Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్‌ స్టేడియం

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ముస్తాబవుతోంది.

Updated : 22 Sep 2023 07:35 IST

క్రికెట్‌ ప్రపంచకప్‌ మరో 13 రోజుల్లో

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈ స్టేడియంలో రెండు వార్మప్‌, మూడు అసలైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) స్టేడియంలో పైకప్పు, కొత్త కుర్చీలు తదితర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దక్షిణం వైపు గతంలో భారీ వర్షాలకు ఎగిరిపోయిన పైకప్పు స్థానంలో ఇప్పుడు కొత్తదాన్ని బిగించారు. తూర్పు దిశగా పైకప్పు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 29న ఉప్పల్‌లో జరగాల్సిన న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ వార్మప్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించే సూచనలు కనిపించడం లేదు. గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల నేపథ్యలో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించడం సాధ్యం కాదని హెచ్‌సీఏకు రాచకొండ పోలీసులు సమాచారమిచ్చారు. ‘‘39 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచకప్‌ వరకు 10 నుంచి 12 వేల వరకు కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తాం. ఈ టోర్నీ తర్వాత మొత్తం మార్చేస్తాం. దక్షిణం వైపు పైకప్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తూర్పు వైపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ వైపు పైకప్పు ఇప్పుడు పెట్టలేకపోతున్నాం. ప్రపంచకప్‌ పూర్తయ్యాక దీన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మొదటి వార్మప్‌ మ్యాచ్‌కు భద్రత గురించి ఇంకా చర్చ జరుగుతోంది. బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని హెచ్‌సీఏ సీఈవో సునీల్‌ పేర్కొన్నారు.

కప్పు సందడి: ప్రపంచకప్‌ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియంలో గురువారం ట్రోఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీకి సహాయకుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌కు ఉప్పల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. డ్రైనేజీ వ్యవస్థనూ మెరుగుపరిచాం. అలాగే జట్లకు జింఖానా మైదానంలోనూ ప్రాక్టీస్‌ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 29న జరిగే వార్మప్‌ మ్యాచ్‌కు భద్రత గురించి పోలీసులతో బీసీసీఐ బృందం చర్చిస్తోంది’’ అని చెప్పారు. ఉప్పల్‌లో పాక్‌- కివీస్‌ (ఈ నెల 29), ఆస్ట్రేలియా- పాక్‌ (అక్టోబర్‌ 3) వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రధాన మ్యాచ్‌లు నెదర్లాండ్స్‌- పాక్‌ (అక్టోబర్‌ 6), నెదర్లాండ్స్‌- న్యూజిలాండ్‌ (అక్టోబర్‌ 9), పాక్‌- శ్రీలంక (అక్టోబర్‌ 10) మధ్య నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని