మేం అలా ఎప్పటికీ చేయం

టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంగ్లాండ్‌ను బయటకు పంపేలా తాము నెట్‌రన్‌రేట్‌ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 16 Jun 2024 13:59 IST

గ్రోస్‌ ఐలీ (సెయింట్‌ లూసియా): టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంగ్లాండ్‌ను బయటకు పంపేలా తాము నెట్‌రన్‌రేట్‌ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. అలా ఎప్పటికీ చేయమని అన్నాడు. ఆదివారం ఆసీస్‌తో తలపడే స్కాట్లాండ్‌ ఖాతాలో ప్రస్తుతం 5 పాయింట్లున్నాయి. నమీబియాపై ఇంగ్లాండ్‌ గెలిస్తే.. స్కాట్లాండ్‌తో సమమవుతుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌ కంటే ఇంగ్లాండ్‌ రన్‌రేటే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ను టోర్నీ నుంచి బయటకు పంపించే అవకాశాన్ని తమ జట్టు వదులుకోదని ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్పందించిన కమిన్స్‌ అలాంటిదేమీ జరగదని అన్నాడు. హేజిల్‌వుడ్‌ సరదాగా చేసిన వ్యాఖ్యలను మరో విధంగా చూస్తున్నారని చెప్పాడు. ‘‘మైదానంలో దిగిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తాం. అలా చేయకపోతే అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమే అవుతుంది. నెట్‌రన్‌రేట్‌ను తారుమారు చేయడం గురించి అసలు ఆలోచించనే లేదు. హేజిల్‌వుడ్‌తో నేను మాట్లాడా. అతను సరదాగా అన్న మాటలను మరో రకంగా తీసుకున్నారు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ గెలవాలనే చూస్తాం. మా ఆటతీరుపై నెట్‌ రన్‌రేట్‌ ఏ విధంగానూ ప్రభావం చూపదు’’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు. 


సెహ్వాగ్‌ ఎవరు? 

షకిబ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

దిల్లీ: ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిల్‌ అల్‌ హసన్‌.. మరోసారి తన దుందుడుకుతనాన్ని చాటుకున్నాడు. టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఎవరో తెలియదన్నట్లు మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై అజేయంగా 64 పరుగులు చేసిన షకిబ్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అంతకంటే ముందు రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో షకిబ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించి పక్కకు తప్పుకోవాలని ఓ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఇదే విషయమై నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ అనంతరం షకిబ్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. ‘‘మీ ప్రదర్శన గురించి చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శిస్తున్నారు’’ అని ఆ విలేకరి అడిగితే.. ‘‘ఎవరు’’ అని షకిబ్‌ తిరిగి ప్రశ్నించాడు. దీంతో సెహ్వాగ్‌ ఎవరో తెలియదా అంటూ షకిబ్‌పై భారత అభిమానులు మండిపడుతున్నారు.


క్వార్టర్స్‌లో భారత్‌ ఓటమి 

డాలియన్‌ (చైనా): ఆసియా టీమ్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 1-2తో పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో రాహుల్‌ భాటియా 11-3, 11-4, 9-11తో అసిమ్‌ఖాన్‌ చేతిలో ఓడగా.. రెండో సింగిల్స్‌లో సెంథిల్‌కుమార్‌ 11-5, 11-7, 11-6తో నసీర్‌పై నెగ్గి లెక్క సరిచేశాడు. కానీ నిర్ణయాత్మక మూడో సింగిల్స్‌లో సూరజ్‌కుమార్‌ 8-11, 8-11, 6-11తో నూర్‌ జమాన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల విభాగంలోనూ భారత్‌కు ఓటమి ఎదురైంది. నాకౌట్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన గ్రూప్‌-ఎ చివరి మ్యాచ్‌లో భారత్‌ 0-3తో దక్షిణ కొరియా చేతిలో చిత్తయింది. పూజ 5-11, 5-11, 8-11తో హాయెంగ్‌ చేతిలో.. రతిక 4-11, 12-10, 7-11, 6-11తో మింగ్‌ చేతిలో ఓడారు. మరో సింగిల్స్‌లో సునీత 12-10, 8-10, 14-12, 7-11, 7-11తో చెవాన్‌ సాంగ్‌కు తలొంచింది. 


గిల్, అవేష్‌ స్వదేశానికి! 

ఫోర్ట్‌ లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రిజర్వ్‌ ఆటగాళ్లు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్, పేసర్‌ అవేష్‌ఖాన్‌ జట్టు నుంచి విడుదల కానున్నారు. శనివారం కెనడాతో చివరి గ్రూపు మ్యాచ్‌ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్‌ వీరిద్దరిని స్వదేశానికి పంపనుంది. సూపర్‌ 8 దశలో నలుగురు స్టాండ్‌ బై ఆటగాళ్లు అవసరం లేదని భావిస్తున్న జట్టు మేనేజ్‌మెంట్‌.. రింకూ సింగ్, ఖలీల్‌ అహ్మద్‌లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. ‘‘అమెరికాలో గ్రూపు దశ వరకే గిల్, అవేష్‌ ఉండాలని ముందుగానే నిర్ణయించాం. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ తర్వాత వాళ్లిద్దరినీ విడుదల చేయనున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల్లో ఎవరైనా గాయపడితే 15 మంది సభ్యుల జట్టులోని ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌తో ఆ లోటును భర్తీ చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.


ఇక ర్యాంకింగ్‌ మీదే ఆశ 

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌లో భారత ఆర్చర్ల ఓటమి

అంటాల్య (టర్కీ): ఒలింపిక్‌ చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత రికర్వ్‌ మహిళల జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్‌ఫైనల్లో అయిదో సీడ్‌ భారత్‌ 3-5 (51-51, 55-52, 53-54, 52-54)తో 18వ ర్యాంకర్‌ ఉక్రెయిన్‌ చేతిలో పరాజయం చవిచూసింది.  ఈ టోర్నీలో విఫలమైన దీపిక కుమారి, భజన్‌ కౌర్, అంకిత భకత్‌లతో కూడిన భారత బృందం.. పారిస్‌ ఒలింపిక్‌ బెర్తు కోసం ర్యాంకింగ్‌పై ఆధారపడనుంది. క్వాలిఫయర్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకునే నాలుగు జట్లకు ఒలింపిక్‌ కోటా బెర్తులు లభిస్తాయి. అయితే ఇప్పటికీ భారత జట్టుకు పారిస్‌ బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం క్వాలిఫయర్స్‌లో అర్హత సాధించని అత్యుత్తమ ర్యాంకింగ్‌ కలిగిన రెండు జట్లకు ఒలింపిక్స్‌ బెర్తులు లభిస్తాయి. ప్రస్తుతం భారత్‌ 8వ స్థానంలో ఉండగా.. మెరుగైన ర్యాంకింగ్‌ కలిగిన దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, మెక్సికో, అమెరికా ఇప్పటికే పారిస్‌ క్రీడలకు అర్హత సాధించాయి. ప్రపంచ రెండో ర్యాంకర్‌ చైనా, చైనీస్‌ తైపీ (7వ ర్యాంకర్‌) క్వాలిఫయర్స్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లకు పారిస్‌ బెర్తులకు మధ్య దూరం ఒక్క విజయమే. చైనా, చైనీస్‌ తైపీ ముందంజ వేసే అవకాశం ఉండటంతో ర్యాంకింగ్‌ ప్రకారం భారత్‌కు పారిస్‌ బెర్తు దక్కొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని