WTC Final: ఆ ఇద్దరు ఎవరు?

భారత్‌కు తుది జట్టు ఎంపిక కొంచెం తలనొప్పిగానే మారింది. రెండు స్థానాల కోసం నలుగురు పోటీలో ఉన్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎస్‌ భరత్‌ వైపే మొగ్గు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఇషాన్‌ కిషన్‌ అవకాశాలను కొట్టి పారేయలేం! వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంలో భరత్‌ది పైచేయి కాగా.. బ్యాటింగ్‌లో ఇషాన్‌కు ఎక్కువ మార్కులు పడతాయి.

Updated : 07 Jun 2023 07:32 IST

భారత్‌కు తుది జట్టు ఎంపిక కొంచెం తలనొప్పిగానే మారింది. రెండు స్థానాల కోసం నలుగురు పోటీలో ఉన్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎస్‌ భరత్‌ వైపే మొగ్గు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఇషాన్‌ కిషన్‌ అవకాశాలను కొట్టి పారేయలేం! వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంలో భరత్‌ది పైచేయి కాగా.. బ్యాటింగ్‌లో ఇషాన్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. స్వింగ్‌ పరిస్థితుల్లో అనుభవం లేని ఇషాన్‌ బ్యాటింగ్‌లో రాణిస్తాడన్న ఆశలు తక్కువే కాబట్టి భరత్‌కే తుది జట్టులో చోటు దక్కొచ్చని అంచనా. ఇక ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగాలా.. లేక ఒక స్పిన్నర్‌ను తగ్గించుకుని నాలుగో పేసర్‌ను ఎంచుకోవాలా అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో నాలుగో పేసర్‌ను ఆడించడమే మేలు. కానీ ఓవల్‌ పిచ్‌ స్పిన్నర్లకూ కూడా సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో జడేజాకు తోడుగా అశ్విన్‌ను ఆడించే అవకాశాన్ని పరిశీలిస్తోంది టీమ్‌ఇండియా. లేదంటే షమి, సిరాజ్‌, ఉమేశ్‌లకు తోడుగా శార్దూల్‌ను దించొచ్చు.


పిచ్‌.. స్పిన్నర్లకూ!

ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌ అంటే ప్రధానంగా పేసర్లదే ఆధిపత్యం. కానీ ఆ దేశంలో స్పిన్‌కు ఎక్కువ సహకారం అందించే మైదానాల్లో ఓవల్‌ ఒకటి. ఇక్కడ జరిగిన చివరి 10 టెస్టుల్లో పేసర్లతో పోలిస్తే స్పిన్నర్ల సగటే మెరుగ్గా ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ స్పిన్‌కు సహకారం ఉంటుంది. అయితే ఆధిపత్యం పేసర్లదే కావచ్చని తెలుస్తోంది. పిచ్‌పై మంచి బౌన్స్‌ ఉన్నట్లు క్యురేటర్‌ తెలిపాడు. ఉదయం పేసర్లను ఎదుర్కోవడం కష్టమే. ఆ సవాలును కాచుకుంటే.. తర్వాత పరుగులు చేయొచ్చు. మబ్బులు పట్టిన సమయంలో బ్యాటింగ్‌ మరింత కష్టంగా మారొచ్చు.


రోహిత్‌కు చిన్న గాయం

ప్రాక్టీస్‌ సందర్భంగా రోహిత్‌శర్మ వేలి గాయం టీమ్‌ఇండియాను కాస్త కంగారు పెట్టింది. మంగళవారం సహచరులు అశ్విన్‌, ఉమేశ్‌, భరత్‌లతో కలిసి రోహిత్‌ ఐచ్ఛిక సాధనలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఓ బంతి అతడి ఎడమ చేతి బొటన వేలికి తాకడంతో ఇబ్బంది పడ్డాడు. గాయం ప్రమాదకరమేమీ కాదని.. మ్యాచ్‌కు రోహిత్‌ అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.


వర్షం ముప్పుంది..

ఇంగ్లాండ్‌లో ఏడాది పొడవునా వరుణుడు పలకరిస్తూనే ఉంటాడు.  గత పర్యాయం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కూ వర్షం బెడద తప్పలేదు. ఆ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకి వెళ్లింది. ఇప్పుడు కూడా డబ్ల్యూటీసీ తుది పోరుకు వరుణుడు అడ్డుపడే సూచనలున్నాయి. కాకపోతే తొలి మూడు రోజుల్లో ఆటకు వర్షం ముప్పు ఉండదని అంచనా. చివరి రెండు రోజుల్లో మాత్రం వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది. వర్షం కూడా పడొచ్చు. అయిదు రోజుల ఆటలో చెప్పుకోదగ్గ స్థాయికి ఆటకు నష్టం వాటిల్లి, మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే రిజర్వ్‌ డేని ఉపయోగించుకుంటారు. ఆ రోజూ ఫలితం రాకపోతే రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని