టెస్టు క్రికెట్‌ భవిష్యత్తుపై స్మిత్‌ ఆందోళన

టెస్టు క్రికెట్‌ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యూలుపై ప్రభావం పడుతోంది.

Published : 06 Jun 2023 03:01 IST

లండన్‌: టెస్టు క్రికెట్‌ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యూలుపై ప్రభావం పడుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఎంతో కీలకమైన భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలతో.. చిన్న దేశాలు తగినంత టెస్టు క్రికెట్‌ ఆడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మిత్‌ స్పందించాడు. ‘‘నిజమే.. టెస్ట్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై నాకు కాస్త ఆందోళనగానే ఉంది. కానీ టెస్ట్‌ క్రికెట్‌ బతుకుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌ మంచి స్థితిలోనే ఉంది’’ అని భారత్‌తో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సిద్ధమవుతున్న స్మిత్‌ వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి మాట్లాడుతూ.. భారత బౌలింగ్‌ మేళవింపు ఎలా ఉన్నా తమకు గట్టి సవాలు తప్పదని అన్నాడు. భారత్‌కు నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టు సోమవారం చాలా సేపు సాధన చేసింది.

‘‘పదేళ్లకుపైగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్నది వాస్తవమే. కానీ ఆ ఒత్తిడి మాపై లేదు. రెండేళ్ల శ్రమకు దక్కిన ఫలితం ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌. ఈ ప్రయాణంలో సానుకూలతలను తీసుకుని ముందుకు సాగుతాం. ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయం, ఇంగ్లాండ్‌లో డ్రా.. ఇలా ప్రపంచంలో ఏ వేదికలోనైనా గత కొన్నేళ్లుగా అద్భుతంగా పోరాడుతున్నాం. ఈ ఫైనల్‌ ఫలితం కారణంగా అంతకుముందు ఘనతలు మసకబారిపోవు’’

రాహుల్‌ ద్రవిడ్‌, టీమ్‌ఇండియా కోచ్‌


అత్యుత్సాహం వద్దు: అక్రమ్‌

‘‘భారత పేస్‌ బౌలర్లు అనుభవజ్ఞులు. కొత్త బంతితో వాళ్లు అత్యుత్సాహానికి పోకూడదు. బంతి 10-15 ఓవర్లపాటు స్వింగవుతుందని మనందరికి తెలుసు. కాబట్టి ఆ ఓవర్లలో ఫాస్ట్‌ బౌలర్‌ అదనపు పరుగులు ఇవ్వకూడదు. ఆరంభంలో లభించే కాస్త బౌన్స్‌కు మరీ అతిగా సంబరపడిపోవద్దు. ఎందుకంటే..ఆస్ట్రేలియాకు కావాల్సింది అదే’’


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని