అఫ్గాన్‌ అదరహో..

ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్‌ చేరే రికార్డున్న న్యూజిలాండ్‌కు షాక్‌. టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు తొలి రౌండ్‌ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది.

Published : 15 Jun 2024 02:49 IST

పాపువా న్యూగినీపై విజయంతో ముందంజ

టరౌబా: ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్‌ చేరే రికార్డున్న న్యూజిలాండ్‌కు షాక్‌. టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు తొలి రౌండ్‌ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. గ్రూప్‌-సిలో ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో వెస్టిండీస్‌ సూపర్‌-8కు చేరగా.. అఫ్గాన్‌ కూడా వరుసగా మూడో విజయంతో ముందంజ వేయడంతో కివీస్‌ (2 మ్యాచ్‌ల్లో 2 ఓటములు)కు ద్వారాలు మూసుకుపోయాయి. తన మూడో మ్యాచ్‌లో అఫ్గాన్‌ 7 వికెట్ల తేడాతో పాపువా న్యూగినీపై విజయం సాధించింది. మొదట పేసర్లు ఫారూఖీ (3/16), నవీనుల్‌ హక్‌ (2/4) విజృంభించడంతో పాపువా 19.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. కిప్లిన్‌ డోరిగా (27) టాప్‌స్కోరర్‌. స్వల్ప ఛేదనలో కాస్త తడబడినా అఫ్గాన్‌ 15.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుల్బాదిన్‌ నైబ్‌ (49 నాటౌట్‌; 36 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రౌండ్‌కు వెళ్లడం అఫ్గాన్‌కు ఇదే తొలిసారి. జూన్‌ 20న తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌తో అఫ్గాన్‌ తలపడనుంది. 

బంతితో అదరగొట్టి..: అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మొదట పాపువా న్యూగినీ జట్టు అఫ్గాన్‌ పేసర్ల ధాటికి నిలువలేకపోయింది. అటు ఫారూఖీ.. ఇటు నవీనుల్‌ విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే లోపే ఆ జట్టు సగం వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో చిక్కుకుంది. టోనీ (11), అసద్‌ (3), హిరిహిరి (1) స్వల్ప స్కోర్లకే ఔట్‌ కాగా.. లెగా, సెసె డకౌట్‌ అయ్యారు. ఈ దశలో డోరిగా.. చాద్‌ (9), అలెయ్‌ (13)తో కలిసి ఆదుకోవడంతో పాపువా 100కు చేరువగా స్కోరు చేయగలిగింది. అఫ్గాన్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (1/14) కూడా సత్తా చాటాడు. ఛేదనలో అఫ్గాన్‌ 2.5 ఓవర్లకు 22/2తో తడబడింది. గుర్బాజ్‌ (11), ఇబ్రహీం జద్రాన్‌ (0) త్వరగా పెవిలియన్‌ చేరారు. ఈ స్థితిలో నైబ్‌ నిలిచాడు. అజ్మతుల్లా (13), నబి (16 నాటౌట్‌)లతో భాగస్వామ్యాలు నెలకొల్పి అఫ్గాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్‌ 29 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 

పాపువా న్యూగినీ: 19.5 ఓవర్లలో 95 ఆలౌట్‌ (కిప్లిన్‌ డోరిగా 27, అలెయ్‌ 13, టోనీ 11, చాద్‌ 9; ఫారూఖీ 3/16, నవీనుల్‌ హక్‌ 2/4, నూర్‌ అహ్మద్‌ 1/14); అఫ్గానిస్థాన్‌: 15.1 ఓవర్లలో 101/3 (గుల్బాదిన్‌ నైబ్‌ 49 నాటౌట్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 13, నబి 16 నాటౌట్‌; అలెయ్‌ 1/26)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని