ఇటు గ్రాండ్‌స్లామ్‌లు.. అటు పిల్లాటలు

సాధారణంగా టెన్నిస్‌ క్రీడాకారుల బ్యాగుల్లో ఏం ఉంటాయి? రాకెట్లు, టవల్స్‌, బంతులు ఇంకా ఆటకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉండొచ్చు!

Updated : 11 Jun 2023 03:26 IST

సాధారణంగా టెన్నిస్‌ క్రీడాకారుల బ్యాగుల్లో ఏం ఉంటాయి? రాకెట్లు, టవల్స్‌, బంతులు ఇంకా ఆటకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉండొచ్చు! కానీ ఇగా స్వైటెక్‌ బ్యాగ్‌ను తెరిచి చూస్తే మాత్రం రాకెట్లతో పాటు చిన్న పిల్లలు ఆడుకునే బ్రిక్స్‌ గేమ్‌, పజిల్స్‌, వీడియో గేమ్స్‌, కామిక్‌ పుస్తకాలు ఉంటాయి! ఎందుకంటే మిగిలిన టెన్నిస్‌ అమ్మాయిల కంటే ఆమె ప్రత్యేకం కాబట్టి! ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా పిల్లల ఆటలను ఆడడం.. ఎంతటి కఠినమైన పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండడం ఇగా స్పెషల్‌. ఫ్రెంచ్‌ ఓపెన్లో మహిళల సింగిల్స్‌లో గత 14 ఏళ్లలో దాదాపు ప్రతి ఏడూ ఓ కొత్త ఛాంపియన్‌ వచ్చింది. అలాంటిది గత నాలుగేళ్లలో మూడుసార్లు ఎర్రకోటలో జెండా ఎగరవేయడం స్వైటెక్‌కే చెల్లింది. 2005-07 మధ్య బెల్జియం స్టార్‌ జస్టిన్‌ హెనిన్‌ తర్వాత మూడు ఫ్రెంచ్‌ ఓపెన్‌లు గెలిచింది ఇగా మాత్రమే. హెనిన్‌ హ్యాట్రిక్‌ టైటిళ్లు సాధించగా.. ఇగా నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే (2021) ఈ టైటిల్‌కు దూరమైంది. 2020 ఫ్రెంచ్‌ ఓపెన్లో 54వ ర్యాంకర్‌గా బరిలో దిగి టైటిల్‌ గెలవడం స్వైటెక్‌ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. గతేడాది 37 వరుస విజయాలతో దుమ్మురేపిన ఈ పోలెండ్‌ అమ్మాయి.. ప్రపంచ నంబర్‌వన్‌ను కూడా చేజిక్కించుకుంది. హెనిన్‌ మాదిరే మెరుపు బ్యాక్‌హ్యాండ్‌, క్లే కోర్టులకు తగ్గట్టుగా చురుకైన కదలికలు, ప్రత్యర్థి ఆటను చదివి వేగంగా పైచేయి సాధించే తీరు స్వైటెక్‌ను మిగిలిన అమ్మాయిల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. ఇగాకు దాతృత్వం, సమాజం గురించి స్పందన కూడా ఎక్కువే. 2021లో ఇండియన్‌వెల్స్‌ టోర్నీలో తాను ఆర్జించిన 50 వేల డాలర్లను స్వదేశంలో స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చింది. నిరుడు 56 వేల డాలర్లకు పైనే మానసిక రోగుల కోసం ఖర్చు చేసింది. 


2

మోనికా సెలెస్‌ తర్వాత వరుసగా రెండు ఫ్రెంచ్‌ టైటిళ్లు గెలిచిన పిన్న వయస్కురాలు ఇగానే (22 ఏళ్లు). సెరెనా తర్వాత ఈ వయసులో 4 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గింది కూడా స్వైటెకే.


4

స్వైటెక్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు. మూడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2020, 2022, 2023), యుఎస్‌ ఓపెన్‌ (2022) ఆమె ఖాతాలో ఉన్నాయి


* 2007లో హెనిన్‌ (బెల్జియం) తర్వాత రొలాండ్‌ గారోస్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్న ఘనత స్వైటెక్‌దే


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని