India vs South Africa: కూర్పెలా?

బ్యాటింగ్‌ను బలోపేతం చేయడం కోసం కేఎల్‌ రాహుల్‌తో వికెట్‌కీపింగ్‌ చేయించాలా వద్దా..? షమి స్థానంలో ముకేశ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలలో ఎవరిని తీసుకోవాలి..?

Updated : 24 Dec 2023 10:18 IST

సెంచూరియన్‌

బ్యాటింగ్‌ను బలోపేతం చేయడం కోసం కేఎల్‌ రాహుల్‌తో వికెట్‌కీపింగ్‌ చేయించాలా వద్దా..? షమి స్థానంలో ముకేశ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలలో ఎవరిని తీసుకోవాలి..?దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు (India vs South Africa) ముందు టీమ్‌ఇండియా ముందున్న ప్రశ్నలివి! తొలిసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ అందుకోవాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు ఈ ప్రశ్నలకు ఎలాంటి జవాబు వెతుకుతుందో..?

వాళ్లిద్దరిలో..: తొలి టెస్టు వేదిక సెంచూరియన్‌ సాధారణంగా పేస్‌ బౌలర్లకు స్వర్గధామం. మంచి బౌన్స్‌ లభిస్తుంది. సగం రోజయ్యాక రివర్స్‌ స్వింగ్‌కు సహకరిస్తుంది. స్వింగ్‌నే దృష్టిలో పెట్టుకుంటే ముకేశ్‌ నేరుగా జట్టులోకి వస్తాడు. కానీ దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల సందర్భంగా అతడు మెరుగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాడు. అయితే 40 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 151 వికెట్లతో రెడ్‌ బాల్‌ క్రికెట్లో అతడి రికార్డు బాగుంది. 48 బంతులకో వికెట్‌ చొప్పున ముకేశ్‌కు మంచి స్ట్రైక్‌రేటే ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్‌ చేయగలడు. అంతే కాకుండా రంజీ ట్రోఫీలో టీ తర్వాత రివర్స్‌స్వింగ్‌ బాగా రాబట్టాడని అందరికీ తెలుసు. అతడు నిలకడగా ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో బంతులేస్తాడు. ఇక జట్టులో స్థానం కోసం ముకేశ్‌తో ప్రసిద్ధ్‌ కృష్ణ పోటీపడుతున్నాడు. బంతిని బలంగా గుద్ది అదనపు బౌన్స్‌ రాబట్ట గల అతడి సామర్థ్యం సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. 2015లో రంజీ అరంగేట్రం చేసి ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు కూడా ఆడని ప్రసిద్ధ్‌.. షమి ఫిట్‌గా ఉండుంటే అసలు చర్చలోనే ఉండేవాడు కాదు. అయితే భారత్‌ ‘ఎ’ తరఫున దక్షిణాఫ్రికా ‘ఎ’పై అయిదు వికెట్ల ఘనత సాధించడం అతడికి సానుకూలాంశం. కొంచెం ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసే ప్రసిద్ధ్‌ మరింత బౌన్స్‌ రాబట్టగలడు కానీ.. అదే సమయంలో పరుగులూ ఎక్కువే ఇస్తాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ విషయంలో నిలకడ ఉండదు. మొత్తం మీద వన్డే ఫామ్‌ ప్రకారం చూస్తే.. ముకేశ్‌కు తుది జట్టులో చోటు దొరకడం కష్టం. కానీ రెడ్‌బాల్‌ క్రికెట్లో నైపుణ్యాల పరంగా చూస్తే.. ప్రసిద్ధ్‌ కన్నా అతడికే అవకాశాలెక్కువ.

రాహుల్‌ కీపింగ్‌?: జట్టు అవసరాల రీత్యా పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ చేస్తున్నాడు. అతడు ఆ బాధ్యతలు తీసుకోవడం వల్ల మరో నాణ్యమైన బ్యాటర్‌ను తుది జట్టులో ఆడించే వెసులుబాటు టీమ్‌ఇండియాకు లభిస్తోంది. టెస్టు క్రికెట్లోనూ అదే పంథా అనుసరించాలా..? రిషభ్‌ పంత్‌ జట్టులో ఉంటే ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. కానీ అతడు గాయపడటం.. ఆ తర్వాత అవకాశం దక్కించుకున్న కేఎస్‌ భరత్‌ పెద్దగా నిరూపించుకోకపోవడంతో వికెట్‌కీపర్‌గా అందరి చూపు రాహుల్‌పైనే పడింది. అతడు ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. పేస్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేయడం అతడికి కష్టం కాకపోవచ్చు కానీ.. స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాల బంతులను అందుకోవడం మాత్రం పెద్ద సవాలే. ఈ కారణంతో స్పెషలిస్ట్‌ వికెట్‌కీపర్‌ భరత్‌ను ఎంపిక చేస్తే.. ఒక ప్రధాన బ్యాటర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌పై అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌.. జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు రోహిత్‌తో కలిసి రాహుల్‌ లేదా గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. ఇలా అయితేనే మిడిల్‌ ఆర్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ కీపింగ్‌ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని