సంక్షిప్త వార్తలు (7)
తెలంగాణ అథ్లెట్ జీవంజి దీప్తి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఫ్రాన్స్‌లో జరిగిన వర్చుస్ గ్లోబల్ గేమ్స్ మహిళల 400 మీటర్ల పరుగు టీ20 విభాగంలో ఆమె రజతం సొంతం చేసుకుంది.
దీప్తికి రజతం
విషి (ఫ్రాన్స్): తెలంగాణ అథ్లెట్ జీవంజి దీప్తి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఫ్రాన్స్‌లో జరిగిన వర్చుస్ గ్లోబల్ గేమ్స్ మహిళల 400 మీటర్ల పరుగు టీ20 విభాగంలో ఆమె రజతం సొంతం చేసుకుంది. 58.07 సెకన్లలో రేసు ముగించిన దీప్తి రెండో స్థానాన్ని దక్కించుకుంది. షులియర్ (ఉక్రెయిన్- 56.25సె) స్వర్ణం, లిజాన్షెల (ఈక్వెడార్- 59.42సె) కాంస్యం కైవసం చేసుకున్నారు. 400మీ. పరుగులో అంతర్జాతీయ స్థాయిలో దీప్తికిది మూడో పతకం.
హారిక హ్యాట్రిక్
సెయింట్‌లూయిస్: కెయిన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారిక డ్రాల హ్యాట్రిక్ కొట్టింది. గురువారం అనా జొటాన్‌స్కీ (అమెరికా)తో జరిగిన అయిదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్.. 51 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. మూడో రౌండ్లో కోనేరు హంపి, నాలుగో రౌండ్లో మమద్ గునాయ్‌తో ఈ తెలుగమ్మాయి డ్రా చేసుకుంది. అయిదు రౌండ్ల తర్వాత హారిక (2 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతోంది. అనా జొటాన్‌స్కీ (అమెరికా, 3.5) అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో మరో నాలుగు రౌండ్లు మిగిలున్నాయి.
శ్రీకాంత్ ఓటమి
సింగపూర్: సింగపూర్ ఓపెన్ ప్రపంచ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా మిగతా క్రీడాకారులంతా ఇంటిముఖం పట్టారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 15-21, 19-21తో చియా హావొ లీ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రియాంశు రజావత్ 17-21, 16-21తో కొడయ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అర్జున్- ధ్రువ్ జోడీ 15-21, 19-21తో బెన్ లేన్- సీన్ వెండీ (ఇంగ్లాండ్) జంట చేతిలో పరాజయం పాలయింది.
సెమీస్‌లో స్నేహిత్
ఈనాడు, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ కుర్రాడు ఫిదెల్ రఫీక్ స్నేహిత్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. గురువారం స్థానిక ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్, రిసార్ట్స్‌లో జరిగిన క్వార్టర్స్‌లో అతను 3-1 (7-11, 11-7, 12-10, 11-9) తేడాతో పాయస్ జైన్ (దిల్లీ)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ఓడినప్పటికీ స్నేహిత్ తిరిగి బలంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌ల్లో గెలిచి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆకుల శ్రీజ (ఆర్బీఐ) 2-3తో యశస్విని (కర్ణాటక) చేతిలో ఓడింది.
షూటింగ్‌లో అగ్రస్థానంతో..
జుల్ (జర్మనీ): జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీని భారత్ (6 స్వర్ణ, 6 రజత, 3 కాంస్యాలు) అగ్రస్థానంతో ముగించింది. కొరియా (5 స్వర్ణ, 6 రజత, 1 కాంస్యం) రెండో స్థానంలో నిలిచింది. ఈ కప్‌లో ధనుష్ శ్రీకాంత్ (10 మీ ఎయిర్ రైఫిల్), మేఘన-పాయల్-సిమ్రన్‌ప్రీత్ (మహిళల 25 మీ పిస్టల్ టీమ్), అమన్‌ప్రీత్‌సింగ్ (25 మీ పిస్టల్), అభినవ్‌షా-గౌతమి (10 మీ ఎయిర్‌రైఫిల్ మిక్స్‌డ్ టీమ్), స్వాతి-గౌతమి-సోనమ్ (మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ టీమ్) స్వర్ణాలు నెగ్గారు. 2019 నుంచి ఈ టోర్నీలో పతకాల్లో భారత్‌దే తొలి స్థానం కావడం విశేషం. గురువారం, పోటీల ఆఖరిరోజు ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లు నిరాశపరిచారు. పురుషుల్లో బక్త్యారుద్దీన్ 23, తర్వీజ్‌సింగ్ సంధు 48 స్థానాలతో సరిపెట్టుకున్నారు. మహిళల్లో భవ్య త్రిపాఠి 9, అషిమా 15 స్థానాలు దక్కించుకున్నారు.
అర్జెంటీనాపై భారత్ గెలుపు
ఐండోహోవెన్ (నెదర్లాండ్స్): ప్రొ లీగ్ హాకీ టోర్నమెంట్లో బుధవారం నెదర్లాండ్స్ చేతిలో ఓడిన భారత్ పుంజుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం 3-0 గోల్స్‌తో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాను చిత్తు చేసింది. 33వ నిమిషంలో పెనాల్టీకార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత భారత్ మరింత విజృంభించింది. వరుస దాడులతో ఫలితాలు సాధించింది. అమిత్ రోహిదాస్ (39వ నిమిషం) పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయగా.. ఆట ఆఖర్లో అభిషేక్ (59వ నిమిషం) బంతిని లక్ష్యానికి చేర్చి జట్టుకు ఘన విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో భారత్ (14 మ్యాచ్‌ల్లో 27 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు మ్యాచ్‌లో భారత్ 1-4తో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది.
సెమీస్‌లో భారత్
జూనియర్ ఆసియా కప్ హాకీ
కకమిగహర (జపాన్): మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 11-0తో చైనీస్ తైపీని చిత్తుచేసింది. మూడు విజయాలు, ఒక డ్రాతో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. పూల్-ఎలో అగ్రస్థానంతో సెమీస్‌కు అర్హత సాధించింది. మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి ప్రారంభించిన భారత్.. సంపూర్ణ ఆధిపత్యంతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. భారత్ తరఫున వైష్ణవి (1వ నిమిషం), దీపిక (3వ), అన్ను (10, 52వ), రుతుజ (12వ), నీలం (19వ), మంజు (33వ), సునెలిత (43, 57వ), దీపిక సోరెంగ్ (46వ), ముంతాజ్ ఖాన్ (55వ) గోల్స్‌తో చెలరేగారు. శనివారం సెమీస్‌లో జపాన్ లేదా కజకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Tahir - MS Dhoni: ధోనీని అధిగమించిన ఇమ్రాన్ తాహిర్.. అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పిన వెటరన్ ప్లేయర్!
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే