క్వార్టర్స్‌లో జకోవిచ్‌

పారిస్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలనుకుంటున్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు.

Published : 05 Jun 2023 02:41 IST

అల్కరాస్‌ కూడా ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలనుకుంటున్న నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాదల్‌ (16 సార్లు)ను అధిగమించి రొలాండ్‌గారోస్‌లో అత్యధికసార్లు క్వార్టర్స్‌ చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన నాలుగో రౌండ్లో 36 ఏళ్ల జకోవిచ్‌ 6-3, 6-2, 6-2తో జువాన్‌ పాబ్లో వారిలాస్‌ (పెరూ)ను చిత్తు చేశాడు. 94వ ర్యాంకు వారిలాస్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. ఏడు ఏస్‌లు సంధించిన జకోవిచ్‌.. 35 విన్నర్లు కొట్టాడు. మొదటి సర్వీసులో 80 శాతం విజయవంతమయ్యాడు. 12 బ్రేక్‌ పాయింట్లలో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. మూడో సీడ్‌ జకోవిచ్‌ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా జకోవిచ్‌ (22 టైటిళ్లు) ప్రస్తుతం నాదల్‌తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. 2016, 2021లో ఇక్కడ టైటిల్‌ నెగ్గిన జకోవిచ్‌.. ఈసారి కూడా గెలిస్తే ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం మూడుసార్లు సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. అతడు సెమీఫైనల్లో చోటు కోసం మంగళవారం 11వ సీడ్‌ కచనోవ్‌ను ఢీకొంటాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కచనోవ్‌ (రష్యా) 1-6, 6-4, 7-6 (7), 6-1తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై విజయం సాధించాడు. టాప్‌ సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) కూడా క్వార్టర్స్‌ చేరుకున్నాడు. నాలుగో రౌండ్లో అతడు 6-3, 6-2, 6-2తో ముసెట్టి (ఇటలీ)ని చిత్తుగా ఓడించాడు. టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌.. మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు. జ్వెరెవ్‌ (జర్మనీ) 3-6, 7-6 (7-3), 6-1, 7-6 (7-5)తో తియోఫో (అమెరికా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

పవ్లిచెంకోవా, ముచోవా ముందుకు..: మహిళల సింగిల్స్‌లో ఇద్దరు అన్‌సీడెడ్‌ అమ్మాయిలు పవ్లిచెంకోవా, ముచోవా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో పవ్లిచెంకోవా (రష్యా) 3-6, 7-6 (3), 6-3తో ఎలిసె మెర్టెన్స్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. పవ్లిచెంకోవా 50 విన్నర్లు కొట్టింది. ముచోవా (చెక్‌) 6-4, 6-4తో అవనెస్యన్‌ (రష్యా)ను ఓడించింది. మరో ప్రిక్వార్టర్స్‌లో 9వ సీడ్‌ కసాట్కినా (రష్యా) 4-6, 6-7 (5-7)తో స్వితోలినా (ఉక్రెయిన్‌) చేతిలో పరాజయం పాలైంది. ఏడో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా) 4-6, 6-4, 6-2తో దనిలోవిచ్‌ (సెర్బియా)పై గెలిచి నాలుగో రౌండ్లో ప్రవేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని