రన్నరప్‌గా స్నేహిత్
జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ ఆటగాడు ఫిదెల్ రఫీక్ స్నేహిత్ రన్నరప్‌గా నిలిచాడు.
జాతీయ ర్యాంకింగ్ టీటీ
ఈనాడు, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ ఆటగాడు ఫిదెల్ రఫీక్ స్నేహిత్ రన్నరప్‌గా నిలిచాడు. శుక్రవారం మొయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్, రిసార్ట్స్‌లో జరిగిన ఫైనల్లో అతను 2-4 (11-5, 11-13, 11-8, 3-11, 4-11, 10-12) తేడాతో మానవ్ థక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడాడు. తొలి గేమ్ గెలిచి మ్యాచ్‌ను మెరుగ్గా మొదలెట్టిన స్నేహిత్.. ఆ తర్వాత తడబడ్డాడు. మూడో గేమ్‌లో విజయంతో పోటీలో నిలిచినప్పటికీ.. అనంతరం వరుసగా మూడు గేమ్‌ల్లో ప్రత్యర్థికి తలవంచి పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్ తుదిపోరులో ఐహిక (ఆర్బీఐ) 11-5, 11-7, 11-4, 9-11, 11-4తో దియా (ఆర్బీఐ)పై గెలిచింది. అండర్-19 యూత్ బాలుర టైటిల్‌ను అంకూర్ (పశ్చిమ బెంగాల్), బాలికల ట్రోఫీని సయాలి వాణి (మహారాష్ట్ర) సొంతం చేసుకున్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో ముందడుగు
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల్లో ముందడుగు పడింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్‌హక్ కమిటీ.. డబ్ల్యూఎఫ్‌ఐ ఓటర్ల జాబితాను సేకరించింది. ఈనెల 30లోపు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం గడువు విధించడంతో అడ్‌హక్ కమిటీ చర్యలు చేపట్టింది. ‘‘హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని అడ్‌హక్ కమిటీలో మూడో సభ్యుడిగా నియమిస్తాం. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సేకరించాం’’ అని ఐఓఏ వర్గాలు తెలిపాయి.
భారత్ శుభారంభం
భువనేశ్వర్: ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో 2-0 గోల్స్‌తో మంగోలియాను ఓడించింది. ఆట మొదలైన కాసేపటికే సునీల్ ఛెత్రి బృందం ఆధిక్యంలోకి వెళ్లింది. 2వ నిమిషంలో సహల్ అబ్దుల్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత లాలియన్‌జులా (14వ) బంతిని నెట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఆ తర్వాత భారత్‌కు కొన్ని అవకాశాలు వచ్చిన గోల్ చేయలేకపోయింది. ఆఖరిదాకా ఆధిక్యాన్ని కాచుకున్న భారత్ ఘన విజయం సాధించింది. సోమవారం జరిగే పోరులో వనౌటుతో భారత్ తలపడుతుంది.
అమ్మాయిలకు జపాన్ సవాల్
జూనియర్ హాకీ ఆసియాకప్‌లో నేడు భారత్ సెమీస్ పోరు
కకమిగహర (జపాన్): పురుషుల బాటలోనే సాగుతూ.. జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్‌లో టైటిల్ దిశగా సాగుతున్న భారత అమ్మాయిలు.. మొదట సెమీస్‌లో జపాన్ సవాలును ఎదుర్కోనున్నారు. శనివారం ఆతిథ్య జట్టుపై గెలిచి ఫైనల్ చేరడమే లక్ష్యంగా భారత్ బరిలో దిగనుంది. గ్రూప్ దశలో ఉజ్బెకిస్థాన్, మలేసియా, చైనీస్ తైపీపై విజయాలు నమోదు చేసిన భారత్.. కొరియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అజేయ ప్రదర్శనతో పూల్- ఎ లో అగ్రస్థానంలో నిలిచిన మన అమ్మాయిలు.. అదే ఆత్మవిశ్వాసాన్ని సెమీస్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నారు.
తొలిసారి తుదిపోరుకు
అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ
లా ప్లాటా (అర్జెంటీనా): ఇటలీ యువ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం సెమీస్‌లో ఆ జట్టు 2-1 తేడాతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. కసాడీ (14వ నిమిషంలో), సిమోన్ పఫుండి (86వ) చెరో గోల్‌తో ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణ కొరియా తరపున నమోదైన ఏకైక గోల్‌ను సియాంగ్ వాన్ లీ (23వ) చేశాడు. అంతకుముందు మరో సెమీస్‌లో ఉరుగ్వే 1-0తో ఇజ్రాయెల్‌పై నెగ్గింది. అండర్సన్ డువార్టె (61వ) గెలుపు గోల్ కొట్టాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటలకు ఆరంభమయ్యే ఫైనల్లో ఇటలీ, ఉరుగ్వే తలపడతాయి. ఈ పోరులో గెలిచిన జట్టుకు ఇదే మొట్టమొదటి అండర్-20 ప్రపంచకప్ టైటిల్ అవుతుంది. గతంలో ఉరుగ్వే రెండు సార్లు (1997, 2013)లో తుదిపోరు చేరినా.. విజేతగా నిలవలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై
-
LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
-
Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!