సంక్షిప్త వార్తలు(5)

జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్‌ అని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ప్రకటించాడు. కానీ కివీస్‌ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు.

Updated : 16 Jun 2024 05:07 IST

ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌: బౌల్ట్‌ 

తరౌబా: జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్‌ అని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ప్రకటించాడు. కానీ కివీస్‌ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు 2022లోనే న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్టును బౌల్ట్‌ వద్దనుకున్న సంగతి తెలిసిందే. ‘‘నా వరకైతే ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌. ఇప్పటికైతే ఇంతే చెప్పగలను. టోర్నీలో ఆశించిన ఆరంభం దక్కలేదు. ఈ ఓటములను తీసుకోవడం కష్టమే. కానీ ఎప్పుడైనా సరే దేశానికి ప్రాతినిథ్యం వహించడమే అత్యంత గర్వపడే సందర్భం. సూపర్‌- 8కు అర్హత సాధించలేకపోయాం. ఉత్తమ నైపుణ్యాలున్న ఆటగాళ్లు న్యూజిలాండ్‌ క్రికెట్లోకి రాబోతున్నారు’’ అని బౌల్ట్‌ చెప్పాడు.


భారత టీటీ జట్టుకు కాంస్యం 

దిల్లీ: బ్రిక్స్‌ క్రీడల్లో భారత మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్టు కాంస్యం సాధించింది. రష్యాలో జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం మౌమితా దత్తా, యశ్‌ని శివశంకర్, పోయ్‌మతి బైస్యాలతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 1-3తో చైనా చేతిలో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు టీటీ పురుషుల జట్టు అయిదో స్థానంతో ముగించింది. వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ (స్నేహిత్, అనిర్బన్‌ ఘోష్, జీత్‌చంద్ర) 3-1తో బహ్రెయిన్‌ను ఓడించింది.


రష్యా, బెలారస్‌ అథ్లెట్లకు అనుమతి 

లుసానె: తటస్థ జెండాతో పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే రష్యా, బెలారస్‌ అథ్లెట్ల తొలి జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ విడుదల చేసింది. అయిదు క్రీడల్లో వ్యక్తిగత విభాగాల్లో 14 మంది రష్యా.. 11 మంది బెలారస్‌ తరఫున బరిలో దిగేందుకు ఆమోదం తెలిపింది. సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో బరిలో దిగే అథ్లెట్ల విషయంలో ఐవోసీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. వివిధ క్రీడల్లో రష్యా, బెలారస్‌ పాస్‌పోర్టుతో క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో ఆడి కోటా స్థానాలు సాధించిన అథ్లెట్లు.. పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఐవోసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో రష్యా, బెలారస్‌ అథ్లెట్లను పారిస్‌ ఒలింపిక్స్‌లో టీమ్‌ స్పోర్ట్స్‌ ఆడకుండా ఐవోసీ నిషేధించింది. జులై 26న ఒలింపిక్స్‌ ఆరంభం కానున్నాయి. 


ఆర్చరీలో పురుషుల జట్టుకూ నిరాశే 

అంటాల్య: చివరి ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ ఆర్చరీ టోర్నీలో భారత పురుషుల రికర్వ్‌ జట్టుకూ నిరాశే ఎదురైంది. మహిళల బాటలోనే సాగిన పురుషుల జట్టు కూడా ఈ పోటీల్లో ఒలింపిక్‌ బెర్తు సాధించడంలో విఫలమైంది. దీంతో చివరి అవకాశంగా ర్యాంకింగ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. తరుణ్‌దీప్‌ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన టాప్‌ సీడ్‌ భారత్‌ శనివారం క్వార్టర్స్‌లో షూటాఫ్‌లో మెక్సికో చేతిలో ఓడింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ భారత జట్టు ఈ పోరును మెరుగ్గా మొదలెట్టింది. తొలి రెండు సెట్లను 57-56, 57-53తో గెలుచుకుని 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో సెట్‌ను డ్రా చేసుకున్నా భారత్‌ సెమీస్‌ చేరేదే. కానీ అనూహ్యంగా మన ఆర్చర్లు తడబడ్డారు. 55-56, 55-58తో తర్వాతి రెండు సెట్లను కోల్పోయారు.  స్కోరు 4-4తో సమమవడంతో షూటాఫ్‌ నిర్వహించారు. ఇందులోనూ రెండు జట్లు 26-26తో సమంగానే నిలిచాయి. కానీ లక్ష్యానికి దగ్గరగా మెక్సికో ఆర్చర్ల బాణాలు ఉండటంతో భారత్‌కు 4-5తో ఓటమి తప్పలేదు. శుక్రవారం అమ్మాయిల జట్టు ప్రిక్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 


ఫైనల్లో నగాల్‌ 

పెరూగియా: భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ పెరూగియా ఛాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నగాల్‌ 7-6 (7-2), 1-6, 6-2తో బెర్నార్డె జపాటా (స్పెయిన్‌)ను ఓడించాడు. లుసియానో బార్డెరీ (ఇటలీ)-డానియల్‌ ఆల్ట్‌మెర్‌ (జర్మనీ) మధ్య సెమీస్‌ విజేతతో నగాల్‌ టైటిల్‌ పోరులో తలపడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు