WTC Final 2023: తొలి రోజు కంగా‘రూల్‌’

ఆరంభంలో చకచకా కొన్ని వికెట్లు పడగొట్టి ఆశలు రేకెత్తించడం.. ఆ తర్వాత ఆ వాడిని కొనసాగించలేక చేతులెత్తేయడం! ఎప్పట్నుంచో భారత బౌలర్లది ఇదే బలహీనత!

Updated : 08 Jun 2023 09:25 IST

భారత బౌలర్లు విఫలం
హెడ్‌ మెరుపు శతకం.. రాణించిన స్మిత్‌
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ పైచేయి

ఆరంభంలో చకచకా కొన్ని వికెట్లు పడగొట్టి ఆశలు రేకెత్తించడం.. ఆ తర్వాత ఆ వాడిని కొనసాగించలేక చేతులెత్తేయడం! ఎప్పట్నుంచో భారత బౌలర్లది ఇదే బలహీనత!
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ అదే కథ పునరావృతం అయింది. పచ్చిక పిచ్‌ మీద, అనుకూల పరిస్థితుల్లో భారత పేసర్ల దాడికి 76/3తో కష్టాల్లో పడ్డట్లు కనిపించింది ఆస్ట్రేలియా. కానీ 23 ఓవర్లకే 3 వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. మధ్యాహ్నం నుంచి మారిపోయిన పరిస్థితుల్లో 62 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్కటంటే ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయారు.

ఇంగ్లాండ్‌ ‘బజ్‌బాల్‌’ ఆటను గుర్తు చేస్తూ..   వన్డే క్రికెట్‌ ఆడుతున్నట్లుగా చెలరేగిపోయిన  ట్రావిస్‌ హెడ్‌.. భారత్‌ ఆశలకు బ్రేకులేశాడు. స్టీవ్‌ స్మిత్‌ ఎప్పట్లాగే క్రీజులో పాతుకుపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు ఆస్ట్రేలియాదే  పూర్తి పైచేయి అయింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టాస్‌ మనదే.. ఆరంభం మనదే.. కానీ తొలి రోజు చివరికి మాత్రం ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన ట్రావిస్‌ హెడ్‌ (146 బ్యాటింగ్‌; 156 బంతుల్లో 22×4, 1×6) వేగంగా మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపు లాగేశాడు. భారత బౌలర్లకు ఎన్నో మ్యాచ్‌ల్లో కొరకరాని కొయ్యలా మారిన స్టీవ్‌ స్మిత్‌ (95 బ్యాటింగ్‌; 227 బంతుల్లో 14×4) నుంచి అతడికి గొప్ప సహకారం అందడంతో తొలి రోజు ఆట ఆఖరుకు ఆస్ట్రేలియా 327/3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో సిరాజ్‌ (1/67), షమి (1/77), శార్దూల్‌ (1/75) ఆరంభంలో ఆకట్టుకుని ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రెండో రోజు సాధ్యమైనంత త్వరగా ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేయకపోతే మ్యాచ్‌పై భారత్‌ ఆశలు వదులుకోవాల్సిందే.

అనుకూలించినంతసేపు..: కాస్త మబ్బులు కమ్మిన వాతావరణం.. పిచ్‌ మీద పచ్చిక.. ఈ పరిస్థితుల్లో ఏ కెప్టెన్‌ అయినా టాస్‌ గెలిస్తే ఏం చేస్తాడు? రోహిత్‌ కూడా అదే చేశాడు. బౌలింగ్‌ ఎంచుకున్నాడు. షమి, సిరాజ్‌ బుల్లెట్‌ లాంటి బంతులతో ఆస్ట్రేలియా ఓపెనర్లను పరీక్షించారు. వార్నర్‌, ఖవాజాల తడబాటు చూస్తే ఏ క్షణమైనా వికెట్‌ పడేలాగే కనిపించింది. అందుకు తగ్గట్లే ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఖవాజా (0)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల ఊరించేలా వేసిన బంతిని ఆడబోయి ఖవాజా వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. తొలి గంటలో షమి, సిరాజ్‌ పూర్తి ఆధిపత్యం చలాయించారు. సిరాజ్‌ను ఆడటం ఆసీస్‌ బ్యాటర్లకు చాలా కష్టంగానే కనిపించింది. డ్రింక్స్‌ విరామానికి 12 ఓవర్లలో ఆసీస్‌ వికెట్‌ నష్టపోయి 29 పరుగులే చేసింది. అయితే కాసేపటికే మైదానంలో ఎండ కాయడం మొదలై నెమ్మదిగా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడం మొదలైంది. దీంతో వార్నర్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. పెద్దగా ప్రభావం చూపని మూడో పేసర్‌ ఉమేశ్‌ను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదాడు. వార్నర్‌ (43; 60 బంతుల్లో 8×4) ఊపు చూస్తే ఇక అతణ్ని ఆపడం కష్టమే అనిపించింది. అయితే లంచ్‌కు కాస్త ముందు శార్దూల్‌ బంతిని ఫైన్‌ లెగ్‌ వైపు షాట్‌ ఆడబోయిన వార్నర్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 73/2తో లంచ్‌కు వెళ్లిన ఆసీస్‌.. విరామం నుంచి రాగానే లబుషేన్‌ (26) వికెట్‌ కోల్పోయింది. షమి.. లబుషేన్‌ కాళ్ల ముందు వేసిన వేగవంతమైన బంతి స్టంప్స్‌ను లేపేసింది. 76/3తో ఆస్ట్రేలియా కష్టాల్లో పడ్డట్లే కనిపించింది.

అతడే విలన్‌: గంటల కొద్దీ క్రీజులో నిలబడే లబుషేన్‌ ఔటైపోవడంతో ఇక ఆస్ట్రేలియాకు అంత తేలిక కాదనిపించింది. భారత బౌలర్లు ఇదే ఊపులో తొలి రోజే ఆ జట్టును ఆలౌట్‌ చేసేస్తారేమో అన్న ఆశలు కూడా అభిమానుల్లో కలిగాయి. కానీ మూడో వికెట్‌ తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. సొంతగడ్డపై సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆస్ట్రేలియా టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారిన ట్రావిస్‌ హెడ్‌.. భారత బౌలర్లకు పెద్ద విలన్‌గా మారాడు. 5 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయినపుడు.. కొత్తగా వచ్చే ఏ బ్యాటర్‌ అయినా ఆచితూచి ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ అలా ఆడితే జట్టు ఆత్మరక్షణలో పడుతుందని.. భారత బౌలర్లు మరింత విజృంభిస్తారని అనుకున్నాడేమో.. హెడ్‌ వచ్చీ రాగానే ఎదురుదాడి మొదలుపెట్టాడు. వీక్షకులకు వన్డే క్రికెట్‌ చూస్తున్న భావన కలిగిస్తూ బౌండరీల మోత మోగించాడు. 60 బంతుల్లోనే 9 ఫోర్లతో చూస్తుండగానే అర్ధశతకం బాదేశాడతను. స్మిత్‌ ఓ ఎండ్‌లో ఆచితూచే ఆడుతున్నా.. హెడ్‌ మాత్రం దూకుడుగానే బ్యాటింగ్‌ చేశాడు. అర్ధశతకం తర్వాత కూడా ఆగలేదు. స్పిన్నర్‌ జడేజా అతణ్ని కొంత ఇబ్బంది పెట్టినా.. తన జోరు మాత్రం తగ్గలేదు. షమి, సిరాజ్‌ ఆసీస్‌ జోడీని కొంత పరీక్షించినా.. శార్దూల్‌, ఉమేశ్‌ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్‌ రోహిత్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. టీ విరామానికి 170/3తో ఉన్న ఆసీస్‌.. చివరి సెషన్లో పూర్తిగా మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. స్మిత్‌ సైతం చివరి సెషన్లో దూకుడు పెంచడంతో దాదాపు 5 రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. 106 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన హెడ్‌.. తర్వాతా దూకుడు కొనసాగించాడు. ఆఖర్లో అయినా ఒకట్రెండు వికెట్లు పడతాయేమో అని ఆశించిన భారత్‌కు నిరాశ తప్పలేదు. చివరి సెషన్లో ఆసీస్‌ 34 ఓవర్లలోనే 157 పరుగులు చేయడం విశేషం.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) భరత్‌ (బి) శార్దూల్‌ 43; ఖవాజా (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 0; లబుషేన్‌ (బి) షమి 26; స్మిత్‌ బ్యాటింగ్‌ 95; హెడ్‌ బ్యాటింగ్‌ 146; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327

వికెట్ల పతనం: 1-2, 2-71, 3-76

బౌలింగ్‌: షమి 20-3-77-1; సిరాజ్‌ 19-4-67-1; ఉమేశ్‌ 14-4-54-0; శార్దూల్‌ 18-2-75-1; జడేజా 14-0-48-0

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని