స్వైటెక్‌కు ఎదురుందా?

నాలుగేళ్ల క్రితం.. చెక్‌ రిపబ్లిక్‌లోని ఓ మట్టి కోర్టులో టెన్నిస్‌ టోర్నీ. అప్పుడు 106వ ర్యాంకులో ఉన్న ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో 95వ ర్యాంకర్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) ఓడిపోయింది.

Published : 10 Jun 2023 03:05 IST

నేడు ఫైనల్లో ముచోవాతో ఢీ
ఫ్రెంచ్‌ ఓపెన్‌
సాయంత్రం 6.30 నుంచి

పారిస్‌: నాలుగేళ్ల క్రితం.. చెక్‌ రిపబ్లిక్‌లోని ఓ మట్టి కోర్టులో టెన్నిస్‌ టోర్నీ. అప్పుడు 106వ ర్యాంకులో ఉన్న ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో 95వ ర్యాంకర్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) ఓడిపోయింది. మళ్లీ ఇప్పుడు.. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో.. అదీ అత్యంత కీలకమైన ఫైనల్లో ఈ ఇద్దరు క్రీడాకారిణులు తలపడనున్నారు. ఇప్పుడు స్వైటెక్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి. గాయాలతో కెరీర్‌లో వెనుకబడ్డ ముచోవా 43వ ర్యాంకులో ఉంది. మరి శనివారం జరిగే మహిళల సింగిల్స్‌ తుది పోరులో ఛాంపియన్‌గా నిలిచేది ఎవరు? ఈ ఎర్రమట్టి కోర్టులో వరుసగా రెండో సారి, నాలుగేళ్లలో మూడో సారి టైటిల్‌ సాధించాలనుకుంటున్న 22 ఏళ్ల స్వైటెక్‌కు ఎదురుందా? ఇప్పటివరకూ ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 26 ఏళ్ల ముచోవా.. గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొడుతుందా? అన్నది చూడాలి. సెమీస్‌లో రెండో సీడ్‌ సబలెంకాపై పోరాడి గెలిచిన ముచోవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. మరోవైపు 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గిన స్వైటెక్‌.. నిరుడు యుఎస్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. ఈ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అదే జోరు కొనసాగిస్తూ ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండానే టైటిల్‌ పోరు చేరుకుంది. నైపుణ్యాల పరంగా ఇద్దరు క్రీడాకారిణులు సమవుజ్జీలుగా కనిపిస్తుండడంతో తుది పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని