సంక్షిప్త వార్తలు(3)

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు కోల్పోయింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్‌ విడుదల చేసిన జాబితాలో పురుషుల డబుల్స్‌లో రెండు స్థానాలు కోల్పోయిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ మూడో స్థానంలో నిలిచింది.

Updated : 12 Jun 2024 06:57 IST

నంబర్‌వన్‌ ర్యాంకు కోల్పోయిన సాత్విక్‌ జోడీ 

దిల్లీ: భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు కోల్పోయింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్‌ విడుదల చేసిన జాబితాలో పురుషుల డబుల్స్‌లో రెండు స్థానాలు కోల్పోయిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ మూడో స్థానంలో నిలిచింది. లియాంగ్‌ కెంగ్‌- వాంగ్‌ చాంగ్‌ (చైనా) జంట నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 10, లక్ష్యసేన్‌ 14, కిదాంబి శ్రీకాంత్‌ 32వ స్థానాల్లో నిలిచారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 12వ ర్యాంకు సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో 19, గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ 24వ స్థానాల్లో నిలిచారు.


జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం

లుసానె: హాకీలో మరో మెగా టోర్నీకి భారత్‌ వేదికగా నిలవబోతోంది. వచ్చే ఏడాది జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌కు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి జర్మనీ విజేతగా నిలిచింది. స్పెయిన్, భారత్‌ మూడు, నాలుగో స్థానాలు దక్కించుకున్నాయి. 2013 (దిల్లీ), 2016 (లఖ్‌నవూ), 2021 (భువనేశ్వర్‌)లో భారత్‌ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. 2016లో టైటిల్‌ కూడా గెలిచింది. ‘‘ప్రపంచకప్‌ నిర్వహించే అవకాశం మరోసారి దక్కడం అంతర్జాతీయ హాకీలో భారత్‌ ఎదుగుదలకు నిదర్శనం. మాపై నమ్మకం ఉంచిన అంతర్జాతీయ సమాఖ్యకు కృతజ్ఞతలు’’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ అన్నాడు. 


హర్షిత- శ్రుతి జోడీ నిష్క్రమణ 

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి భారత జోడీ హర్షిత రౌత్‌- శ్రుతి స్వేన్‌ నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో హర్షిత- శ్రుతి జోడీ 19-21, 19-21తో డానియా- కి తియో (ఆస్ట్రేలియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో అభిషేక్‌ యెలిగర్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. రెండో అర్హత రౌండ్లో అభిషేక్‌ 21-15, 21-14తో యింగ్‌ చాన్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని