RO-KO: వీరి గమనం ఎటు?

ప్రపంచకప్‌ అయిపోయింది. భారత అభిమానుల ఆశ తీరలేదు. మనదే అనుకున్న కప్పుని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది.

Updated : 21 Nov 2023 06:50 IST

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచకప్‌ అయిపోయింది. భారత అభిమానుల ఆశ తీరలేదు. మనదే అనుకున్న కప్పుని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. తమ ఆరాధ్య ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌ పట్టుకుని సంబరాలు చేసుకునే దృశ్యాన్ని ఊహించుకుంటే.. వారి విషణ్ణ వదనాలను చూడాల్సి వచ్చింది. ప్రపంచకప్‌ ఫైనల్‌ అనంతరం అత్యంత బాధ కలిగించిన దృశ్యాలవి. ఇదే సమయంలో కోహ్లి, రోహిత్‌ల భవితవ్యం గురించిన ప్రశ్నలూ
అభిమానులను ఆలోచనలో పడేశాయి.

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలవకపోవడం ఎక్కువ వేదన కలిగించడానికి ఓ ముఖ్య కారణం.. కోహ్లి, రోహిత్‌లకు ఇదే చివరి కప్పు కావచ్చన్న అంచనా. కోహ్లి 2011 కప్పు గెలిచిన జట్టులో సభ్యుడైనప్పటికీ.. ఆ విజయంలో అతడి పాత్ర నామమాత్రం. ఒక సూపర్‌ స్టార్‌గా ఎదిగాక విరాట్‌ జట్టుకు కప్పు అందిస్తే చూడాలని అభిమానులు ఆశపడ్డారు. ఈ ప్రపంచకప్‌లో 3 శతకాలు సహా 765 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచిన విరాట్‌.. జట్టును విజేతగా నిలపడానికి చేయాల్సిందంతా చేశాడు. ఇక 2011 ప్రపంచకప్‌ జట్టులో భాగం కాలేకపోయిన రోహిత్‌కు.. ఈసారి కెప్టెన్‌గా జట్టును నడిపించే అవకాశం వచ్చింది. అతను కెప్టెన్‌గానే కాక బ్యాటర్‌గానూ గొప్ప ప్రదర్శన చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 597 పరుగులు సాధించాడు. నాయకుడిగా అతడి నైపుణ్యాలను అందరూ చూశారు. కానీ ఈ ఇద్దరూ కప్పుకి అడుగు దూరంలో నిలిచిపోవడం అభిమానులకు తీవ్ర వేదన కలిగించింది.

ప్రస్తుతం రోహిత్‌ వయసు 36 ఏళ్లు. తనకంటే కోహ్లి ఏడాదే చిన్నవాడు. కెరీర్‌ చరమాంకంలో ఉన్న వీళ్లిద్దరూ ఇంకో నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడటం కష్టమే. ఒకప్పటి రోజులంటే వేరు కానీ.. ఇప్పుడు వన్డేలకు ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. వన్డే ప్రపంచకప్‌ జరగడానికి ఒకట్రెండేళ్ల ముందు మాత్రమే తరచుగా ఆ ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో భారత్‌ సహా ఏ జట్టూ సంవత్సరం పాటు పెద్దగా వన్డేలు ఆడే అవకాశం లేదు. ఆ తర్వాత కూడా ఎప్పటికి తరచుగా వన్డేలు ఆడతారో తెలియదు. ఈలోపు భవిష్యత్‌ దిశగా జట్టు ప్రణాళికలు మారిపోవచ్చు. 2027 ప్రపంచకప్‌ దిశగా యువ ఆటగాళ్లకు జట్టులో ప్రాధాన్యం పెంచాలన్న బోర్డు, సెలక్టర్లు భావించవచ్చు. మరోవైపు వన్డేలు శారీరకంగా, మానసికంగా సవాల్‌ విసురుతాయి కాబట్టి వయసు పెరుగుతున్న రోహిత్‌, కోహ్లి ఇక చాలనుకుని ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడే ప్రకటన చేస్తే అది ఫైనల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ వైదొలిగినట్లు ఉంటుంది కాబట్టి.. కొన్ని నెలల తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటన చేయొచ్చు. లేదా మళ్లీ భారత జట్టు వన్డే సిరీస్‌ ఏదైనా ఆడితే.. ఆ సమయంలో మైదానంలోనే రిటైర్‌ కావచ్చు.

టీ20ల్లో మళ్లీ?

వచ్చే ఏడాది కాలంలో దాదాపుగా వన్డేలుండవు. టెస్టుల సంఖ్య కూడా తక్కువే కావచ్చు. అలాంటపుడు అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి, రోహిత్‌ చాలా వరకు ఖాళీ అన్నట్లే. వీళ్లిద్దరూ గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడలేదు. వాళ్ల దృష్టంతా వన్డే ప్రపంచకప్‌ మీదే ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అధికారికంగా టీ20లకు గుడ్‌బై చెప్పలేదు కానీ.. వరుసగా సిరీస్‌లకు దూరమవుతుంటే ఇక ఆ ఫార్మాట్లో ఆడరనే భావించారు అభిమానులు. అయితే ఇటీవలి ప్రపంచకప్‌లో వీళ్లిద్దరి ప్రదర్శన తర్వాత వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగితే బాగుంటుందనే ఆశ అభిమానుల్లో కలుగుతోంది. ఎలాగూ ఐపీఎల్‌లోనూ ఆడతారు. అందులో దూకుడు చూపించారంటే కోహ్లి, రోహిత్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలన్న డిమాండ్‌ పెరగొచ్చు. ఆ టోర్నీలో వాళ్లిద్దరూ జట్టుకు బలమవుతారే తప్ప బలహీనత మాత్రం కాబోరు. కాబట్టి టీ20ల్లోకి వీరి పునరాగమనాన్ని కొట్టిపారేయలేం.

ద్రవిడ్‌ భవితవ్యమేంటి?

కోహ్లి, రోహిత్‌లతో పాటు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భవితవ్యం మీదా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అతడి రెండేళ్ల పదవీ కాలం వన్డే ప్రపంచకప్‌తోనే ముగిసింది. ఫైనల్‌ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన పదవీ కాలం ముగిసిందని, కానీ తన భవితవ్యంపై ఏమీ ఆలోచించట్లేదని పేర్కొన్నాడు ద్రవిడ్‌. ప్రస్తుతానికి కొంత కాలం ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇంకో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో మొదలయ్యే టీ20 సిరీస్‌కు ద్రవిడ్‌ జట్టుతో పాటు ఉండడు. వచ్చే నెలలో జట్టు టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అప్పటికి ద్రవిడ్‌ భవితవ్యమేంటన్న దానిపై ఒక అంచనా రావచ్చు. కోచ్‌గా ద్రవిడ్‌ పనితీరు అద్భుతం అని చెప్పలేం. అలా అని బాగాలేదనీ చెప్పలేం. ద్రవిడ్‌ హయాంలో భారత్‌ ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. కానీ నిరుడు టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌లో విఫలమైంది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో బాగా ఆడినా టైటిల్‌ మాత్రం సాధించలేకపోయింది.

ద్రవిడ్‌ రెండేళ్ల కిందట అయిష్టంగా చీఫ్‌ కోచ్‌ పదవిని తీసుకున్నాడు. అందులో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ద్రవిడ్‌ను కొనసాగమని బోర్డు ఒత్తిడి తెస్తుందా అన్నది సందేహమే. అతనూ కొనసాగడానికి అంత ఇష్టపడతాడా అన్నది కూడా ప్రశ్నే. కోచ్‌గా కొనసాగే ఆలోచన ఉందేమోనని ద్రవిడ్‌ను ఒకసారి అడిగి అతను సరేనంటే పదవీకాలాన్ని ఇంకో ఏడాది అవకాశముంది. అతను కొనసాగనంటే కొత్త కోచ్‌ ఎంపిక ప్రక్రియను త్వరలోనే బీసీసీఐ ఆరంభించే అవకాశముంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం కోసం ద్రవిడ్‌ కోచ్‌ పదవికి దూరం కావచ్చని అతడి సన్నిహిత వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని