‘లక్ష్య’ జ్యోతికకు స్వర్ణం

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్‌) మెరిసింది. ఇండియా గ్రాండ్‌ప్రి-3 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో సత్తాచాటింది.

Published : 13 Jun 2024 03:04 IST

బెంగళూరు: ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్‌) మెరిసింది. ఇండియా గ్రాండ్‌ప్రి-3 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 400 మీటర్ల పరుగును 51.53 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జ్యోతికశ్రీ.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో కోచ్‌ నాగపురి రమేశ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటోంది.


ఒలింపిక్స్‌లో నాదల్, అల్కరాస్‌ జంటగా.. 

మాడ్రిడ్‌: అగ్రశ్రేణి ఆటగాళ్లు రఫెల్‌ నాదల్, కార్లోస్‌ అల్కరాస్‌లను టెన్నిస్‌ కోర్టులో ఒకేవైపు చూడబోతున్నాం. ఈ స్పెయిన్‌ క్రీడాకారులు పారిస్‌ ఒలింపిక్స్‌లో జంటగా బరిలోకి దిగుతున్నారు. 38 ఏళ్ల నాదల్‌.. 21 ఏళ్ల అల్కరాస్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో పోటీ పడనున్నాడు. అల్కరాస్‌ ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన సంగతి తెలిసిందే. 2008 ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ స్వర్ణం సాధించిన రఫా.. 2016 క్రీడల్లో మార్క్‌ లోపెజ్‌తో కలిసి డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు.


ఐపీఎల్‌ జీ రూ.1.34 లక్షల కోట్లు 

దిల్లీ: ఐపీఎల్‌ విలువ అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది. 2024లో లీగ్‌ విలువ 6.5 శాతం పెరిగి సుమారు రూ.1,34,858 కోట్లకు చేరిందని అమెరికా పెట్టుబడి బ్యాంకు హాలిహన్‌ లోకీ నివేదిక స్పష్టం చేసింది. అంతే కాకుండా బ్రాండ్‌ విలువ ఏడాదికి 6.3 శాతం పెరిగి దాదాపు రూ.28 వేల కోట్లకు చేరిందని ఆ నివేదిక తెలిపింది. 2024 నుంచి 2028 వరకు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం టాటా సంస్థ రూ.2500 కోట్లు చెల్లించడం ఐపీఎల్‌ విలువ పెరగడంలో దోహదపడిందని నివేదిక పేర్కొంది. ఒలింపిక్స్, ఫిఫా ప్రపంచకప్, క్రికెట్‌ ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలు కాకుండా లక్ష కోట్ల రూపాయల విలువను అందుకున్నది ఐపీఎల్‌ మాత్రమే అని వెల్లడించింది. ఐపీఎల్‌ ఆదరణ కేవలం భారత ఉప ఖండానికే పరిమితమవలేదని చెప్పింది. ఫ్రాంఛైజీల విలువ పరంగా చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.


స్టేడియం ఇక కనిపించదు 

నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్‌ కోసం కేవలం 100 రోజుల్లోనే ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్‌లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. ఇక ఈ స్టేడియం కనిపించదు. అవును.. కేవలం ప్రపంచకప్‌ కోసం తాత్కాలిక స్టాండ్స్‌లతో రూపొందించిన ఈ స్టేడియాన్ని తొలగించనున్నారు. అమెరికాతో భారత్‌ మ్యాచే ఇక్కడ చివరిది. అస్థిర బౌన్స్‌కు సహకరించిన ఈ మందకొడి పిచ్‌పై జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. అత్యంత ఆసక్తి రేపిన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా స్వల్ప స్కోర్ల పోరుగానే ముగిసింది. కానీ ఉత్కంఠకు మాత్రం కొదవలేకుండా పోయింది. ఈ స్టేడియంలో 8 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఐర్లాండ్‌పై కెనడా చేసిన 137 పరుగులే ఇక్కడ అత్యధిక స్కోరు. అత్యల్పంగా దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడ ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో టీమ్‌ఇండియా మ్యాచ్‌లాడింది. భారత్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌ను శనివారం కెనడాతో లాడర్‌హిల్‌లో ఆడుతుంది. ఆ తర్వాత సూపర్‌- 8 మ్యాచ్‌ల కోసం టోర్నీ ఉమ్మడి ఆతిథ్య దేశమైన వెస్టిండీస్‌కు వెళ్తుంది. 


భారత జట్ల శుభారంభం 

దలియన్‌ (చైనా): ఆసియా టీమ్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు శుభారంభం చేశాయి. పురుషుల జట్టు తొలి రౌండ్లో 2-1తో కువైట్‌ను ఓడించింది. వేలవన్‌ 3-0తో లియును ఓడించగా.. రాహుల్‌ 1-4తో అల్కన్ఫర్‌ చేతిలో ఓడాడు. సూరజ్‌ 3-0తో బాదర్‌పై విజయం సాధించి జట్టును గెలిపించాడు. రతిక, పూజ, విధిలతో కూడిన మహిళల జట్టు తొలి రౌండ్లో 2-1తో మకావుపై, 3-0తో మంగోలియాపై నెగ్గాయి.


శార్దూల్‌ కాలికి శస్త్రచికిత్స 

లండన్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ పాదానికి బుధవారం లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. అతడు కనీసం మూడు నెలలు ఆటకు దూరం కానున్నాడు. 32 ఏళ్ల శార్దూల్‌ తనకు శస్త్రచికిత్స జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శార్దూల్‌.. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో 9.75 ఎకానమీతో అయిదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 


పొట్టి కప్పు ఫార్మాట్‌పై హేజిల్‌వుడ్‌ అసంతృప్తి 

నార్త్‌ సౌండ్‌: టీ20 ప్రపంచకప్‌ ఫార్మాట్‌పై ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ అసంతృప్తి వ్యక్తంజేశాడు. గ్రూపు దశలో నెట్‌ రన్‌రేట్‌ సూపర్‌ 8లో కొనసాగకపోవడం వింతగా ఉందని తెలిపాడు. గ్రూపు-బిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఆసీస్‌.. సూపర్‌ 8 బెర్తు సొంతం చేసుకుంది. తర్వాతి దశలో నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి సెమీఫైనల్‌ బెర్తుల కోసం పోటీపడతాయి.  ‘‘ఫార్మాట్‌ కాస్త వింతగా అనిపిస్తోంది. నెట్‌ రన్‌రేట్‌ చివరి వరకు కొనసాగదు. ఇలాంటి ఫార్మాట్‌లో నేనాడిన మొదటి టీ20 ప్రపంచకప్‌ ఇదే. ఈ విధంగా జరుగుతున్న తొలి పొట్టి కప్పు కూడా. గ్రూపు దశలో అజేయంగా నిలిచి మంచి రన్‌రేట్‌ కలిగి ఉన్నా.. సూపర్‌ 8లో లెక్కలోకి రాకపోవడం వింతగా ఉంది’’ అని హేజిల్‌వుడ్‌ పేర్కొన్నాడు.


ప్రణయ్‌ శుభారంభం 

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్లో భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో అతడు 21-10, 23-21తో యిగోర్‌ కోయెలో (బ్రెజిల్‌)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ 21-10, 21-10తో రికీ తాంగ్‌ (ఆస్ట్రేలియా)పై, రఘు 21-6, 21-8తో చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై, కిరణ్‌ జార్జ్‌ 21-17, 21-10తో షెంగ్‌ (కెనడా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మొదటి రౌండ్లో ఆమె 21-14, 21-11తో పోలినా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. మాళవిక 21-10, 21-8తో కెయూరపై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌ రెడ్డి, సిక్కి రెడ్డి జంట 21-17, 21-19తో వాంగ్‌ తీన్‌ సి-లిమ్‌ చూ సీన్‌ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. కోన తరుణ్, శ్రీకృష్ణ ప్రియ జంట పరాజయంపాలైంది.


టిట్మస్‌ ప్రపంచ రికార్డు 

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియన్‌ ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో ఆరియార్న్‌ టిట్మస్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ రేసును టిట్మస్‌ ఒక నిమిషం 52.23 సెకన్లలో ముగించి కొత్త రికార్డు నెలకొల్పింది. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మోలీ ఓకలాఘన్స్‌ (1ని 52.85సె- ఆస్ట్రేలియా) పేరిట నమోదైన రికార్డును తిరగరాసింది. బుధవారం రేసులో ఓకలాఘన్స్‌ (1ని 52..48సె) రెండో స్థానంలో నిలిచింది. 200 మీటర్లు, 400 మీటర్లు ఫ్రీస్టైల్‌ విభాగాల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌గా నిలిచిన టిట్మస్‌ పేరిటే ఈ రెండు విభాగాల ప్రపంచ రికార్డులు ఉండటం విశేషం. కోచ్‌ డీన్‌ బాక్సాల్‌ దగ్గర టిట్మస్, ఓకలాఘన్స్‌ శిక్షణ తీసుకుంటున్నారు.


ఆ స్టేడియంలో మార్పులు 

నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్‌ కోసం కేవలం 100 రోజుల్లోనే ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్‌లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. కేవలం ప్రపంచకప్‌ కోసం తాత్కాలిక స్టాండ్స్‌లతో రూపొందించిన ఈ స్టేడియంలో మార్పులు చేయనున్నారు. అమెరికాతో భారత్‌ మ్యాచే ఇక్కడ చివరిది. దీని తర్వాత కొన్ని మార్పులు చేసి స్థానిక క్రికెట్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఇక్కడ ఆడుకునే సౌకర్యం కల్పించనున్నారు. అస్థిర బౌన్స్‌కు సహకరించిన ఈ మందకొడి పిచ్‌పై జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. అత్యంత ఆసక్తి రేపిన భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కూడా స్వల్ప స్కోర్ల పోరుగానే ముగిసింది. కానీ ఉత్కంఠకు మాత్రం కొదవలేకుండా పోయింది. ఈ స్టేడియంలో 8 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఐర్లాండ్‌పై కెనడా చేసిన 137 పరుగులే ఇక్కడ అత్యధిక స్కోరు. అత్యల్పంగా దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడ ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో టీమ్‌ఇండియా మ్యాచ్‌లాడింది. భారత్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌ను శనివారం కెనడాతో లాడర్‌హిల్‌లో ఆడుతుంది. ఆ తర్వాత సూపర్‌- 8 మ్యాచ్‌ల కోసం టోర్నీ ఉమ్మడి ఆతిథ్య దేశమైన వెస్టిండీస్‌కు వెళ్తుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని