K.L. Rahul: అద్భుత పోరాటం

తొలి రోజు ఆటలో భారత్‌ స్కోరు 200 దాటిందన్నా.. ఆట ముగిసే సరికి ఆలౌట్‌ కాలేదన్నా.. అందుకు రాహుల్‌ కారణం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత బ్యాటింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించిన అతను జట్టును పోరాడే స్థాయిలో నిలిపాడనే చెప్పాలి.

Updated : 27 Dec 2023 03:15 IST

తొలి రోజు ఆటలో భారత్‌ స్కోరు 200 దాటిందన్నా.. ఆట ముగిసే సరికి ఆలౌట్‌ కాలేదన్నా.. అందుకు రాహుల్‌ కారణం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత బ్యాటింగ్‌ నైపుణ్యాలు ప్రదర్శించిన అతను జట్టును పోరాడే స్థాయిలో నిలిపాడనే చెప్పాలి. టెస్టుల్లో మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ఆడుతూ అతడు చేసిన పోరాటం ఎంతో గొప్పది. శార్దూల్‌ సహకారంతో మొదట ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దే బాధ్యతను రాహుల్‌ తీసుకున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న అతను పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నాడు. అంపైర్‌కు సూటిగా ఎడమ భుజం ఉండేలా క్రీజులో లోపల నిలబడి, శరీరానికి దగ్గరగా చేతులు పెట్టుకుని, కుడి చేతిని కాస్త వంచి రాహుల్‌ సౌకర్యంగా షాట్లు ఆడాడు. అస్థిర బౌన్స్‌ను అంచనా వేస్తూ ఓపికతో నిలబడ్డాడు. కఠినమైన బంతులను ఆడకుండా వదిలేశాడు. షాట్‌ కొట్టే అవకాశామున్న బంతులను మాత్రం ఉపయోగించుకున్నాడు. యాన్సెన్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా రాహుల్‌ బాదిన సిక్సర్‌ అలరించింది. శార్దూల్‌ ఉన్నంతసేపు ఆచితూచి ఆడిన రాహుల్‌.. ఆ తర్వాత గేరు మార్చాడు. బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు లేకపోవడంతో వేగంగా ఆడి ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు. టీ విరామానికి జట్టు 176/7తో నిలిచింది. అప్పటికీ రాహుల్‌ 71 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కానీ చివరి సెషన్‌లో రాహుల్‌ జోరు పెంచాడు. వరుసగా 4, 6తో అర్ధసెంచరీ అందుకున్నాడు. బుమ్రా (1; 19 బంతుల్లో)ను అవతలి ఎండ్‌లో పెట్టుకుని రాహుల్‌ స్కోరుబోర్డును నడిపించాడు. బుమ్రా సహకారానికి యాన్సెన్‌ (1/52) ముగింపు పలికినా.. రాహుల్‌ ఎదురు దాడి కొనసాగించాడు. కొయెట్జీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ మూడో సెషన్‌లో తొమ్మిది ఓవర్ల తర్వాత అననుకూల వాతావరణం వల్ల ఆట సాధ్యం కాలేదు. రాహుల్‌తో పాటు సిరాజ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని