ఇది ఔటా?

భారత రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను మూడో అంపైర్‌ క్యాచౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. రోహిత్‌, గిల్‌ జోడీ స్వేచ్ఛగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చేలా కనిపించారు.

Published : 11 Jun 2023 03:03 IST

భారత రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను మూడో అంపైర్‌ క్యాచౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. రోహిత్‌, గిల్‌ జోడీ స్వేచ్ఛగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చేలా కనిపించారు. కానీ బోలాండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ తొలి బంతి గిల్‌ బ్యాట్‌ను తాకి గల్లీలో ఉన్న గ్రీన్‌ దగ్గర పడేలా కనిపించింది. కానీ తన ఎడమ వైపు డైవ్‌ చేసిన గ్రీన్‌.. ఎడమ చేత్తో బంతిని పట్టి పైకి విసిరేసి సంబరాల్లో మునిగిపోయాడు. ఆ బంతి నేలకు తాకిందో లేదో అనే సందేహంలో ఉన్న అంపైర్లు.. టీవీ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బోరోకు నిర్ణయాన్ని వదిలేశారు. చాలాసేపు పరీక్షించిన తర్వాత బంతి కింద గ్రీన్‌ చేతి వేళ్లు ఉన్నాయని భావించి ఆ అంపైర్‌ ఔటిచ్చాడు. కానీ కొన్ని రిప్లేల్లో చూస్తే బంతి నేలకు తాకిందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంపై రోహిత్‌.. అంపైర్లతో మాట్లాడాడు కూడా. టీవీ అంపైర్‌ నిర్ణయం పట్ల భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాండ్స్‌లోని అభిమానులు గ్రీన్‌ను ఉద్దేశించి ‘మోసం మోసం మోసం’ అంటూ అరిచారు. ‘‘రిప్లేలో స్పష్టత లేదు. నిర్ణయం తీసుకునే ముందు అంపైర్‌ మరింత జూమ్‌ చేసి చూడాల్సింది. ఈ నిర్ణయం భారత్‌ను దెబ్బకొట్టేదే’’ అని హర్భజన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని