KL Rahul: ఆడాలి ఇలా..

ఓ ఆటగాడు సెంచరీ సాధించడం గొప్ప విషయం. ఇక అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని శతకం సాధిస్తే.. చిరస్మరణీయ బ్యాటింగ్‌ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటే.. ఆ ఇన్నింగ్స్‌ విలువే వేరు.

Updated : 28 Dec 2023 09:34 IST

ఆటగాడు సెంచరీ సాధించడం గొప్ప విషయం. ఇక అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని శతకం సాధిస్తే.. చిరస్మరణీయ బ్యాటింగ్‌ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటే.. ఆ ఇన్నింగ్స్‌ విలువే వేరు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) సాధించిన సెంచరీ కూడా అలాంటిదే. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్‌ విఫలమవడంతో జట్టు 92    పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అతని సెంచరీ లేకుంటే భారత్‌ 150 పరుగులు కూడా చేసేది కాదనే చెప్పాలి.

ఇదో ఉదాహరణ: కఠిన పరిస్థితుల్లో టెస్టులో ఎలా బ్యాటింగ్‌ చేయాలన్న దానికి రాహుల్‌ సాధించిన ఈ సెంచరీ ఓ మంచి ఉదాహరణ. ఈ ఇన్నింగ్స్‌లో అతను గొప్ప పరిణతి ప్రదర్శించాడు. తనకు అలవాటు లేని స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా సత్తాచాటాడు. 2014 డిసెంబర్‌ 26నే మొదలైన తన టెస్టు అరంగేట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై రాహుల్‌ ఆరో స్థానంలో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అదే తేదీన ఆరంభమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. వన్డేల్లో మిడిలార్డర్‌లో ఆడుతున్న రాహుల్‌.. టెస్టుల్లో మాత్రం ఓపెనర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు జట్టు అవసరాల దృష్ట్యా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా మిడిలార్డర్‌లో ఆడాల్సి వచ్చింది. అయినా ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నాడు. తన ఇన్నింగ్స్‌లో డిఫెన్స్‌, అటాకింగ్‌ రెండూ చూపించాడు. శార్దూల్‌ వికెట్‌ పడేవరకూ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించిన అతను.. ఆ తర్వాత టెయిలెండర్లును ఓ ఎండ్‌లో పెట్టుకుని మరో ఎండ్‌లో భారీ షాట్లతో చెలరేగాడు. కఠిన పరిస్థితుల్లో అతను చూపించిన తెగువ, పోరాటం అద్భుతం. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. బంతిని కచ్చితంగా అంచనా వేసి.. సొగసైన కవర్‌డ్రైవ్‌, కట్‌ షాట్లు, లాఫ్టెడ్‌ డ్రైవ్‌, పుల్‌షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలి, ఏ బంతికి ఎలాంటి షాట్‌ కొట్టాలనే స్పష్టమైన ఆలోచనతో కనిపించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతుల జోలికి అసలే వెళ్లలేదు. అతని ఫుట్‌వర్క్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్టాన్స్‌ను కాస్త మార్చుకుని క్రీజులో సౌకర్యవంతంగా కదిలాడు. బౌన్సర్లు తగిలినా వెనక్కి తగ్గలేదు. కళాత్మక బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. విదేశాల్లో ఏడో టెస్టు సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. గత సిరీస్‌ (2021-22)లో ఇక్కడ సెంచరీ చేసిన అతను.. సెంచూరియన్‌లో వరుసగా రెండో టెస్టు శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని