ఒలింపిక్‌ కోటా బెర్తు దేశానిది: బింద్రా

ఒలింపిక్స్‌ కోటా బెర్తు దేశానికి చెందినదని.. క్రీడాకారులది కాదని భారత దిగ్గజ షూటర్‌ అభినవ్‌ బింద్రా అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా బెర్తు లభించింది.

Published : 14 Jun 2024 03:34 IST

ముంబయి: ఒలింపిక్స్‌ కోటా బెర్తు దేశానికి చెందినదని.. క్రీడాకారులది కాదని భారత దిగ్గజ షూటర్‌ అభినవ్‌ బింద్రా అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా బెర్తు లభించింది. అయితే భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) నిర్వహించిన సెలెక్షన్‌ ట్రయల్స్‌లో సందీప్‌ సింగ్, అర్జున్‌ బబుతా తర్వాతి స్థానం సాధించిన రుద్రాంక్ష్కు 15 మంది సభ్యుల భారత జట్టులో చోటు దక్కలేదు. ఒలింపిక్స్‌ నిబంధనల ప్రకారం ఒక విభాగంలో ఒక్కో దేశం నుంచి ఇద్దరు టాప్‌ షూటర్లు మాత్రమే పాల్గొనవచ్చు. ‘‘ఇది నిర్ణయం కాదు. ఎంపిక ప్రక్రియ. జట్టు ఎంపికకు ఒక విధానం ఉంది. దాన్నే అనుసరించారు. పద్ధతి పాటించకపోతే మీరే ప్రశ్నిస్తారు. కాబట్టి న్యాయమైన ప్రక్రియనే అనుసరించారు. భారత్‌ ఒక్కటే కాదు చాలా దేశాలు ఇదే విధానాన్ని పాటిస్తాయి. కోటా బెర్తు అథ్లెట్‌ది కాదు.. దేశానిది’’ అని బింద్రా పేర్కొన్నాడు.


కుల్‌దీప్‌కు ప్రాధాన్యమివ్వాలి: చావ్లా 

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 దశలో మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ భారత జట్టు ప్రాధాన్య బౌలర్‌గా ఉండాలని మాజీ ఆటగాడు పియూష్‌ చావ్లా అన్నాడు. న్యూయార్క్‌లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్‌.. కరీబియన్‌లో సూపర్‌ 8 మ్యాచ్‌లు ఆడనుంది. ‘‘న్యూయార్క్‌లో పిచ్‌ క్లిష్టంగా ఉంది. అలాంటి పిచ్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌.. మున్ముందు సత్తాచాటేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్‌లో స్పిన్నర్ల అవసరం అంతగా లేదు. అయితే వెస్టిండీస్‌లో సూపర్‌ 8 దశలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారు. ఒక్కడే స్పిన్నర్‌ ఆడాల్సొచ్చినప్పుడు కుల్‌దీప్‌కే మొదటి ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నా. గత ఏడాదిన్నరలో అతను అద్భుతంగా రాణించాడు. అక్షర్‌ పటేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో పనికొస్తారు. కాబట్టి కుల్‌దీప్‌కు అవకాశం లభిస్తుందని అనుకుంటున్నా’’ అని చావ్లా తెలిపాడు.


బోపన్న.. బాలాజీతోనే 

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో బరిలో దిగే భాగస్వామి అధికారికంగా ఖరారయ్యాడు. బోపన్న కోరుకున్న శ్రీరామ్‌ బాలాజీనే అతడితో పాటు పారిస్‌లో ఆడతాడని అఖిల భారత టెన్నిస్‌ సంఘం గురువారం ప్రకటించింది. శ్రీరామ్‌తో ఆడే ఉద్దేశం ఉందని బోపన్న ఐటాకు వెల్లడించగా.. సెలక్షన్‌ కమిటీ అతడి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. యుకి బాంబ్రి కూడా పోటీలో నిలిచినా.. అతడితో పోలిస్తే కోర్టులో వేగంగా కదిలే బాలాజీ వైపు కమిటీ మొగ్గు చూపింది. 44 ఏళ్ల బోపన్న కెరీర్‌లో ఆఖరిసారిగా ఒలింపిక్స్‌ పతకం కోసం ప్రయత్నించబోతున్నాడు. ‘‘పారిస్‌ ఒలింపిక్స్‌లో బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ కలిసి ఆడబోతున్నారు. వారి ప్రయాణం భారత టెన్నిస్‌లో మైలురాయిగా మిగలాలని ఆశిస్తున్నాం’’ అని ఐటా పేర్కొంది. 


టీమ్‌ కోటాలపై భారత్‌ ఆర్చర్ల గురి 

ఆంటల్యా: టీమ్‌ కోటా స్థానాలను సాధించడమే లక్ష్యంగా శుక్రవారం మొదలయ్యే చివరి ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఆర్చర్లు బరిలో దిగుతున్నారు. ఇప్పటిదాకా సింగిల్స్‌లో విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ మాత్రమే పారిస్‌ కోటా దక్కించుకున్నాడు. భారత పురుషుల జట్టు (ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌)... మహిళల బృందం (దీపిక కుమారి, భజన్‌ కౌర్, అంకిత బాకత్‌) క్వాలిఫయర్స్‌లో పోటీపడుతున్నాయి. మహిళల్లో బరిలో ఉన్న 39 దేశాల్లో సెమీస్‌ చేరిన నాలుగు జట్లకు కోటాలు లభించనున్నాయి. పురుషుల్లో 46 దేశాలు పోటీలో ఉండగా.. 3 కోటాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 


భారత జట్టు ముందంజ 

డాలియన్‌ (చైనా): ఆసియా టీమ్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం భారత్‌ 3-0తో మంగోలియాపై విజయం సాధించింది. సూరజ్‌ కుమార్‌ చంద్‌ 11-3, 11-5, 11-1తో యెసున్‌పై, ఓం సేమ్వాల్‌ 11-2, 11-3, 11-2తో బోలోర్‌పై, రాహుల్‌ బైఠా 11-4, 11-5, 11-8తో అమర్తుషిన్‌పై గెలుపొందారు. పూల్‌-డి నుంచి జపాన్‌ ఇప్పటికే క్వార్టర్స్‌ చేరుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడుతుంది. మహిళల విభాగంలో 3-0తో తైనీస్‌ తైపీపై నెగ్గిన భారత్‌.. 0-3తో మలేసియా చేతిలో ఓడింది. సెమీఫైనల్‌ బెర్తు దక్కాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్‌ పోటీపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని