Wrestlers Protest: పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సోమవారం స్పష్టం చేశారు.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సోమవారం స్పష్టం చేశారు. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఈ ముగ్గురు తిరిగి రైల్వే ఉద్యోగాల్లో చేరారు. ‘‘ఈ వార్తలు పూర్తిగా తప్పు. న్యాయం కోసం జరిగే పోరాటంలో మాలో ఏ ఒక్కరూ వెనకడుగు వేయలేదు.. వేయం కూడా. ఈ ఆందోళనతో పాటు రైల్వేలో నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. హింస లేకుండా ఎలా ఉద్యమాన్ని కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. నేను రైల్వేలో ఓఎస్డీగా ఉన్నా. నాకెన్నో బాధ్యతలున్నాయి. ధర్నా లేని సమయంలో ఉద్యోగం చేసుకుంటా. మైనర్ రెజ్లర్ ఎఫ్‌ఐఆర్ ఉపసంహరించుకుందనే వార్తలోనూ నిజం లేదు. మా సత్యాగ్రహాన్ని, ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్ర ఇది. కేంద్ర హోం మంత్రితో సమావేశంలో తుది పరిష్కారం దొరకలేదు. నిందితుణ్ని అరెస్టు చేయాలన్నదే మా డిమాండ్. ఈ పోరాటంలో మేం ముగ్గురం (వినేశ్, బజ్‌రంగ్, సాక్షి) కలిసే ఉంటాం. మాకు హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు’’ అని సాక్షి, బజ్‌రంగ్ తెలిపారు.
‘‘తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేవాళ్లు మహిళా రెజ్లర్లు ఎదుర్కొన్న క్షోభను గ్రహించారా? మా పతకాల విలువ రూ.15 అని అన్నవాళ్లే.. ఇప్పుడు మా ఉద్యోగాల వెంట పడుతున్నారు. న్యాయం కోసం ఉద్యోగాన్ని వదులుకోమంటే పది సెకన్లు కూడా ఆలోచించం. మా ఉద్యోగాల పేరుతో భయపెట్టాలని చూడకండి’’ అని వినేశ్ ట్వీట్ చేసింది. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించాడని, అతణ్ని అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి జంతర్‌మంతర్ దగ్గర రెండో సారి ఆందోళనకు రెజ్లర్లు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లూ నమోదు చేశారు. గత నెల 28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ భవనం ముందు ధర్నా చేసేందుకు కదిలిన రెజ్లర్లను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు జంతర్‌మంతర్ దగ్గర శిబిరాన్ని తొలగించారు. కలత చెందిన రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలపాలని నిర్ణయించుకుని, రైతు నేతల జోక్యంతో వెనక్కి తగ్గారు. శనివారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైనప్పటికీ.. రెజ్లర్లకు మంత్రి నుంచి ఆశించిన స్పందన రాలేదని తెలిసింది. మరోవైపు ఈ రెజ్లర్లు మే 31న విధుల్లో చేరినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఉద్యమం ఆగిపోయిందని వస్తున్న వార్తలను రెజ్లర్లు ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
హెచ్‌సీయూ స్థాయిలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు