India vs South Africa: భారత్‌ తడబ్యాటు

ప్చ్‌.. టీమ్‌ఇండియా! బ్యాటుతో పేలవ ప్రదర్శనతో పరాభవం తప్పలేదు. సాయి సుదర్శన్‌, రాహుల్‌ తప్ప అంతా బ్యాట్లెత్తేశారు. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా.. రెండో వన్డేలో అలవోకగా నెగ్గి సిరీస్‌ను సమం చేసింది.

Updated : 20 Dec 2023 10:27 IST

రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి
జోర్జి అజేయ శతకం
గబేహా

ప్చ్‌.. టీమ్‌ఇండియా! బ్యాటుతో పేలవ ప్రదర్శనతో పరాభవం తప్పలేదు. సాయి సుదర్శన్‌, రాహుల్‌ తప్ప అంతా బ్యాట్లెత్తేశారు. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా (India vs South Africa).. రెండో వన్డేలో అలవోకగా నెగ్గి సిరీస్‌ను సమం చేసింది.

తొలి వన్డేలో అదరగొట్టిన భారత జట్టు రెండో వన్డేలో తేలిపోయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. మొదట బ్యాటుతో తడబడ్డ టీమ్‌ఇండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్‌ (62; 83 బంతుల్లో 7×4, 1×6), కేఎల్‌ రాహుల్‌ (56; 64 బంతుల్లో 7×4) మాత్రమే రాణించారు. నంద్రీ బర్గర్‌ (3/30), కేశవ్‌ మహరాజ్‌ (2/51), హెండ్రిక్స్‌ (2/34) భారత్‌ను దెబ్బతీశారు. ఓపెనర్‌ టోని డి జోర్జి (119 నాటౌట్‌; 122 బంతుల్లో 9×4, 6×6) సెంచరీ కొట్టడంతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. హెండ్రిక్స్‌ (52; 81 బంతుల్లో 7×4), వాండెర్‌ డసెన్‌ (36; 51 బంతుల్లో 5×4) రాణించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. చివరి వన్డే గురువారం జరుగుతుంది.

ఛేదించారు తేలికగా..: స్వల్ప ఛేదనలో ఓపెనర్‌ జోర్జి ఆటే హైలైట్‌. సాధికారికంగా ఆడిన అతడు.. లక్ష్యాన్ని మరింత తేలిక చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువేమీ లేకపోవడంతో అతడు, మరో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేశారు. భారత బౌలర్లు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు. ఇద్దరిలో జోర్జి దూకుడును ప్రదర్శించాడు. చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ.. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. 55 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. హెండ్రిక్స్‌ ఎక్కువగా సింగిల్స్‌కు పరిమితమయ్యాడు. 23 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 105 కాగా.. అప్పటికి జోర్జి 65 పరుగులతో ఉన్నాడు. అయితే అక్కడి నుంచి వేగం పెంచిన హెండ్రిక్స్‌.. అవేష్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదేశాడు. కానీ జట్టు స్కోరు 130 వద్ద అతడు ఔటయ్యాడు. కానీ జోర్జి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా.. డసెన్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఆఖర్లో డసెన్‌ను రింకు ఔట్‌ చేయడం విశేషం. ఆ తర్వాత మార్‌క్రమ్‌ (2 నాటౌట్‌)తో కలిసి జోర్జి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

తేలిపోయిన భారత్‌: కొత్త కుర్రాడు సాయి సుదర్శన్‌ మరోసారి రాణించినా, కెప్టెన్‌ రాహుల్‌ అర్ధశతకం సాధించినా.. మిగతా బ్యాటర్ల నుంచి కనీస ప్రదర్శన కరవవడంతో అంతకుముందు టీమ్‌ఇండియా తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆద్యంతం ఇన్నింగ్స్‌ను తన నియంత్రణలో ఉంచుకుంది. తొలి ఓవర్లోనే రుతురాజ్‌ (4) వికెట్‌ కోల్పోయిన టీమ్‌ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు పోగొట్టుకుంటూ పరుగుల వేటలో వెనుకబడింది. సఫారీ బౌలర్లు భారీ భాగస్వామ్యాలు నమోదు కానివ్వలేదు. అయితే మరో ఓపెనర్‌ సుదర్శన్‌ ఈసారి కూడా ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో అర్ధశతకం సాధించిన అతడు.. మరోసారి చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. భారత్‌ ఆరంభం మాత్రం పేలవమే. 5.5 ఓవర్లలో స్కోరు 18 పరుగులు మాత్రమే. బర్గర్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ రుతురాజ్‌ ఎల్బీగా వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మ (30 బంతుల్లో 10) పరుగుల కోసం చెమటోడ్చాడు. ధాటిగా ఆడలేకపోయాడు. అతడు ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 4 పరుగులు చేశాడు. సుదర్శన్‌ కూడా తొలి 15 బంతుల్లో 8 పరుగులే చేసినా క్రమంగా పుంజుకున్నాడు. చక్కని షాట్లతో వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. తిలక్‌ తడబాటు మాత్రం కొనసాగింది. చివరికి 12వ ఓవర్లో జట్టు స్కోరు 46 వద్ద అతడు నిష్క్రమించాడు. ఆ దశలో సుదర్శన్‌కు కెప్టెన్‌ రాహుల్‌ తోడయ్యాడు. ఇన్నింగ్స్‌లో భారత్‌కు కాస్త మంచి దశ ఏదైనా ఉంది అంటే.. అది వీరి భాగస్వామ్యంలో ఆడిన ఓవర్లే. అయితే.. రాహుల్‌ బ్యాట్‌ ఝళిపించలేకపోవడంతో వీరి భాగస్వామ్యం మొదట్లోనూ పరుగులు కష్టంగానే వచ్చాయి. రాహుల్‌ తాను ఎదుర్కొన్న మొదటి 18 బంతుల్లో 6 పరుగులే చేయగలిగాడు. 19 ఓవర్లకు స్కోరు 74 మాత్రమే. ఆ తర్వాత సుదర్శన్‌ అర్ధశతకం (65 బంతుల్లో) పూర్తి చేయగా.. రాహుల్‌ దూకుడు పెంచాడు. కొన్ని చక్కని బౌండరీలతో అలరించాడు. కానీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతూ.. టీమ్‌ఇండియా మెరుగ్గా కనిపిస్తోన్న దశలో సుదర్శన్‌ను విలియమ్స్‌ ఔట్‌ చేయడంతో 68 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్‌లో అదే మలుపు కావొచ్చు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అక్కడి నుంచి భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే పెవిలియన్‌ చేరాడు. అవకాశాన్ని వృథా చేసుకుంటూ సంజు శాంసన్‌ (12; 23 బంతుల్లో 1×4) బౌల్డ్‌ కాగా, అరంగ్రేట బ్యాటర్‌ రింకు (17)తో కలిసి ఇన్నిగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన రాహుల్‌.. చివరికి అయిదో వికెట్‌ రూపంలో నిష్క్రమించడంతో జట్టు మరింత ఇబ్బందుల్లో పడింది. 36వ ఓవర్లో అతడు వెనుదిరిగేటప్పటికి స్కోరు 167. తర్వాతి ఓవర్లోనే కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో రింకు కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత టెయిలెండేర్లేమీ అద్భుతాలు చేయలేదు. చకచకా పెవిలియన్‌ బాట పట్టారు. అర్ష్‌దీప్‌ (18) కాస్త రాణించడంతో భారత్‌ 200 దాటగలిగింది. అవేష్‌ (9)తో 9వ వికెట్‌కు అతడు 18 పరుగులు జోడించాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ ఎల్బీ (బి) బర్గర్‌ 4; సాయి సుదర్శన్‌ (సి) క్లాసెన్‌ (బి) విలియమ్స్‌ 62; తిలక్‌ వర్మ (సి) హెండ్రిక్స్‌ (బి) బర్గర్‌ 10; రాహుల్‌ (సి) మిల్లర్‌ (బి) బర్గర్‌ 56; సంజు శాంసన్‌ (బి) హెండ్రిక్స్‌  12; రింకు (సి) క్లాసెన్‌ (బి) మహరాజ్‌ 17; అక్షర్‌ (సి) వెరీనె (బి) మార్‌క్రమ్‌ 7; కుల్‌దీప్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) మహరాజ్‌ 1; అర్ష్‌దీప్‌ (సి) మిల్లర్‌ (బి) హెండ్రిక్స్‌ 18; అవేష్‌ ఖాన్‌ రనౌట్‌ 9; ముకేశ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (46.2 ఓవర్లలో ఆలౌట్‌) 211;

వికెట్ల పతనం: 1-4, 2-46, 3-114, 4-136, 5-167, 6-169, 7-172, 8-186, 9-204;

బౌలింగ్‌: నంద్రీ బర్గర్‌ 10-0-30-3; లిజాడ్‌ విలియమ్స్‌ 9-1-49-1; హెండ్రిక్స్‌ 9.2-1-34-2; ముల్దర్‌ 4-0-19-0; కేశవ్‌ 10-0-51-2; మార్‌క్రమ్‌ 4-0-28-1

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (సి) ముకేశ్‌ (బి) అర్ష్‌దీప్‌ 52; టోని డి జోర్జి నాటౌట్‌ 119; వాండెర్‌ డసెన్‌ (సి) శాంసన్‌ (బి) అర్ష్‌దీప్‌ 36; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6

మొత్తం: (42.3 ఓవర్లలో 2 వికెట్లకు) 215;

వికెట్ల పతనం: 1-130, 2-206;

బౌలింగ్‌: ముకేశ్‌ 8-2-46-0; అర్ష్‌దీప్‌ 8-0-28-1; అవేష్‌ 8-0-43-0; అక్షర్‌ 6-0-22-0; కుల్‌దీప్‌ 8-0-48-0; తిలక్‌ 3-0-18-0; రింకు 1-0-2-1; సుదర్శన్‌ 0.3-0-8-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని