ఆసియా క్రీడల ట్రయల్స్‌పై రెజ్లర్ల దృష్టి

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో తలపెట్టిన ఉద్యమానికి తాత్కాలిక విరామమిచ్చిన రెజ్లర్లు..

Published : 09 Jun 2023 05:04 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో తలపెట్టిన ఉద్యమానికి తాత్కాలిక విరామమిచ్చిన రెజ్లర్లు.. ఇక ఆటపై దృష్టి పెట్టనున్నారు. ముందుగా ఆసియా క్రీడల ట్రయల్స్‌ కోసం సిద్ధమవనున్నారు. అయితే అందుకు తమకు కనీసం నెలన్నర సమయం కావాలని రెజ్లర్లు కోరుతున్నారు. చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న మొదలయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను జులై 15లోపు సమర్పించాల్సి ఉంది. ‘‘ఆసియా క్రీడల సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలని అనుకుంటున్నాం. కానీ అందుకు సన్నద్ధమయ్యేందుకు కనీసం నెలన్నర పాటు సాధన చేయాల్సి ఉంటుంది’’ అని రెజ్లర్‌, సాక్షి మలిక్‌ భర్త సత్యవర్థ్‌ కడియాన్‌ తెలిపాడు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా కొంత కాలంగా ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. ఏప్రిల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ శిక్షణ శిబిరానికి కూడా వీళ్లు హాజరవలేదు.

ఇలాంటి వాతావరణంలో న్యాయం జరుగుతుందా?.. వినేశ్‌: భయాందోళన వాతావరణంలో దేశంలోని ఆడ బిడ్డలకు న్యాయం జరుగుతుందా? అని భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ప్రశ్నించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై బాలిక (రెజ్లర్‌) ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో చట్టాన్ని దిల్లీ పోలీసులు ఉపసంహరించడంపై వినేశ్‌ స్పందించింది. ‘‘భయం, బెదిరింపుల వాతావరణంలో కుమార్తెలకు న్యాయం జరుగుతుందా? న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో జాప్యం కారణంగా ఎవరూ ధైర్యం కోల్పోకూడదని కోరుకుంటున్నా? దేవుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలి’’ అని వినేశ్‌ ట్వీట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని