కివీస్‌ తొలి గెలుపు

ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8కు దూరమైన న్యూజిలాండ్‌ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది.

Published : 16 Jun 2024 03:15 IST

ఉగాండాపై ఘన విజయం 

టరౌబా: ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8కు దూరమైన న్యూజిలాండ్‌ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టిమ్‌ సౌథీ (3/4), బౌల్ట్‌ (2/7) విజృంభించడంతో ఉగాండా 18.4 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలింది. కెన్నిత్‌ (11) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 5.2 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి ఛేదించింది. కాన్వే (22 నాటౌట్‌; 15 బంతుల్లో 4×4) రాణించాడు. 

సౌథీ, బౌల్ట్‌ దెబ్బకు..: అంతకుముందు పేసర్లు సౌథీ, బౌల్ట్‌ దెబ్బకు ఉగాండా విలవిల్లాడింది. అయితే పతనాన్ని మొదలు పెట్టింది మాత్రం బౌల్టే. స్వింగ్‌కు సహకరిస్తున్న పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అతడు తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సిమోన్‌ (0), రాబిన్సన్‌ (0)లను అతడు పెవిలియన్‌ చేర్చాడు. మరోవైపు పదునైన బంతులతో విజృంభించిన సౌథీ.. రంజానీ (0)ను ఔట్‌ చేయడంతో పవర్‌ప్లే ఆఖరికి ఉగాండా 9/3తో కష్టాల్లో నిలిచింది. ఆ తర్వాతా ఆ జట్టు కోలుకోలేకపోయింది. సౌథీతో పాటు శాంట్నర్‌ (2/8), రచిన్‌ రవీంద్ర (2/9) విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఉగాండా.. 50లోపే ఆలౌటైంది. ఉగాండా ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో మూడే బౌండరీలు నమోదయ్యాయి. స్వల్ప ఛేదనలో ధాటిగా ఆడిన కివీస్‌ 88 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. అలెన్‌ (9) ఔటైనా.. కాన్వే, రచిన్‌ రవీంద్ర (1 నాటౌట్‌) పని పూర్తి చేశారు. 

ఉగాండా: 18.4 ఓవర్లలో 40 ఆలౌట్‌ (కెన్నిత్‌ 11, ఫ్రెడ్‌ 9; సౌథీ 3/4, బౌల్ట్‌ 2/7, శాంట్నర్‌ 2/8, రచిన్‌ రవీంద్ర 2/9, ఫెర్గూసన్‌ 1/9) 

న్యూజిలాండ్‌: 5.2 ఓవర్లలో 41/1 (డెవోన్‌ కాన్వే 22 నాటౌట్, అలెన్‌ 9; రియాజత్‌ 1/10)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని