రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక విరామం

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు బుధవారం తాత్కాలిక విరామం ప్రకటించారు.

Published : 08 Jun 2023 05:35 IST

దిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు బుధవారం తాత్కాలిక విరామం ప్రకటించారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్న కేంద్రం కోరిక మేరకు ఉద్యమాన్ని వారం పాటు నిలిపివేస్తున్నట్లు రెజ్లర్లు వెల్లడించారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో దాదాపు అయిదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో రెజ్లర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘జూన్‌ 15లోపు పోలీసుల విచారణ పూర్తవుతుందని చెప్పారు. అప్పటివరకూ ఓపికతో ఉండాలని, ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని కోరారు. అలాగే గత నెల 28న రెజ్లర్లపై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లనూ కొట్టివేస్తామన్నారు’’ అని సాక్షి తెలిపింది. ‘‘రెజ్లర్ల డిమాండ్ల మేరకు బ్రిజ్‌ భూషణ్‌ కేసులో ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తారని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు జరుగుతాయని చెప్పాం. డబ్ల్యూఎఫ్‌ఐలో ఏర్పాటు చేసి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి మహిళనే అధ్యక్షురాలిగా ఉంటుందని స్పష్టం చేశాం’’ అని మంత్రి అనురాగ్‌ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని