మలేసియాపై భారత్‌ గెలుపు

మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీలో భారత్‌ జోరు కొనసాగుతోంది. సోమవారం పూల్‌-ఎ పోరులో భారత్‌ 2-1తో మలేసియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే డయాన్‌ నజెరి గోల్‌ చేసి మలేసియా ఖాతా తెరిచింది.

Published : 06 Jun 2023 06:02 IST

మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ

కకమిగార (జపాన్‌): మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీలో భారత్‌ జోరు కొనసాగుతోంది. సోమవారం పూల్‌-ఎ పోరులో భారత్‌ 2-1తో మలేసియాపై విజయం సాధించింది. ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలోనే డయాన్‌ నజెరి గోల్‌ చేసి మలేసియా ఖాతా తెరిచింది. అయితే పదో నిమిషంలో భారత క్రీడాకారిణి ముంతాజ్‌ ఖాన్‌ గోల్‌ సాధించి స్కోరును సమం చేసింది. 26వ నిమిషంలో దీపిక గోల్‌తో భారత్‌ 2-1తో ఆధిక్యం సంపాదించింది. వరుసగా రెండో విజయంతో భారత్‌.. పూల్‌-ఎలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ 22-0తో ఉజ్బెకిస్తాన్‌పై ఘన విజయం అందుకుంది. మంగళవారం కొరియాతో భారత్‌ తలపడుతుంది.


హారిక పరాజయం

సెయింట్‌ లూయిస్‌: కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో తొలి రౌండ్లో గెలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు రెండో రౌండ్లో చుక్కెదురైంది. అలెగ్జాండర్‌ కొస్తెనిక్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఈ తెలుగమ్మాయి పరాజయం చవిచూసింది. మరోవైపు తొలి రౌండ్లో ఓడిన కోనేరు హంపి.. రెండో రౌండ్లో ఇరినా క్రస్‌ (అమెరికా)తో డ్రా చేసుకుంది. ప్రస్తుతం హారిక (1 పాయింట్‌) అయిదు, హంపి (0.5) ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.


స్పెషల్‌ ఒలింపిక్స్‌కు 255 మంది

దిల్లీ: స్పెషల్‌ ఒలింపిక్స్‌ ప్రపంచ క్రీడలకు భారత్‌ నుంచి 255 మంది బృందం వెళ్లనుంది. ఈనెల 17 నుంచి 25 వరకు జర్మనీలోని బెర్లిన్‌లో జరుగనున్న ఈ పోటీల్లో 16 క్రీడాంశాల్లో 198 మంది భారత క్రీడాకారులు, వారి సహాయకులు బరిలో దిగుతారు. 57 మంది కోచ్‌లు భారత బృందంలో ఉన్నారు. మానసిక వికలాంగులకు నిర్వహించే ఈ మెగా టోర్నీలో 190 దేశాల నుంచి 26 క్రీడాంశాల్లో 7000 మంది క్రీడాకారులు, వారి సహాయకులు పాల్గొంటున్నారు.


వయసు మోసాల అడ్డుకట్టకు బాయ్‌ పథకం

ముంబయి: వయో సంబంధిత మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కొత్త పథకాన్ని ప్రారంభించింది. పుట్టిన రోజు తేదీలో తప్పులు.. వయసు వ్యత్యాసాల్ని సరిదిద్దుకోవడం కోసం స్వచ్ఛంద వయసు దిద్దుబాటు పథకం (వీఏఆర్‌ఎస్‌) మొదలుపెట్టింది. బాయ్‌ గుర్తింపు కార్డులున్న క్రీడాకారులు 20 రోజుల్లోపు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. నిర్దేశిత గడువు తర్వాత దోషులుగా తేలిన వాళ్లపై నిషేధంతో సహా కఠినమైన చర్యలు ఉంటాయని బాయ్‌ పేర్కొంది.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని