IND vs AUS: రెట్టించిన ఉత్సాహంతో..

ఉత్సాహం ఉరకలేస్తుంటే, తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే.. ఆఖరి సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. క్లీన్‌స్వీప్‌ ఊరిస్తుండగా, ప్రపంచకప్‌ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న ఆతిథ్య జట్టు..

Updated : 27 Sep 2023 13:15 IST

ఆస్ట్రేలియాతో మూడో వన్డే నేడు * క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్‌ * మధ్యాహ్నం 1.30 నుంచి

ఉత్సాహం ఉరకలేస్తుంటే, తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే.. ఆఖరి సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. క్లీన్‌స్వీప్‌ ఊరిస్తుండగా, ప్రపంచకప్‌ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. మూడో వన్డేలో బుధవారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. మరి రోహిత్‌సేన మరోసారి అభిమానులను మురిపిస్తుందా! 3-0తో సిరీస్‌ను ముగిస్తుందా?

రాజ్‌కోట్‌: క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా బుధవారం జరిగే చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. వన్డేల్లో ఎప్పుడూ కంగారులను వైట్‌వాష్‌ చేయని భారత్‌.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ రోహిత్‌ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు.

అందుబాటులో 13 మందే: తొలి రెండు వన్డేల్లో ఆడని రోహిత్‌, కోహ్లి, కుల్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు. అయితే జట్టును వైరల్‌ జ్వరం పీడిస్తోంది. వివిధ కారణాల వల్ల మూడో వన్డేకు భారత్‌కు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతినివ్వగా.. పేసర్లు షమి, శార్దూల్‌, సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని హార్దిక్‌ పాండ్య ఇంటికి వెళ్లిపోయారు. ‘‘జ్వరం కారణంగా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లిపోయారు. కొందరికి విశ్రాంతినిచ్చాం. ప్రస్తుతం మాకు 13 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు’’ అని కెప్టెన్‌ రోహిత్‌ చెప్పాడు.

కొంతమంది ఆటగాళ్లు లేకపోయినా రోహిత్‌, కోహ్లి రాకతో టీమ్‌ఇండియా బలంగానే ఉందనడంలో సందేహం లేదు. కుల్‌దీప్‌ రాకతో స్పిన్‌ విభాగం కూడా బలపడనుంది. తొలి రెండు వన్డేల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌తో పాటు కూర్పుపై ప్రశ్నలకు జవాబులు దొరికిన నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా శ్రేయస్‌, సూర్య జోరందుకోవడం జట్టుకు సంతోషాన్నిస్తోంది. మూడో వన్డేలో రోహిత్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించవచ్చు. షమి, ప్రసిద్ధ్‌ కృష్ణల స్థానాల్లో బుమ్రా, సిరాజ్‌ జట్టులోకి వస్తారు. మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను నిలువరించడం కంగారూలకు సవాలే. రాజ్‌కోట్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు