గుర్తుకొస్తున్నాయి..

ముంబయి ఆటగాళ్లు రోహిత్‌శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లను చాన్నాళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉందని అమెరికా మీడియం పేసర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ అన్నాడు. ముఖ్యంగా సూర్యతో కలిసి నేత్రావల్కర్‌ ముంబయికి ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.

Published : 14 Jun 2024 03:39 IST

న్యూయార్క్‌: ముంబయి ఆటగాళ్లు రోహిత్‌శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లను చాన్నాళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉందని అమెరికా మీడియం పేసర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ అన్నాడు. ముఖ్యంగా సూర్యతో కలిసి నేత్రావల్కర్‌ ముంబయికి ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. భారత్‌-అమెరికా మ్యాచ్‌ ముగిశాక తన పాత సహచరులతో సౌరభ్‌ ముచ్చటించాడు. ‘‘దాదాపు పదేళ్ల తర్వాత రోహిత్, సూర్యలను కలిశాను. చిన్నప్పటి నుంచి కలిసే ఆడాం. అండర్‌-16, అండర్‌-17 నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాం. అప్పటి సరదా సంభాషణలను, డ్రెస్సింగ్‌ రూమ్‌ విషయాలను మాట్లాడుకున్నాం. రోహిత్‌ మా సీనియర్‌. విరాట్‌తో ఎక్కువ ఆడలేదు. భారత్‌-అమెరికా మ్యాచ్‌ తర్వాత అతడు మమ్మల్ని అభినందించాడు’’ అని నేత్రావల్కర్‌ పేర్కొన్నాడు. కోహ్లిని ఓ ప్రత్యేక బంతితో ఔట్‌ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ పేసర్‌ తెలిపాడు. 32 ఏళ్ల నేత్రావల్కర్‌.. 2010లో భారత్‌ తరఫున అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఉద్యోగం చేస్తూనే ఆటను కూడా కొనసాగించి అమెరికా జట్టులోకి వచ్చాడు. 

అతడి ఇంటర్వ్యూ కోసం: భారత్‌-అమెరికా మ్యాచ్‌ ముగిసిన తర్వాత అమెరికా స్టార్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఇంటర్వ్యూ కోసం విలేకరులు ఆసక్తి చూపించారు. ఈ మ్యాచ్‌లో గొప్పగా బౌలింగ్‌ చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సమావేశాన్ని వదిలి పది మందికిపైగా రిపోర్టర్లు నేత్రవాల్కర్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించడం విశేషం. ఈ టోర్నీలో అదరగొట్టిన నేత్రావల్కర్‌ అమెరికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భారత్‌తో మ్యాచ్‌లో స్టార్‌ ఆటగాళ్లు కోహ్లి, రోహిత్‌ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని