India vs Pakistan - Asia Cup 2023: ఉత్సాహంపై నీళ్లు!

గత వారంలా కాదు. ఈసారి ఇన్నింగ్స్‌ ఘనంగా మొదలైంది. ఓపెనర్లిద్దరూ పోటీ పడి పరుగులు సాధించారు. షహీన్‌ పప్పులుడకలేదు. రవూఫ్‌ రెచ్చిపోలేదు.

Updated : 11 Sep 2023 09:38 IST

దాయాదుల పోరుకు మళ్లీ వరుణుడి బ్రేక్‌
ఆట నేటికి వాయిదా
గిల్‌, రోహిత్‌ అర్ధశతకాలు.. భారత్‌ 147/2

గత వారంలా కాదు. ఈసారి ఇన్నింగ్స్‌ ఘనంగా మొదలైంది. ఓపెనర్లిద్దరూ పోటీ పడి పరుగులు సాధించారు. షహీన్‌ పప్పులుడకలేదు. రవూఫ్‌ రెచ్చిపోలేదు. పాక్‌పై భారత్‌దే తిరుగులేని ఆధిపత్యం. అదిరే ఆరంభం తర్వాత ఆరంభ వీరులు వెనుదిరిగినా.. ఆటలో ముందడుగు టీమ్‌ఇండియాదే. క్రీజులో ఉన్న విరాట్‌, రాహుల్‌ కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించడంతో పాక్‌కు భారత్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయమని ఉత్సాహంగా ఉండగా.. వచ్చాడు వరుణుడు! ఒక్కసారిగా ప్రేమదాస స్టేడియాన్ని ముంచెత్తి.. మళ్లీ ఆటకు అవకాశమే ఇవ్వలేదు. దీంతో రిజర్వ్‌ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ వాయిదా పడింది.

కొలంబో

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లను వరుణుడు వదలనంటున్నాడు. ఆసియా కప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ను రద్దు చేయించిన వర్షం.. ఆదివారం సూపర్‌-4 మ్యాచ్‌కూ అడ్డుపడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 24.1 ఓవర్లలో 147/2తో ఉన్న దశలో వర్షం వల్ల ఆగిన ఆట తర్వాత ఎంతకీ పునఃప్రారంభం కాలేదు. వర్షం కొంచెం తగ్గినా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో రిజర్వ్‌ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆగిన చోటి నుంచే ఆట కొనసాగనుంది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (58; 52 బంతుల్లో 10×4), రోహిత్‌ శర్మ (56; 49 బంతుల్లో 6×4, 4×6) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. విరాట్‌ కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజులో ఉన్నారు.

ఆడినంత సేపు అదరహో: ఆదివారం భారత అభిమానులు వరుణుడిని మామూలుగా తిట్టుకుని ఉండరు. భారత ఓపెనర్లు వర్షానికి ముందు వారికి అలాంటిలాంటి ఉత్సాహాన్నివ్వలేదు. లీగ్‌ దశలో పాక్‌ పేసర్ల ధాటికి నిలవలేకపోయిన శుభ్‌మన్‌, రోహిత్‌.. ఈసారి షహీన్‌ సహా పాక్‌ బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. అద్భుతమైన షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. పాక్‌తో గత మ్యాచ్‌లో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో 121/0తో నిలిచిందంటే ఓపెనర్లు ఏ స్థాయిలో ఆధిపత్యం చలాయించారో అర్థం చేసుకోవచ్చు. షహీన్‌ వేసిన తొలి ఓవర్లో తొలి 5 బంతుల్లో రోహిత్‌ పరుగే తీయలేకపోయాడు. దీంతో మళ్లీ భారత్‌ ఆత్మరక్షణలో పడబోతోందా అనిపించింది. కానీ చివరి బంతికి తనదైన శైలిలో మిడ్‌ వికెట్‌ సిక్సర్‌ బాదిన రోహిత్‌.. స్టేడియాన్ని హోరెత్తించాడు. నసీమ్‌ వేసిన తర్వాతి ఓవర్లోనూ రోహిత్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. అయితే ఇక్కడ్నుంచి రోహిత్‌ ఉన్నట్లుండి నెమ్మదించగా.. శుభ్‌మన్‌ అందుకున్నాడు. తనలోని మరో కోణాన్ని చూపిస్తూ అతను పాక్‌ ప్రధాన పేసర్‌ షహీన్‌పై విరుచుకుపడ్డాడు. అతడి బౌలింగ్‌లో ఫోర్ల మోత మోగించాడు. ఒక దశలో అతను షహీన్‌ బౌలింగ్‌లో ఆడిన 12 బంతుల్లో 6 బౌండరీలు కొట్టడం విశేషం. అందులో ప్రతి షాట్‌ కనువిందు చేసేదే. మిగతా బౌలర్లనూ అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. భారత్‌ 9వ ఓవర్లోనే 50 దాటింది. ఆరంభంలో కొట్టిన 6, 4 తర్వాత 16 డాట్‌ బాల్స్‌ ఆడిన రోహిత్‌.. 11వ ఓవర్‌ నుంచి గేర్‌ మార్చాడు. బౌండరీల మోత మోగిస్తూ చూస్తుండగానే 40ల్లోకి వచ్చేశాడు. ఇద్దరూ తక్కువ వ్యవధిలో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 16 ఓవర్లకు భారత్‌ 118/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే స్పిన్నర్‌ షాదాబ్‌ బౌలింగ్‌లో అప్పటికే 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టిన రోహిత్‌.. అతడి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడబోయి ఫార్వర్డ్‌లో ఫహీమ్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లోనే షహీన్‌.. గిల్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఓపెనర్లు వెనుదిరిగాక స్కోరు వేగం   పడిపోయింది. కోహ్లి, రాహుల్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. రాహుల్‌ కొంచెం వేగం పెంచుతున్న సమయంలో వర్షం మొదలై ఆట ఆగిపోయింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఫహీమ్‌ (బి) షాదాబ్‌ 56; శుభ్‌మన్‌ (సి) అఘా సల్మాన్‌ (బి) షహీన్‌ 58; కోహ్లి బ్యాటింగ్‌ 8; రాహుల్‌ బ్యాటింగ్‌ 17; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (24.1 ఓవర్లలో 2 వికెట్లకు) 147 వికెట్ల పతనం: 1-121, 2-123 బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 5-0-37-1; నసీమ్‌ షా 5-1-23-0; ఫహీమ్‌ అష్రాఫ్‌ 3-0-15-0; రవూఫ్‌ 5-0-27-0; షాదాబ్‌ 6.1-1-45-1

అయ్యర్‌కు ఇంతలోనే..

గాయంతో ఆరు నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌.. ఇటీవలే కోలుకుని ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు మ్యాచ్‌లు ఆడేసరికే అతడికి మళ్లీ ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్‌ ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు దూరమయ్యాడు. శ్రేయస్‌తో పాటే జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉండి గాయం నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌.. తన స్థానంలో జట్టులోకి వచ్చాడు. రాహుల్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అతను ఫిట్‌ అయ్యేలోపే శ్రేయస్‌కు వెన్ను నొప్పి మొదలైంది. ఈ ఇద్దరూ ప్రపంచకప్‌ సమయానికి ఎంతవరకు ఫిట్‌గా ఉంటారన్నది సందేహం.

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో మళ్లీ ఖాళీ స్టాండ్స్‌

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతోందంటే స్టేడియంలో ఒక్క ఖాళీ సీట్‌ కూడా కనిపించదు సాధారణంగా. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక వీరి పోరుకు మరింత డిమాండ్‌ పెరిగి.. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌ జరిగినా స్టేడియాలు నిండిపోతున్నాయి. కానీ ప్రస్తుత ఆసియా కప్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. లీగ్‌ దశలో చిరకాల ప్రత్యర్థుల పోరులో అక్కడక్కడా స్టాండ్స్‌ ఖాళీగా కనిపించాయి. ఆదివారం సూపర్‌-4 మ్యాచ్‌లోనూ అదే దృశ్యం పునరావృతమైంది. ఈ మ్యాచ్‌కూ స్టేడియం నిండలేదు. ఈ రెండు మ్యాచ్‌లకూ వర్షం ముప్పుండటం అభిమానుల్లో అనాసక్తికి ఒక కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

అదే ఆందోళన కలిగించింది

కొలంబో: తొడ గాయంతో ఎక్కువ రోజులు ఆటకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ తన ఫిట్‌నెస్‌పై సందేహాల మధ్య ఆసియాకప్‌తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గానే అతడు ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే కోలుకునే క్రమంలో వికెట్‌కీపింగ్‌ చేయడం గురించి ఆందోళన చెందానని రాహుల్‌ చెప్పాడు. ఇప్పుడు ఆ ఆందోళన లేదని అన్నాడు. ‘‘తిరిగి జట్టులోకి వచ్చాక వికెట్‌కీపింగ్‌ చేయాల్సివస్తుందని నాకు తెలుసు. ఫిజియోలకు, నాకు పెద్ద ఆందోళన కలిగించిన విషయం అదే. తొడ గాయం వల్ల వికెట్‌కీపింగ్‌ నాకొక పెద్ద సవాలుగా అనిపించింది. కీపింగ్‌ చేసేటప్పుడు ప్రతి బంతికి స్క్వాటింగ్‌ చేయాల్సివుంటుంది. అలా చేయాలంటే తొడకండరాలు బలంగా ఉండాలి. దేహం సహకరించాలి. ఎలాంటి నొప్పి లేకుండా ఉండాలి’’ అని రాహుల్‌ అన్నాడు. ‘‘నొప్పి కలుగుతుందేమో అన్న ఆలోచన ఎప్పుడూ వస్తుంటుంది. అలాంటి మానసిక స్థితిలో నైపుణ్యాలపై దృష్టిపెట్టడం మొదలుపెట్టలేం. నొప్పి వస్తుందేమోనన్న భయాన్ని పోగొట్టుకోవడం నాకో సవాలుగా మారింది. ఒక్కో అడుగు వేయడం ద్వారానే ఆ భయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. ఎన్‌సీఏలో మంచి ఫిజియోలు, ట్రైనర్ల చేతుల్లో పడ్డా. కోలుకోవడానికి వాళ్లెంతో సహకరించారు’’ అని చెప్పాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని