జర్మనీ ఘన బోణీ

యూరో కప్‌ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తుచేసింది.

Published : 16 Jun 2024 03:13 IST

యూరో కప్‌

మ్యూనిచ్‌: యూరో కప్‌ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తుచేసింది. మ్యాచ్‌లో జర్మనీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫ్లోరియన్‌ (10వ నిమిషంలో), ముసియాలా (19వ), హావర్జ్‌ (45+1వ), నిక్లస్‌ (68వ), ఎమ్రె కాన్‌ (90+3వ) తలో గోల్‌ కొట్టారు. స్కాట్లాండ్‌ ఖాతాలో చేరిన ఏకైక గోల్‌ కూడా జర్మనీ ఆటగాడు చేసిందే. 87వ నిమిషంలో ఆంటోనియో రుడిగర్‌ సెల్ఫ్‌ గోల్‌ చేశాడు. ప్రత్యర్థి ఆటగాడు కీరన్‌ తలతో కొట్టిన బంతి రుడిగర్‌ను తాకి గోల్‌పోస్టులో పడింది. ఈ మ్యాచ్‌లో జర్మనీ దూకుడు ముందు ప్రత్యర్థి నిలవలేకపోయింది. స్కాట్లాండ్‌ రక్షణశ్రేణి ఛేదిస్తూ జర్మనీ గోల్స్‌ వేటలో సాగిపోయింది. 44వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకు స్కాట్లాండ్‌ ప్లేయర్‌ పోర్టియస్‌కు రిఫరీ రెడ్‌ కార్డు చూపించడంతో పాటు జర్మనీకి పెనాల్టీ ఇచ్చాడు. దీంతో స్కాట్లాండ్‌ 10 మందితోనే మిగతా మ్యాచ్‌ ఆడింది. ఆ పెనాల్టీని హావర్జ్‌ సద్వినియోగం చేశాడు. 21 ఏళ్ల ఫ్లోరియన్, ముసియాలా యూరో కప్‌ చరిత్రలో జర్మనీ తరపున గోల్స్‌ చేసిన అతి పిన్న వయస్సు ఆటగాళ్లుగా నిలిచారు. ఈ టోర్నీలో జర్మనీకి ఇదే అతి పెద్ద విజయం. 

స్విట్జర్లాండ్‌ విజయం: యూరో కప్‌లో స్విట్జర్లాండ్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌  (గ్రూప్‌-ఎ)లో 3-1తో హంగేరిపై విజయం సాధించింది. స్విస్‌ జట్టు తరఫున దువా (12వ), ఏబిషర్‌ (45వ), ఎంబోలో (90+3) తలో గోల్‌ కొట్టారు. హంగేరి తరఫున నమోదైన ఏకైక గోల్‌ను వర్గా (66వ) సాధించాడు. గ్రూప్‌-బిలో స్పెయిన్‌ 3-0తో క్రొయేషియాను ఓడించింది.

యూరో కప్‌లో ఈనాడు

పోలెండ్‌ × నెదర్లాండ్స్‌ (సాయంత్రం 6:30)

స్లోవేనియా × డెన్మార్క్‌ (రాత్రి 9:30)

సెర్బియా × ఇంగ్లాండ్‌ (రాత్రి 12:30)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని