Asian Games: వెండి వెలుగులు

3 స్వర్ణాలు సహా 15 పతకాలు.. ఇదీ ఆసియా క్రీడల్లో ఆదివారం భారత అత్యుత్తమ ప్రదర్శన. కానీ సోమవారం పసిడి మెరుపుల్లేవ్‌! దేశానికి స్వర్ణం దక్కలేదు.

Updated : 03 Oct 2023 06:55 IST

రజతాలు నెగ్గిన పారుల్‌, ఆన్సీ
మిక్స్‌డ్‌ రిలే జట్టుకు రెండో స్థానం
స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు
60కి చేరిన పతకాలు
హాంగ్‌జౌ

3 స్వర్ణాలు సహా 15 పతకాలు.. ఇదీ ఆసియా క్రీడల్లో ఆదివారం భారత అత్యుత్తమ ప్రదర్శన. కానీ సోమవారం పసిడి మెరుపుల్లేవ్‌! దేశానికి స్వర్ణం దక్కలేదు. అయితే పతక జోరు మాత్రం ఆగలేదు. అథ్లెటిక్స్‌లో పతకాల బాటలో భారత్‌ దూసుకెళ్తోంది. పోటీల తొమ్మిదో రోజు పారుల్‌, ఆన్సీ.. దేశానికి వెండి వెలుగులు పంచారు. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే జట్టు కూడా రజత సంబరాన్ని అందించింది. టీటీలో చారిత్రక కంచు.. స్కేటింగ్‌లో అనూహ్యంగా రెండు కాంస్యాలు.. వెరసి దేశానికి మరో ఏడు పతకాలు దక్కాయి. మన పతకాల సంఖ్య 60కి చేరింది.

సియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతక వేట కొనసాగుతోంది. సోమవారం మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్‌ చౌదరీ రజతం, ప్రీతి కాంస్యం దక్కించుకున్నారు. పారుల్‌ 9 నిమిషాల 27.63 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. ప్రీతి 9 నిమిషాల 43.32 సెకన్ల టైమింగ్‌తో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. విన్‌ఫ్రెడ్‌ (బహ్రెయిన్‌- 9:18.28సె) ఆసియా క్రీడల రికార్డు బద్దలుకొట్టి పసిడి పట్టేసింది. అయితే ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 9:15.31సె టైమింగ్‌తో జాతీయ రికార్డు నమోదు చేసి.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన పారుల్‌ ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయింది. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో ఆన్సీ సోజన్‌ దేశానికి వెండి పతకాన్ని అందించింది. అయిదో ప్రయత్నంలో 6.63 మీటర్ల దూరం దూకిన ఆమె.. వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో పాటు రజతాన్ని సొంతం చేసుకుంది. తొలి నాలుగు ప్రయత్నాల్లో ఆన్సీ వరుసగా 6.13మీ, 6.49మీ, 6.56మీ, 6.30మీ. ప్రదర్శన నమోదు చేసింది. చివరిదైన ఆరో ప్రయత్నంలో ఫౌల్‌ చేసింది. ఎన్నో ఆశలతో బరిలో దిగిన షైలి సింగ్‌ (6.48మీ) అయిదో స్థానంలో నిలిచి నిరాశపర్చింది. జియాంగ్‌ (చైనా- 6.73మీ) స్వర్ణం, యూ యాన్‌ (హాంకాంగ్‌- 6.50మీ) కాంస్యం గెలుచుకున్నారు. 4×400మీ. మిక్స్‌డ్‌ రిలేలో భారత్‌ పసిడి నిలబెట్టుకోలేకపోయింది. ఈ సారి రజతంతో సంతృప్తి పడింది. మొదట రేసులో బహ్రెయిన్‌ (3:14.02సె), శ్రీలంక (3:14.25సె), భారత్‌ (3:14.34) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దీంతో మహమ్మద్‌ అజ్మల్‌, విద్య రామ్‌రాజ్‌, రమేశ్‌ రాజేశ్‌, సుభా వెంకటేశన్‌తో కూడిన భారత్‌కు కాంస్యమే దక్కిందని అనుకున్నారు. కానీ అథ్లెట్లు లేన్‌ (వరుస) దాటారని రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకపై అనర్హత వేటు వేయడంతో భారత్‌కు వెండి పతకం సొంతమైంది. కజకిస్థాన్‌ (3:24.85సె)కు కంచు దక్కింది.

కాంస్యమే కానీ చరిత్ర: టేబుల్‌ టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో సుతీర్థ- ఐహిక జోడీ కాంస్యంతో తమ అద్భుత ప్రయాణాన్ని ముగించింది ఆసియా క్రీడల చరిత్రలో టీటీ మహిళల డబుల్స్‌లో దేశానికి దక్కిన తొలి పతకం ఇదే. సెమీస్‌లో సుతీర్థ- ఐహిక ద్వయం 3-4 (11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11) తేడాతో సుయాంగ్‌- సగ్యాంగ్‌ (ఉత్తర కొరియా) చేతిలో ఓడింది.

స్కేటింగ్‌లో సత్తా: భారత స్కేటర్లు అంచనాలు మించి రాణించారు. రెండు పతకాలు గెలిచి.. ఈ క్రీడల చరిత్రలో రోలర్‌ స్పోర్ట్స్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన (2010లో రెండు కాంస్యాలు)ను సమం చేశారు. ముందుగా మహిళల స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ. రిలే రేస్‌లో భారత్‌ కంచు పతకంతో రికార్డు నమోదు చేసింది. కార్తీక, హీరాల్‌, ఆరతి కస్తూరి త్రయం 4 నిమిషాల 34.861 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పతకం సాధించిన భారత బృందంలో 15 ఏళ్ల తెలంగాణ స్కేటర్‌ బత్తుల సంజన కూడా ఉంది. నాలుగో సభ్యురాలిగా ఉన్న ఆమె పోటీల్లో పాల్గొనలేదు. కస్తూరి.. భారత క్రికెటర్‌ సందీప్‌ వారియర్‌ భార్య. చైనీస్‌ తైపీ (4:19.447సె), దక్షిణ కొరియా (4:21.146సె) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అనంతరం పురుషుల స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ. రిలేలోనూ భారత్‌కు కాంస్యం దక్కింది. ఆనంద్‌ కుమార్‌, సిద్ధాంత్‌, విక్రమ్‌ కలిసి 4 నిమిషాల 10.128 సెకన్ల టైమింగ్‌ నమోదు చేశారు. ఇందులోనూ తైపీ (4:05.692సె), దక్షిణ కొరియా (4:05.702) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గాయి. బ్రిడ్జ్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌ చేరి పతకాన్ని ఖాయం చేసింది. క్వాలిఫికేషన్లో 278.93 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత్‌.. తుది నాలుగులో చోటు దక్కించుకుంది.


హాకీలో ఎదురేలేదు

బంగ్లాపై 12-0తో విజయం

ఆసియా క్రీడల్లో హాకీలో భారత్‌ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్‌ చేరిన భారత్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌లో 12-0తో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (2వ, 4వ, 32వ), మన్‌దీప్‌ (18వ, 24వ, 46వ) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టారు. అభిషేక్‌ (41, 57వ) రెండు గోల్స్‌ కొట్టగా.. లలిత్‌ (23వ), అమిత్‌ (28వ), నీలకంఠ (47వ), గుర్జాంత్‌ (56వ) ఒక్కో గోల్‌ కొట్టారు. తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 16-0తో, ఆ తర్వాత సింగపూర్‌ని 16-1తో, జపాన్‌పై 4-2తో, పాకిస్థాన్‌ను 10-2తో భారత్‌ ఓడించింది. స్క్వాష్‌లో సౌరభ్‌ క్వార్టర్స్‌ చేరాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అతడు 3-0తో అమర్‌ (కువైట్‌)ని చిత్తు చేశాడు. మహేశ్‌ అంతే తేడాతో సుకుయె (జపాన్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో జోష్న 1-3తో మింగ్‌ (ద.కొరియా) చేతిలో ఓడింది.


పీటీ ఉష రికార్డు సమం

థ్లెటిక్స్‌లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో  విద్య రామ్‌రాజ్‌ ఓ అరుదైన రికార్డును అందుకుంది. హీట్స్‌లో 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్‌కు అర్హత సాధించిన విద్య.. ఈ క్రమంలో పీటీ ఉష పేరిట సుదీర్ఘ కాలంగా నిలిచి ఉన్న జాతీయ రికార్డును సమం చేసింది. 1984లో ఉష ఈ రికార్డు నెలకొల్పింది. మరోవైపు డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయిదు ఈవెంట్లు ముగిసిన తర్వాత శంకర్‌ 4260 పాయింట్లతో ముందంజలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్‌ కుమార్‌ (48.28 సె), పాలక్‌షా (49.61 సె) ఫైనల్‌ చేరగా.. హైజంప్‌లో సందేశ్‌, సర్వేశ్‌ కూడా తుదిపోరులో అడుగుపెట్టారు. వీరిద్దరూ క్వాలిఫయింగ్‌లో 2.10 మీటర్లు ఎగిరారు. పురుషుల 800 మీటర్లలో మహ్మద్‌ అఫ్సల్‌ (1 నిమిషం 46.79 సె), కృష్ణన్‌ (1 నిమిషం  49.45 సె) పతక పోరుకు అర్హత సాధించారు.


ఆర్చరీలో క్వార్టర్స్‌కు

ఆర్చరీలో భారత జట్లు శుభారంభం చేశాయి. కాంపౌండ్‌ పురుషుల విభాగం ప్రిక్వార్టర్స్‌లో ఒజస్‌, అభిషేక్‌, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు 235-219తో దక్షిణ కొరియాను ఓడించింది. తొలి రౌండ్లో బై దక్కించుకున్న మహిళల కాంపౌండ్‌ జట్టు (సురేఖ, అదితి, పర్ణీత్‌).. క్వార్టర్స్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. పురుషుల రికర్వ్‌ జట్టు (బొమ్మదేవర ధీరజ్‌, అతానుదాస్‌, తుషార్‌) 6-0తో హాంకాంగ్‌పై నెగ్గింది. రికర్వ్‌ మహిళల జట్టు (అంకిత, భజన్‌కౌర్‌, సిమ్రన్‌జీత్‌) 5-1తో జపాన్‌ను ఓడించింది. వ్యక్తిగత విభాగాల్లో సురేఖ, ఓజస్‌, అభిషేక్‌వర్మ, అదితి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. జ్యోతి మొదట 145- 132తో విజేసింఘేపై, తర్వాత సాద్‌ మహ్మద్‌ (ఇరాక్‌)పై నెగ్గింది. కబడ్డీలో భారత మహిళల జట్టు గ్రూప్‌-ఏ తొలి మ్యాచ్‌లో 34-34తో చైనీస్‌ తైపీతో డ్రా చేసుకుంది.

శ్రీకాంత్‌ శుభారంభం: బ్యాడ్మింటన్‌లో సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అతడు 21-10, 21-10తో లీ యున్‌ (కొరియా)ను ఓడించాడు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 21-11, 21-16తో చౌహిన్‌-లిచున్‌ (హాంకాంగ్‌)పై నెగ్గగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాయిప్రతీక్‌-తనీషా 21-18, 21-14తో లియోంగ్‌-వెంగ్‌ (మకావు)ను ఓడించారు. సిక్కిరెడ్డి-రోహన్‌, అర్జున్‌-ధ్రువ్‌ జోడీలు గాయాలతో వైదొలిగాయి.


ఆసియా క్రీడల్లో ఈనాడు

క్రికెట్‌ (పురుషులు): భారత్‌ × నేపాల్‌ క్వార్టర్‌ఫైనల్‌, ఉ.6.30 నుంచి

ఆర్చరీ: సురేఖ, అదితి, ఓజస్‌, అభిషేక్‌, అతానుదాస్‌, ధీరజ్‌ (వ్యక్తిగత విభాగాలు, క్వార్టర్స్‌), ఉ.6.30 నుంచి

అథ్లెటిక్స్‌: మహిళల హైజంప్‌ ఫైనల్‌: రుబీనా, పూజ (సా.4.30 నుంచి); పురుషుల ట్రిపుల్‌జంప్‌ ఫైనల్‌: అబ్దుల్లా, ప్రవీణ్‌ (సా.4.40 నుంచి); మహిళల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌: విద్య (సా.4.50 నుంచి); పురుషుల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌: పాలక్‌షా, సంతోష్‌ (సా.4.50 నుంచి); మహిళల 5 వేల మీ. ఫైనల్‌: పారుల్‌, అంకిత (సా.5.20 నుంచి); మహిళల జావెలిన్‌త్రో ఫైనల్‌: అన్నురాణి (సా.5.40 నుంచి); పురుషుల 800 మీ ఫైనల్‌: కృషన్‌, అఫ్సల్‌ (సా.5.55 నుంచి)

బాక్సింగ్‌: ప్రీతి, లవ్లీనా (సెమీఫైనల్స్‌), మ.11.30 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని