జకో ఇంకో అడుగే
అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అల్కరాస్, జకోవిచ్ మధ్య ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ పోరు హోరాహోరీగానే మొదలైంది. అల్కరాస్ వేగంతో స్పందిస్తే.. జకో అనుభవంతో బదులిచ్చాడు.
ఫైనల్లోకి ప్రవేశం
సెమీస్‌లో అల్కరాస్‌కు నిరాశే
అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన అల్కరాస్, జకోవిచ్ మధ్య ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ పోరు హోరాహోరీగానే మొదలైంది. అల్కరాస్ వేగంతో స్పందిస్తే.. జకో అనుభవంతో బదులిచ్చాడు. అల్కరాస్ విన్నర్లు కొడితే.. జకో ఏస్‌లతో సమాధానమిచ్చాడు. తొలి సెట్ జకోదే. కానీ రెండో సెట్ అల్కరాస్‌ది. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. రసవత్తర పోరాటానికి బ్రేక్ పడింది. మూడో సెట్లో తొలి గేమ్ గెలిచిన తర్వాత కండరాలు పట్టేయడంతో అల్కరాస్.. జకోకు పోటీ ఇవ్వలేకపోయాడు. ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన జకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ముంగిట నిలిచాడు. ఫైనల్లో అతడు కాస్పర్ రూడ్‌ను ఢీకొననున్నాడు.
పారిస్
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఈ మూడో సీడ్ ఆటగాడు 6-3, 5-7, 6-1, 6-1తో స్పెయిన్ యువ సంచలనం, ప్రపంచ నంబర్‌వన్ అల్కరాస్‌పై విజయం సాధించాడు. తొలి సెట్లో జకోదే జోరు. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అల్కరాస్ తన సర్వీస్‌లు నిలబెట్టుకున్నాడు కానీ జకో సర్వీస్‌ను బ్రేక్ చేయలేకపోయాడు. దీంతో ఆధిక్యాన్ని కొనసాగించిన జకో సెట్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో అల్కరాస్ గొప్పగా పుంజుకున్నాడు. మరోవైపు జకో కూడా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో సర్వీస్‌లు, రిటర్న్‌లు, విన్నర్లు, ఏస్‌లు.. ఇలా పోరు మంచి కిక్కునిచ్చింది. రెండో సెట్లో 3-3తో స్కోరు సమమైన దశలో అల్కరాస్ విజృంభించాడు. తన సర్వీస్ నిలబెట్టుకోవడంతో పాటు జకో సర్వీస్‌ను బ్రేక్ చేసి 5-3తో నిలిచాడు. కానీ జకో వదల్లేదు. తర్వాతి రెండు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు గేమ్‌లను ఖాతాలో వేసుకున్న అల్కరాస్ సెట్ దక్కించుకున్నాడు. ఈ రెండు సెట్లు పూర్తి అవడానికే 2 గంటల 16 నిమిషాలు పట్టింది. ఇక మజా మరో స్థాయికి చేరుతుందనుకుంటుండగా మూడో సెట్ రెండో గేమ్ నుంచి ముందు చేతి, ఆ తర్వాత కాలి కండరాలు పట్టేయడంతో అల్కరాస్ ఇబ్బంది పడ్డాడు. వైద్య సాయం తీసుకున్నా ఫలితం లేకపోయింది. కోర్టులో అతను అసౌకర్యంగా కదిలాడు. కానీ పోరాట పటిమతో చివరి వరకూ నిలబడ్డాడు. దీంతో మూడు, నాలుగు సెట్లలో కేవలం ఒక్కో గేమ్ చొప్పున కోల్పోయిన జకో మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో కాస్పర్ రూడ్ (నార్వే) 6-3, 6-4, 6-0తో జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు.
‘‘అల్కరాస్ పరిస్థితి పట్ల చింతిస్తున్నా. టోర్నీలో ఈ దశలో ఇలా తిమ్మిర్లు, శారీరక సమస్యలు రాకూడదు. అతనో అద్భుతమైన పోటీదారు. పోరాటాన్ని కొనసాగిస్తూ చివరి వరకూ ఆడిన అతనికి ప్రశంసలు దక్కాలి. అతను త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నా. నెట్ దగ్గర అతనితో మాట్లాడా. అతనెంత యువకుడో తనకు తెలుసు. అతనికి ఇంకా చాలా భవిష్యత్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ టోర్నీలో అతను చాలా సార్లు విజేతగా నిలుస్తాడు’’
జకోవిచ్
34
ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరు చేరిన జకోవిచ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ సంఖ్య. ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఏడోసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత ‘వారాహి’ యాత్ర
-
TS News: త్వరలో నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం: హరీశ్ రావు
-
US visa: అమెరికాలో చదువు.. రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
TS High Court: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టు స్టే
-
Student slapping case: యూపీ విద్యార్థిపై చెంపదెబ్బల ఘటన.. మీ మనస్సాక్షిని కదిలించాలి: సుప్రీంకోర్టు