WTC Final: ఓవల్‌లో అద్భుతం జరగాలి

263 ఓవల్‌లో అత్యధిక లక్ష్య ఛేదన ఇది! ఎప్పుడో 1902లో ఇంగ్లాండ్‌ నెలకొల్పిందీ రికార్డు. 121 ఏళ్లుగా అది చెక్కు చెదరలేదంటే అక్కడ ఛేదన ఎంత కష్టమో అర్థమవుతోంది! మరి ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏకంగా 444  పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కంగారూ జట్టు.

Updated : 11 Jun 2023 07:19 IST

ఆశతో ఆఖరి రోజుకు భారత్‌
444 పరుగుల ఛేదనలో 164/3
పోరాడుతున్న కోహ్లి, రహానె
ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌

263 ఓవల్‌లో అత్యధిక లక్ష్య ఛేదన ఇది! ఎప్పుడో 1902లో ఇంగ్లాండ్‌ నెలకొల్పిందీ రికార్డు. 121 ఏళ్లుగా అది చెక్కు చెదరలేదంటే అక్కడ ఛేదన ఎంత కష్టమో అర్థమవుతోంది! మరి ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏకంగా 444  పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కంగారూ జట్టు. పదునైన పేస్‌ అస్త్రాలతో పాటు నాణ్యమైన స్పిన్నరూ ఆ జట్టుకు ఉన్నాడు. పైగా తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ టీమ్‌ఇండియా.. కొండంత ఛేదనలో త్వరత్వరగా మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇలా రోహిత్‌ బృందానికి ప్రతికూలతలెన్నో! .. అయినా డబ్ల్యూటీసీ ఫైనల్‌ రసవత్తరం. కోహ్లి, రహానెల పోరాటంతో ఆఖరి రోజు పోరాటానికి సిద్ధమైంది మన జట్టు. లక్ష్యం ఇప్పటికీ కష్టమే! చేతిలో ఏడు వికెట్లున్న భారత్‌ నెగ్గాలంటే ఆదివారం 280 పరుగులు చేయాలి. కానీ కోహ్లి సాధికారికంగా ఆడుతున్న తీరు, గాయం బాధపెడుతున్నా రహానె నిలబడ్డ తీరు సగటు అభిమానిని ఆశతో అయిదో రోజుకు తీసుకెళ్తున్నాయి. మరి టీమ్‌ ఇండియా అద్భుతం చేస్తుందా?

లండన్‌: 

పరిస్థితులు ఇప్పటికీ ప్రతికూలంగానే ఉన్నా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రోహిత్‌సేన ఇంకా ఆశలు వదులుకోలేదు. ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. కోహ్లి  (44 బ్యాటింగ్‌; 60 బంతుల్లో 7×4), రహానె (20 బ్యాటింగ్‌; 59 బంతుల్లో 3×4)ల పోరాటంతో భారత్‌ ఓ చిన్న ఆశతో ఆఖరి రోజు ఆటకు సిద్ధమైంది. 444 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యంతో నాలుగో రోజు, శనివారం బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. ఆట ఆఖరుకు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అంతకుముందు కేరీ (66 నాటౌట్‌; 105 బంతుల్లో 8×4) రాణించడంతో ఆస్ట్రేలియా 270/8 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆఖరి రోజు తొలి సెషన్‌ ఆట మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనుంది. కోహ్లి, రహానె ఎంత సేపు నిలబడతారన్నది భారత్‌కు కీలకం.

వాళ్లిద్దరు పోరాడుతున్నారు: కొండంత లక్ష్యం. మ్యాచ్‌లో చాలా ఆటే మిగిలి ఉంది. రక్షణాత్మక ఆటతో డ్రా చేసుకోవడం కష్టమైన విషయమే. ఈ నేపథ్యంలో ఫలితం కోసం ప్రయత్నించాలంటే భారత్‌కు ఓ బలమైన ఆరంభం అవసరం. కానీ అది దక్కలేదు. నిజానికి ఓపెనర్లు రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7×4, 1×6) గిల్‌ (18; 19 బంతుల్లో 2×4) ధీమాగానే ఇన్నింగ్స్‌ను మొదలెట్టారు. ఆసీస్‌ పేసర్లు కమిన్స్‌, బోలాండ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సమర్థంగానే ఎదుర్కొన్నారు. క్రీజులో సౌకర్యంగా కనిపించారు. కమిన్స్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌తో బౌండరీ సాధించిన రోహిత్‌.. అతడి తర్వాతి ఓవర్లోనే మిడాన్‌లో ఫోర్‌ కొట్టాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌లో సిక్స్‌తో అభిమానులను అలరించాడు. కానీ టీకి ముందు చివరి ఓవర్లో భారత్‌కు బోలాండ్‌ షాకిచ్చాడు. కాస్త ఎక్స్‌ట్రా బౌన్సయిన బంతిని ఆడబోయిన గిల్‌.. గల్లీలో గ్రీన్‌ డైవ్‌ చేస్తూ అందుకున్న క్యాచ్‌కు నిష్క్రమించాడు. రోహిత్‌ శర్మ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించడం, పుజారా (27) కూడా దూకుడు ప్రదర్శించడంతో టీ తర్వాత భారత్‌ ఓ దశలో 92/1తో సాఫీగా సాగింది. కానీ వరుస ఓవర్లలో రోహిత్‌ను లైయన్‌, పుజారాను కమిన్స్‌ ఔట్‌ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్‌ ఇక తలవంచినట్లేనా అన్న అనుమానాలు కలిగాయి. కానీ కోహ్లి, రహానె.. ఆశలు కోల్పోనివ్వలేదు. దాదాపు 20 ఓవర్లు పోరాడిన ఈ జంట కంగారూలు మరీ సంబరపడకుండా చూశారు. ఆఖరి రోజును ఆసక్తికరంగా మార్చేశారు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లి చక్కని షాట్లతో అలరిస్తూ వేగంగానే పరుగులు రాబట్టాడు. ఆసీస్‌ పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ చూడముచ్చటైన ఫ్లిక్‌లు, డ్రైవ్‌లతో అలరించాడు. ఇక వేలికి గాయమైనా రహానె ఆడిన తీరు ఆకట్టుకుంది. అతడు కూడా ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. రహానె-కోహ్లి జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించింది.

కేరీ మళ్లీ..: 296. మూడో రోజు ఆట ఆఖరుకు కంగారూల ఆధిక్యమిది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసినా, ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో (మూడో రోజు చివరికి) 123/4కే పరిమితం చేసినా వెనుకంజలోనే టీమ్‌ఇండియా. ఓటమి ముప్పు స్పష్టం. ఆస్ట్రేలియాదే స్పష్టమైన ఆధిపత్యం. అయినా కాస్త ఆశావహ దృక్పథంతోనే నాలుగో రోజు ఆటను మొదలెట్టింది రోహిత్‌సేన. ప్రత్యర్థిని రెండొందలకు కాస్త అటు ఇటుగా ఆలౌట్‌ చేసి ఉంటే చాలా సంతృప్తి చెందేదే. కానీ అలా జరగలేదు. కోరుకున్నట్లుగా కంగారూలను భారత్‌ కట్టడి చేయలేకపోయింది. ఆసీస్‌ ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం ఒక్క పరుగు చేరగానే లబుషేన్‌ను, కాసేపటికి గ్రీన్‌ (25)ను ఔట్‌ చేసి ఆశలు రేపినా.. కేరీకి కళ్లెం వేయడంలో విఫలం కావడంతో కొండంత లక్ష్యం  టీమ్‌ఇండియా ముందు నిలిచింది. స్టార్క్‌ (41; 57 బంతుల్లో 7×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన కేరీ.. భారత్‌ను దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు చేసిన అతడు.. మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తిరుగులేని స్థితిలో నిలవడానికి కారణమయ్యాడు. కేరీ నిలవకపోయుంటే ఆ జట్టు ఇన్నింగ్స్‌లో భారత్‌ కనీసం 50-60 పరుగులైనా తగ్గించగలిగేది. సవాలు విసురుతున్న పిచ్‌పై ఎంతో సంయమనాన్ని ప్రదర్శించిన కేరీ.. జడేజాను సమర్థంగా ఎదుర్కొన్నాడు. గ్రీన్‌తో ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించిన కేరీ.. ఆ తర్వాత స్టార్క్‌తో ఏడో వికెట్‌కు 93 (120 బంతుల్లో) పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మూడో రోజు భారత బౌలర్ల శ్రమకు తగిన ఫలితం దక్కకుండా చేశాడు. టీమ్‌ఇండియాకు చిన్న అవకాశమైనా లేదని భావించాక ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

జడేజా రికార్డు

రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. బిషన్‌ సింగ్‌ బేడీని అధిగమించి అత్యంత విజయవంతమైన భారత ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మూడో రోజు ఆటలో స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌లను ఔట్‌ చేయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ సహా ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 268 వికెట్లు ఉన్నాయి. బేడీ 67 టెస్టుల్లో 266 వికెట్లు చేజిక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖవాజా (సి) భరత్‌ (బి) ఉమేశ్‌ 13; వార్నర్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 1; లబుషేన్‌ (సి) పుజారా (బి) ఉమేశ్‌ 41; స్మిత్‌ (సి) శార్దూల్‌ (బి) జడేజా 34; హెడ్‌ (సి) అండ్‌ (బి) జడేజా 18;  గ్రీన్‌ (బి) జడేజా 25; అలెక్స్‌ కేరీ నాటౌట్‌ 66; స్టార్క్‌ (సి) కోహ్లి (బి) షమి 41; కమిన్స్‌ (సి) అక్షర్‌ (బి) షమి 5; ఎక్స్‌ట్రాలు 26 మొత్తం: (84.3 ఓవర్లలో) 270/8 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-2, 2-24, 3-86, 4-111, 5-124, 6-167, 7-260, 8-270; బౌలింగ్‌: షమి 16.3-6-39-2; సిరాజ్‌ 20-2-80-1; శార్దూల్‌ 8-1-21-0; ఉమేశ్‌ యాదవ్‌ 17-1-54-2; జడేజా 23-4-58-3

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) లైయన్‌ 43; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బోలాండ్‌ 18; పుజారా (సి) కేరీ (బి) కమిన్స్‌ 27; కోహ్లి బ్యాటింగ్‌ 44; రహానె బ్యాటింగ్‌ 20; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (40 ఓవర్లలో 3 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-41, 2-92, 3-93; బౌలింగ్‌: కమిన్స్‌ 9-0-42-1; బోలాండ్‌ 11-1-38-1; స్టార్క్‌ 7-0-45-0; గ్రీన్‌ 2-0-6-0; లైయన్‌ 11-1-32-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని