వివాదాస్పద గోల్‌పై భారత్‌ ఫిర్యాదు

భారత్, ఖతార్‌ మధ్య ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ పోరుపై మ్యాచ్‌ కమిషనర్‌ హామెద్‌ మొమెని (ఇరాన్‌)కి అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఫిర్యాదు చేసింది.

Published : 13 Jun 2024 03:05 IST

దోహా: భారత్, ఖతార్‌ మధ్య ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ పోరుపై మ్యాచ్‌ కమిషనర్‌ హామెద్‌ మొమెని (ఇరాన్‌)కి అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది. ‘‘మ్యాచ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును కోరుతున్నాం’’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ అధికారి తెలిపాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రిఫరీ కిమ్‌ వూ సుంగ్‌ (దక్షిణ కొరియా) తప్పిదంతో భారత పురుషుల జట్టుకు క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశం త్రుటిలో చేజారింది. ఈ వివాదాస్పద మ్యాచ్‌లో భారత్‌ 1-2తో ఖతార్‌ చేతిలో ఓడింది. 37వ నిమిషంలో లాలియన్‌జులా చాంగ్టే గోల్‌ చేసి భారత్‌ ఖాతా తెరిచాడు. ప్రథమార్ధం ముగిసేసరికి భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. 73వ నిమిషంలో యూసెఫ్‌ ఐమెన్‌ గోల్‌ రాబట్టి 1-1తో స్కోరును సమం చేశాడు. అయితే గీత దాటిన బంతిని ఖతార్‌ ఆటగాడు మైదానంలోకి లాగి.. ఆ తర్వాత గోల్‌ చేసినట్లు రిప్లేల్లో స్పష్టంగా కనిపించింది. రిఫరీ మాత్రం గోల్‌ సక్రమమేనని తేల్చేశాడు. భారత ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పట్టించుకోలేదు. 85వ నిమిషంలో అహ్మద్‌ అల్‌ రావి గోల్‌ సాధించడంతో 2-1తో ఖతార్‌ విజయం సాధించింది. ఈ వ్యవహారంపై ఏఐఎఫ్‌ఎఫ్‌ నిరసన వ్యక్తంజేసింది. కువైట్, అఫ్గానిస్థాన్‌ మధ్య మరో మ్యాచ్‌ డ్రా అయిన నేపథ్యంలో.. ఖతార్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించినా భారత్‌ ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌లో తర్వాతి దశకు చేరుకునేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని