సింధు ఫామ్‌పై ఆందోళన లేదు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఫామ్‌పై ఆందోళన లేదని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు.  వరుసగా థాయ్‌లాండ్‌ ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌లలో సింధు తొలి రౌండ్లోనే పరాజయం చవిచూసింది.

Published : 08 Jun 2023 02:17 IST

కోల్‌కతా: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఫామ్‌పై ఆందోళన లేదని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు.  వరుసగా థాయ్‌లాండ్‌ ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌లలో సింధు తొలి రౌండ్లోనే పరాజయం చవిచూసింది. ‘‘సింధు వయసు 26-27 ఏళ్లు మాత్రమే. ఆమె ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్‌, ఒలింపిక్స్‌ అర్హతకు ఇది ఆరంభమే. ఇప్పటి వరకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గాయం నుంచి కోలుకున్నాక 6 నుంచి 8 నెలలు అత్యుత్తమంగా రాణించింది. ఆమె బాగా ఆడటం ప్రారంభించింది. భవిష్యత్తులో భారత్‌కు పతకం అందించగల క్రీడాకారుల్లో కచ్చితంగా సింధు ఒకరు’’ అని గోపీచంద్‌ పేర్కొన్నారు.


సాత్విక్‌ జోడీ ఓటమి

సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఈ ద్వయం 18-21, 21-14, 18-21 తేడాతో అన్‌సీడెడ్‌ అకీర- తైచి (జపాన్‌) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి- ట్రీసా 14-21, 21-18, 19-21తో టింగ్‌- లామ్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు.


ఒడిషా ప్రమాద బాధితులకు నివాళి

లండన్‌: ఒడిషా రైలు ప్రమాదంలో మృతులకు భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లు నివాళి అర్పించాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు నిమిషం పాటు మౌనం పాటించారు. భారత క్రికెటర్లతో పాటు ఆస్ట్రేలియన్లూ చేతికి నల్ల బాడ్జీలు ధరించి మ్యాచ్‌లో బరిలోకి దిగడం గమనార్హం.




.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని