మెరిసిన ధనుష్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ కుర్రాడు ధనుష్‌ శ్రీకాంత్‌ సత్తా చాటాడు. జోరు ప్రదర్శిస్తూ ఈ తెలుగుతేజం స్వర్ణంతో మెరిశాడు.

Published : 06 Jun 2023 06:12 IST

షూటింగ్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం

జుల్‌ (జర్మనీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌ కుర్రాడు ధనుష్‌ శ్రీకాంత్‌ సత్తా చాటాడు. జోరు ప్రదర్శిస్తూ ఈ తెలుగుతేజం స్వర్ణంతో మెరిశాడు. సోమవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ధనుష్‌ 249.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్లో ఆరో స్థానం సాధించిన ఈ కుర్రాడు (648.4) ఫైనల్లో అదిరే ప్రదర్శన చేశాడు. క్వాలిఫికేషన్లో మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన ప్రథమ్‌ (628.7, అయిదో స్థానం), అభినవ్‌ షా (626.7, ఎనిమిదో స్థానం) తుది సమరంలో తడబడ్డారు. ప్రథమ్‌ నాలుగు, అభినవ్‌ ఏడో స్థానంతో ముగించారు. పుట్టుకతోనే మూగ, చెవిటి వాడైన ధనుష్‌.. గత కొన్నేళ్లుగా షూటింగ్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. గగన్‌ నారంగ్‌ అకాడమీ ‘గన్‌ అండ్‌ గ్లోరీ’లో శిక్షణ పొందిన అతడు 2019 ఖేలో ఇండియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌లో స్వర్ణం సాధించాడు. 2019 ఆసియా జూనియర్‌ షూటింగ్‌లో హ్యాట్రిక్‌ పసిడి పతకాలతో సత్తా చాటిన ధనుష్‌.. 2021 జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ అగ్రస్థానం సాధించాడు.

సంజన జోడీకి కాంస్యం: మిక్స్‌డ్‌ టీమ్‌ స్కీట్‌లో హర్‌మెహర్‌-సంజన సూద్‌ కాంస్యం నెగ్గారు. షూటాఫ్‌లో డేవిడ్‌ జాన్సన్‌-ఫెలిసియా రోస్‌ (స్వీడన్‌)ను ఓడించారు.మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


ఇషాకు రజతం

భోపాల్‌: కుమార్‌ సురేంద్ర సింగ్‌ స్మారక షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ రజతంతో మెరిసింది. సోమవారం సీనియర్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఆమె రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆమె 31 స్కోరుతో వెండి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రహి సర్నోబత్‌ (మహారాష్ట్ర- 36) స్వర్ణం, చింకి యాదవ్‌ (మధ్యప్రదేశ్‌- 28) కాంస్యం సొంతం చేసుకున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు