు సెంచరీ. ఇక ఇంగ్లాండ్‌లోనూ 5 మ్యాచ్‌ల్లో 402 పరుగులతో రోహిత్ ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. 16 నెలల తర్వాత మళ్లీ టెస్టు జట్టుకు ఎంపికైన రహానె కూడా లయ అందుకున్నాడు. ఐపీఎల్-16లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో తనలోని కొత్త బ్యాటర్‌ను చూపించిన అతను.. ఈ ఫైనల్లోనూ అదే దృక్పథంతో ఆడాతనని స్పష్టం చేశాడు.
ఆ లోటు తీరేనా?: జట్టు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దూకుడైన బ్యాటింగ్‌తో ఆదుకునే పంత్ లేకపోవడం టీమ్‌ఇండియాకు గట్టి దెబ్బే. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న అతనికి.. విదేశాల్లో మంచి రికార్డు ఉంది. ఓవల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 114, 50 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ డబ్ల్యూటీసీ చక్రంలో అతను 12 మ్యాచ్‌ల్లో 868 పరుగులు చేశాడు. మరి కేఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్.. వికెట్ కీపర్ బ్యాటర్‌గా అతని లోటు తీరుస్తారేమో చూడాలి. ఇంగ్లాండ్‌లో.. అందులోనూ ఓవల్‌లో (2 మ్యాచ్‌ల్లో 249 పరుగులు) మంచి రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేడు. మరోవైపు కొంతకాలంగా టెస్టుల్లో భారత బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్ ప్రదర్శన కీలకంగా మారింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో మన లోయర్ ఆర్డర్ (6 నుంచి 9 వరకు) బ్యాటర్లు 31 ఇన్నింగ్స్‌ల్లో 2,935 పరుగులు చేశారు. సగటు 27.40గా ఉంది. మిగతా జట్లతో పోలిస్తే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సగటులో ఇదే అత్యుత్తమం. ఆటగాళ్ల పరంగా చూస్తే అక్షర్ (45.80 సగటు), పంత్ (43.40), జడేజా (37.39) ప్రదర్శన మెరుగ్గా ఉంది. అదే టాప్-5 బ్యాటర్ల ఉమ్మడి ప్రదర్శన పరిగణలోకి తీసుకుంటే 33 ఇన్నింగ్స్‌లో 34.30 సగటుతో భారత్ ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో జడేజా, అశ్విన్, అక్షర్, శార్దూల్‌ల్లో ఎవరు లోయర్ ఆర్డర్‌లో ఆడినా వారి బ్యాటింగ్ కూడా కీలకం అవుతుంది. బ్యాటింగ్‌లో జడేజా (10 మ్యాచ్‌ల్లో 563)కు ఇంగ్లాండ్‌లో ఉత్తమ రికార్డే ఉంది. ఓవల్‌లో అయితే రెండు మ్యాచ్‌ల్లో కలిపి 126 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral Video: పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి నిజం తెలియడంతో..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు