ఆసియా క్రీడల్లో ఈ సారి అత్యుత్తమ ప్రదర్శన

ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని, ఈ క్రీడల చరిత్రలోనే అత్యధిక పతకాలు దక్కించుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అంచనా వేశారు.

Published : 09 Jun 2023 05:04 IST

అనురాగ్‌ ఠాకూర్‌

దిల్లీ: ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని, ఈ క్రీడల చరిత్రలోనే అత్యధిక పతకాలు దక్కించుకుంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అంచనా వేశారు. ఈ సారి క్రీడలకు గతంలో కంటే అధికంగా మొత్తం 600 మంది అథ్లెట్లు భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. 2018లో 570 మంది భారత అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నారు. ‘‘క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగవ్వడం వల్ల గత ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌, డెఫ్‌లింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగింది. రికార్డు సంఖ్యలో పతకాలు వచ్చాయి. ఆసియా క్రీడల్లోనూ అదే జరుగుతుంది. ఈ సారి భారత్‌ గతంలో కంటే అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందనుకుంటున్నా’’ అని మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ వందో సమావేశం సందర్భంగా మంత్రి తెలిపారు. 2018లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు గెలవడమే ఆసియా క్రీడల్లో ఇప్పటివరకూ భారత అత్యుత్తమ ప్రదర్శన. ‘‘ఆసియా క్రీడల సన్నాహకాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.220 కోట్లకు పైగా మంజూరు చేసింది. శిక్షణ, సామగ్రి కోసం ఈ ఒలింపిక్‌ చక్రంలో రూ.450 కోట్లు ఖర్చు చేసింది. రూ.45 కోట్ల విలువైన టాప్స్‌ అథ్లెట్ల ప్రతిపాదనలను ఆమోదించాం. ఆసియా క్రీడల కోసం అథ్లెట్ల జాబితాను జూన్‌ 30 లోపు ప్రకటించాలనే లక్ష్యంతో ఆయా క్రీడా సమాఖ్యలున్నాయి’’ అని అనురాగ్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 23న చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడల కోసం అథ్లెట్ల జాబితాను పంపించేందుకు జులై 15 వరకు గడువు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని