కిక్కిచ్చే కిక్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. ఫిఫా ప్రపంచకప్‌ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్‌ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది.

Published : 14 Jun 2024 03:43 IST

నేటి నుంచే యూరో కప్‌ ఫుట్‌బాల్‌
బరిలో 24 జట్లు

మ్యూనిచ్‌: ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. ఫిఫా ప్రపంచకప్‌ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్‌ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది. తొలి మ్యాచ్‌లో గ్రూప్‌-ఎలో ఆతిథ్య జర్మనీ.. స్కాట్లాండ్‌ను ఢీకొననుంది. ఐరోపా ఖండం ఛాంపియన్‌గా నిలిచేందుకు 24 అత్యుత్తమ జట్లు సమరానికి సై అంటున్నాయి. జార్జియా తొలిసారి ఈ టోర్నీలో ఆడుతోంది. ఈ 17వ యూరో కప్‌కు జర్మనీ ఆతిథ్యమిస్తోంది. జూన్‌ 14 నుంచి జులై 14 వరకు 10 నగరాల్లో కలిపి మొత్తం 51 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 24 జట్లు 6 గ్రూప్‌లుగా విడిపోయి గ్రూప్‌ దశలో తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు ఇతర దేశాలతో ఒక్కో మ్యాచ్‌ చొప్పున ఆడుతుంది. ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే మొత్తం 12 జట్లతో పాటు.. అన్ని గ్రూప్‌ల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన 4 అత్యుత్తమ జట్లు ప్రిక్వార్టర్స్‌ (రౌండ్‌ 16)కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌ ఉంటాయి. 2000 తర్వాత రష్యా లేకుండా తొలిసారి ఈ టోర్నీ జరుగనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అర్హత రౌండ్లో పోటీపడకుండా ఆ దేశంపై ఐరోపా ఫుట్‌బాల్‌ సంఘాల కూటమి (యూఈఎఫ్‌ఏ) వేటు వేసిన సంగతి తెలిసిందే. అర్హత రౌండ్లో మొత్తం 53 దేశాలు తలపడ్డాయి. చివరగా కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టోర్నీని 2021లో నిర్వహించారు. అప్పుడు ఇటలీ విజేతగా నిలిచింది. ఆ దేశానికి అది రెండో టైటిల్‌. ఇటు యూరో కప్‌ జరుగుతుండగానే అటు అమెరికాలో మరో ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్‌ టోర్నీ కోపా అమెరికాకు తెరలేవనుంది. ఈ నెల 20న ఈ టోర్నీ కూడా ఆరంభమవుతుండటంతో ప్రపంచమంతా ఇక ఫుట్‌బాల్‌ సందడిలో మునిగిపోయే అవకాశముంది. 

ఏ గ్రూప్‌లో ఎవరు?

గ్రూప్‌- ఎ: జర్మనీ, స్కాట్లాండ్, హంగేరీ, స్విట్జర్లాండ్‌
గ్రూప్‌- బి: స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా
గ్రూప్‌- సి: స్లోవేనియా, డెన్మార్క్, సెర్బియా, ఇంగ్లాండ్‌
గ్రూప్‌- డి: పోలాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌
గ్రూప్‌- ఈ: బెల్జియం, స్లోవేకియా, రొమేనియా, ఉక్రెయిన్‌
గ్రూప్‌- ఎఫ్‌: తుర్కియే, జార్జియా, పోర్చుగల్, చెక్‌ రిపబ్లిక్‌ 


1960లో మొదలైన యూరో కప్‌లో ఇప్పటివరకూ జర్మనీ, స్పెయిన్‌ అత్యధికంగా చెరో మూడు సార్లు విజేతలుగా నిలిచాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని