‘లక్ష్య’ హిమతేజకు కాంస్యం

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ (ఆంధ్రప్రదేశ్‌) అంతర్జాతీయ వేదికపై సత్తాచాటాడు. ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు.

Published : 07 Jun 2023 03:22 IST

ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌

ఇంచియాన్‌ (కొరియా): ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ (ఆంధ్రప్రదేశ్‌) అంతర్జాతీయ వేదికపై సత్తాచాటాడు. ఆసియా జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. మంగళవారం అండర్‌-20 పురుషుల 4×100 మీటర్ల రిలే రేసును హిమతేజ, అరిజిత్‌ రానా, మహ్మద్‌ రియాన్‌ బాషా, దొండపాటి మృత్యుంజయ రామ్‌లతో కూడిన భారత జట్టు 40.56 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది. జపాన్‌ (39.76 సె) ప్రథమ, కొరియా (40.32 సె) ద్వితీయ స్థానాలు సాధించాయి. హైదరాబాద్‌లోని ‘లక్ష్య’ గోపీచంద్‌ హై పర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ద్రోణాచార్య నాగపురి రమేశ్‌ ఆధ్వర్యంలో హిమతేజ శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు మహిళల 4×100 మీటర్ల పరుగులోనూ భారత్‌కు కాంస్య పతకం లభించింది. తమన్నా, అక్షయ, నయన, అభినయలతో కూడిన భారత బృందం 45.36 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానం సాధించింది. చైనా (45.05 సె) ప్రథమ, థాయ్‌లాండ్‌ (45.34 సె) ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.


సునీల్‌కు పసిడి

డెకాథ్లాన్‌లో సునీల్‌ కుమార్‌ (7003 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. కెరీర్‌లో సునీల్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పోటీల తొలిరోజు 3597 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచిన ఈ భారత అథ్లెట్‌.. మంగళవారం మెరుగ్గా రాణించి పసిడి ఎగరేసుకుపోయాడు. ఈ టోర్నీ కోసం విమానంలో తన సొంత పోల్‌ను తీసుకెళ్లాలనుకున్న సునీల్‌ ప్రయత్నాన్ని ఎయిర్‌ ఇండియా, దక్షిణ కొరియా ఎయిర్‌లైన్స్‌ అడ్డుకున్నాయి. పోల్‌ పొడవు ఎక్కువ ఉండడమే ఇందుకు కారణం. దీంతో భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య విజ్ఞప్తితో నిర్వాహకుల నుంచి ఓ పోల్‌ను సంపాదించిన సునీల్‌ ఆ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల హైజంప్‌లో పూజ (1.82 మీ), 3000 మీ. స్టీఫుల్‌ఛేజ్‌లో బుష్రా ఖాన్‌ (9 నిమిషాల 41.47 సెకన్లు) రజతాలు సాధించారు.


ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు శ్యామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు ఇంజమూరి శ్యామ్‌ (ఆంధ్రప్రదేశ్‌) ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగనున్నాడు. జులై 5 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు శ్యామ్‌ ఎంపికయ్యాడు. పురుషుల ఎఫ్‌44 విభాగం హైజంప్‌లో శ్యామ్‌ పోటీపడతాడు.


డ్రాతో గట్టెక్కిన భారత్‌

కకామిగారా: మహిళల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్‌.. మంగళవారం కొరియాతో పోరులో తడబడి చివరికి డ్రాతో గట్టెక్కింది. పూల్‌-ఏ మ్యాచ్‌లో ఒక దశలో 0-2తో వెనుకబడిన ప్రీతి బృందం చివర్లో రెండు గోల్స్‌ కొట్టి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది.


హంపి-హారిక గేమ్‌ డ్రా

సెయింట్‌లూయిస్‌: కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో కోనేరు హంపి-ద్రోణవల్లి హారిక డ్రా చేసుకున్నారు. మంగళవారం జరిగిన మూడో రౌండ్లో ఈ తెలుగమ్మాయిలు 32 ఎత్తుల్లో డ్రాగా ముగించారు. దీంతో మూడు రౌండ్ల తర్వాత హారిక (1.5 పాయింట్లు) నాలుగో స్థానం.. హంపి (1) ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. అలెగ్జాండ్రా కొస్తెనిక్‌ (స్విట్జర్లాండ్‌, 2) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు