అల్కరాస్‌ వచ్చేశాడు

భారీ అంచనాలున్న టాప్‌ సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-2, 6-1, 7-6 (7-5)తో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు.

Published : 08 Jun 2023 02:21 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌
సెమీస్‌లో జకోవిచ్‌తో సై
క్వార్టర్స్‌లో స్వైటెక్‌ విజయం

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఓ రసవత్తర సమరాన్ని చూడబోతున్నాం. టైటిల్‌ ఫేవరెట్లు ఫైనల్‌కు ముందే తలపడనున్నారు. జోరును కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన కుర్ర స్టార్‌, ప్రపంచ నంబర్‌వన్‌ అల్కరాస్‌.. ఫైనల్లో చోటు కోసం రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్‌ను ఢీకొట్టనున్నాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

భారీ అంచనాలున్న టాప్‌ సీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-2, 6-1, 7-6 (7-5)తో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు. కొన్నేళ్లపాటు పురుషుల టెన్నిస్‌ను ఏలుతాడని భావిస్తున్న అల్కరాస్‌ క్వార్టర్స్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బలమైన ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో సిట్సిపాస్‌ను బేస్‌లైన్‌కు చాలా వెనుక ఆడేలా చేసిన అల్కరాస్‌.. ఆ తర్వాత డ్రాప్‌ షాట్లతో అతణ్ని బోల్తా కొట్టించాడు. సిట్సిపాస్‌ పదునైన సర్వీసులనూ అతడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఎటాకింగ్‌ ఆటతో మూడు, ఏడో గేముల్లో బ్రేక్‌లతో తొలి సెట్‌ను అలవోకగా చేజిక్కించుకున్న అల్కరాస్‌.. రెండో సెట్లోనూ అదరగొట్టాడు.  అయితే మూడో సెట్లో సిట్సిపాస్‌ ప్రతిఘటించాడు. రెండో గేమ్‌లోనే సర్వీసు కోల్పోయి 3-5తో వెనుకబడ్డ అతడు.. తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి మ్యాచ్‌పై కాస్త ఆసక్తి రేపాడు. చివరికి టైబ్రేక్‌ తప్పలేదు. కానీ అక్కడ పైచేయి సాధించిన అల్కరాస్‌ పోరును ముగించాడు. సిట్సిపాస్‌ అయిదు డబుల్‌ ఫాల్ట్‌లు, 30 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. టైటిల్‌పై కన్నేసిన అల్కరాస్‌.. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో మూడో సీడ్‌ జకోవిచ్‌ను ఢీకొంటాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఆటగాడే ట్రోఫీ గెలుస్తాడని అంచనా. గతంలో ఈ ఇద్దరూ ఒకేసారి తలపడగా.. అందులో అల్కరాస్‌ పైచేయి సాధించాడు. మరోవైపు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) కూడా సెమీఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్లో జ్వెరెవ్‌ 6-4, 3-6, 6-3, 6-4తో ఎచెవెరీ (అర్జెంటీనా)ని ఓడించాడు.

మయా ముందుకు: మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-4, 6-2తో అమెరికాకు చెందిన ఆరో సీడ్‌ కొకో గాఫ్‌ను మట్టికరిపించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ స్వైటెక్‌ మ్యాచ్‌లో 19 విన్నర్లు కొట్టింది. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. సెమీస్‌లో ఆమె 14వ సీడ్‌ హదద్‌ మయాను ఢీకొంటుంది. క్వార్టర్స్‌లో మయా 3-6, 7-6 (7-5), 6-1తో ఏడో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది. 4 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టిన మయా.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. 1968 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌ చేరిన తొలి బ్రెజిల్‌ మహిళగా మయా ఘనత సాధించింది. మరో సెమీఫైనల్లో సబలెంక, ముచోవా తలపడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని