SL VS AFG - Asia Cup 2023: అయ్యో అఫ్గాన్‌

దురదృష్టమంటే అఫ్గానిస్థాన్‌దేనేమో! ఆ జట్టు చేజేతులా ఆసియాకప్‌ సూపర్‌-4 బెర్తును చేజార్చుకుంది. శ్రీలంకతో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్హత సాధించడానికి అవకాశాలు ఉన్నా.. తెలివిగా ఆడకపోవడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు.

Updated : 06 Sep 2023 08:05 IST

త్రుటిలో చేజారిన సూపర్‌-4 బెర్త్‌
పోరాడి ఓడిన అఫ్గాన్‌
శ్రీలంక, బంగ్లా, ముందంజ
లాహోర్‌

దురదృష్టమంటే అఫ్గానిస్థాన్‌దేనేమో! ఆ జట్టు చేజేతులా ఆసియాకప్‌ సూపర్‌-4 బెర్తును చేజార్చుకుంది. శ్రీలంకతో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్హత సాధించడానికి అవకాశాలు ఉన్నా.. తెలివిగా ఆడకపోవడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరిదాకా పట్టు వదలకుండా పోరాడిన లంక.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సూపర్‌-4లో అడుగుపెట్టింది. గ్రూప్‌-బిలో ఒక మ్యాచ్‌ గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌ కూడా ముందంజ వేసింది. ఆడిన రెండింట్లోనూ ఓడిన అఫ్గాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అఫ్గానిస్థాన్‌కు తీవ్ర నిరాశ. శ్రీలంకపై గొప్పగా పోరాడినా.. ఆ జట్టు ఆసియాకప్‌లో సూపర్‌-4కు అర్హత సాధించలేకపోయింది. మంగళవారం లంక 2 పరుగుల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. మొదట లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (92; 84 బంతుల్లో 6×4, 3×6) టాప్‌ స్కోరర్‌. గుల్బాదిన్‌ నైబ్‌ (4/60), రషీద్‌ ఖాన్‌ (2/63) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో అఫ్గాన్‌ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ నబి (65; 32 బంతుల్లో 6×4, 5×6), హష్మతుల్లా షాహిదీ (59; 66 బంతుల్లో 3×4, 1×6), రషీద్‌ (27 నాటౌట్‌; 16 బంతుల్లో 4×4, 1×6)ల పోరాటం సరిపోలేదు. లంక బౌలర్లలో రజిత (4/79) రాణించాడు.

ఆఖరి మెట్టుపై బోల్తా: సూపర్‌-4 చేరాలంటే 292 లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేదించాల్సిన అఫ్గాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రహ్మనుల్లా గుర్బాజ్‌ (4), ఇబ్రహీం జాద్రాన్‌ (7) త్వరగా ఔటయ్యారు.  9 ఓవర్లకు 52/3తో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో హష్మతుల్లా షాహిదీ, రహ్మత్‌షా (45) ఇన్నింగ్స్‌ నిలబెట్టారు. 18 ఓవర్లకు 120/3తో అఫ్గాన్‌ లక్ష్యం దిశగా సాగింది. రహ్మత్‌ తర్వాత మహ్మద్‌ నబి దూకుడుగా ఆడడంతో అఫ్గాన్‌ స్కోరు పరుగులెత్తింది. కానీ తడబడిన అఫ్గాన్‌ 237/7తో పరాజయం ముంగిట నిలిచింది. సూపర్‌-4కు అర్హత సాధించాలంటే 31 బంతుల్లో 54 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌, నజీబుల్లా జాద్రాన్‌ (23; 15 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడి ఆశలు రేపారు. నజీబుల్లా ఔటైనా.. రషీద్‌ఖాన్‌ ఉండడంతో అఫ్గాన్‌ శిబిరంలో ఆశలు ఉన్నాయి. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన స్థితిలో రషీద్‌ మూడు ఫోర్లే కొట్టడంతో అఫ్గాన్‌ 37 ఓవర్లకు 289/8తో నిలిచింది. 38వ ఓవర్‌ తొలి బంతికి 3 పరుగులు చేస్తే అఫ్గాన్‌ ముందంజ వేసేది. కానీ ఆ బంతికి ముజీబ్‌ ఔటైపోయాడు. దీంతో అఫ్గాన్‌ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ రన్‌రేట్‌ సమీకరణాల ప్రకారం ఆ ఓవర్‌ నాలుగో బంతి లోపు అఫ్గాన్‌ స్కోరు 295కు చేరినా ఆ జట్టు గెలిచేదని తేలింది. కానీ ఈ విషయం క్రీజులో ఉన్న బ్యాటర్లకు తెలియలేదు. రెండో బంతికి ఫారూఖీ సింగిల్‌ తీసి రషీద్‌కు స్ట్రైకింగ్‌ ఇచ్చినా.. అతను తర్వాతి   2 బంతుల్లో 6 పరుగులు కొట్టేసేవాడేమో. కానీ 2 బంతులు వృథా చేసిన ఫారూఖీ నాలుగో బంతికి ఔటైపోవడంతో అఫ్గాన్‌ పనైపోయింది.

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) నజిబుల్లా (బి) నైబ్‌ 41; దిముత్‌ కరుణరత్నే (సి) నబి (బి) నైబ్‌ 32; కుశాల్‌ మెండిస్‌ రనౌట్‌ 92; సమరవిక్రమ (సి) గుర్బాజ్‌ (బి) నైబ్‌ 3; అసలంక (సి) అండ్‌ (బి) రషీద్‌ 36; ధనంజయ (బి) ముజీబ్‌ 14; శానక (బి) రషీద్‌ 5; వెల్లలగె నాటౌట్‌ 33; తీక్షణ (బి) నైబ్‌ 28; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 291; వికెట్ల పతనం: 1-63, 2-80, 3-86, 4-188, 5-221, 6-226, 7-227, 8-291; బౌలింగ్‌: ఫారూఖీ 7-1-52-0; ముజీబ్‌ రెహ్మాన్‌ 10-0-60-1; నైబ్‌ 10-0-60-4; నబి 10-0-35-0; రషీద్‌ఖాన్‌ 10-0-63-2; కరీమ్‌ 3-0-20-0 అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) కుశాల్‌ మెండిస్‌ (బి) రజిత 4; ఇబ్రహీం జద్రాన్‌ (బి) రజిత 7; నైబ్‌ ఎల్బీ (బి) పతిరన 22; రహ్మత్‌ షా (సి) పతిరన (బి) రజిత 45; హష్మతుల్లా (సి) రజిత (బి) వెల్లలగె 59; నబి (సి) ధనంజయ (బి) తీక్షణ 65; జనత్‌ (సి) కరుణరత్నె (బి) వెల్లలగె 22; నజీబుల్లా (సి) హేమంత (బి) రజిత 23; రషీద్‌ నాటౌట్‌ 27; ముజీబ్‌ (సి) సమరవిక్రమ (బి) ధనంజయ 0; ఫారూఖీ ఎల్బీ (బి) ధనంజయ 0; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (37.4 ఓవర్లలో ఆలౌట్‌) 289; వికెట్ల పతనం: 1-10, 2-27, 3-50, 4-121, 5-201, 6-234, 7-237, 8-276, 9-289; బౌలింగ్‌: రజిత 10-0-79-4; తీక్షణ 10-0-62-1; వెల్లలగె 4-0-36-2; పతిరన 10-0-63-1; శానక 2-0-32-0; ధనంజయ 1.4-0-12-2

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు