ఆసియా క్రీడల్లోనూ పాల్గొనం!: రెజ్లర్లు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కేసులో పరిష్కారం దొరక్కపోతే ఆసియా క్రీడల్లోనూ పాల్గొనమని అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మలిక్‌ ప్రకటించింది.

Published : 11 Jun 2023 03:00 IST

సోనిపత్‌: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కేసులో పరిష్కారం దొరక్కపోతే ఆసియా క్రీడల్లోనూ పాల్గొనమని అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మలిక్‌ ప్రకటించింది. తనపై లైంగిక హింస ఆరోపణలు చేసిన రెజ్లర్లను ఒత్తిడికి గురి చేస్తూ, వాళ్ల వాంగ్మూలాలు మార్చుకునేలా బ్రిజ్‌ భూషణ్‌ ప్రభావం చూపిస్తున్నాడని రెజ్లర్లు ఆరోపించారు. ఈ నెల 15 లోపు అతనిపై సరైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. జూన్‌ 15 లోపు బ్రిజ్‌ భూషణ్‌పై ఛార్జీషీట్‌ నమోదు చేస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇవ్వడంతో తమ ఉద్యమానికి రెజ్లర్లు తాత్కాలిక విరామమిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం చోటు రామ్‌ ధర్మశాలలో ‘పంచాయత్‌’ నిర్వహించిన సందర్భంగా సాక్షి మాట్లాడుతూ.. ‘‘డబ్బు తీసుకుని ఉద్యమాన్ని ముగించాలని బజ్‌రంగ్‌కు కాల్స్‌ వస్తున్నాయి. అందుకే ముందు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేసి, విచారణ నిర్వహించండి. అతను బయట ఉన్నంత సేపు భయానక వాతావరణం కొనసాగుతుంది’’ అని చెప్పింది.


మెరిసిన శ్రీశంకర్‌

పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో మూడో స్థానం

పారిస్‌: భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ శ్రీశంకర్‌ సత్తా చాటాడు. పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో అతడు మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అత్యుత్తమంగా 8.09 మీటర్లు దూకిన శంకర్‌ పోడియంపై నిలిచాడు. తొలి జంప్‌లో 7.94 మీటర్లు దూకిన ఈ భారత అథ్లెట్‌.. మూడో ప్రయత్నంలో 8.09 మీటర్లతో అందరికంటే ముందంజలో నిలిచాడు. కానీ ఆ తర్వాత ఒలింపిక్‌ ఛాంపియన్‌ మిల్టియాడిస్‌ (గ్రీస్‌, 8.13 మీ), సిమోన్‌ (స్విట్జర్లాండ్‌, 8.11 మీ) అతడిని దాటేసి తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), వికాశ్‌ గౌడ (డిస్కస్‌ త్రో) తర్వాత డైమండ్‌ లీగ్‌లో టాప్‌-3లో నిలిచిన ఘనత శంకర్‌దే. డైమండ్‌ లీగ్‌లలో అథ్లెట్లకు పతకాలు బహూకరించరు. ఏడాదిలో జరిగే లీగ్‌లలో ఉత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్ల మధ్య ఫైనల్‌ పోటీని నిర్వహించి ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు.


ఫైనల్లో భారత్‌

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ

కకామిగారా (జపాన్‌): మహిళల జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం సెమీఫైనల్లో 1-0తో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది. రెండు జట్లు హోరాహోరీగా ఆడడంతో మూడో క్వార్టర్‌ వరకు ఒక్క గోల్‌ కూడా పడలేదు. 47వ నిమిషంలో సనేలిటా ఓ ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. జ్యోతి నుంచి పాస్‌ అందుకున్న సనేలిటా.. మెరుపు షాట్‌తో గోల్‌ చేసేసింది. ఆ తర్వాత స్కోరు సమం చేయడానికి జపాన్‌ చేసిన ప్రయత్నాలను ప్రీతి బృందం సమర్థంగా అడ్డుకుంది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌.. విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు జట్లకు 12 చొప్పున పెనాల్టీకార్నర్లు లభించినా ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ఫైనల్‌ చేరడంతో నవంబర్‌ 29న సాంటియాగోలో ఆరంభమయ్యే ప్రపంచకప్‌ బెర్తును కూడా భారత్‌ సొంతం చేసుకుంది.


అయిదో స్థానంలో హారిక

సెయింట్‌లూయిస్‌: కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ ద్రోణవల్లి హారిక అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఆరో రౌండ్లోనూ ఈ తెలుగమ్మాయికి డ్రానే ఎదురైంది. జాన్‌సాయా (కజకిస్థాన్‌)తో గేమ్‌ను ఆమె 44 ఎత్తుల్లో డ్రాగా ముగించింది. మరో మూడు రౌండ్లే మిగిలున్న ఈ కప్‌లో అనా జొటాన్‌స్కీ (అమెరికా, 4.5 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని