సంక్షిప్తవార్తలు(4)

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన గ్రాండ్‌ ప్రి ఉస్తి నాద్‌ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది.

Published : 17 Jun 2024 03:31 IST

లవ్లీనాకు రజతం 

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన గ్రాండ్‌ ప్రి ఉస్తి నాద్‌ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. మహిళల 75 కేజీల విభాగం ఫైనల్లో లవ్లీనా 2-3 తేడాతో లి క్వియాన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. నిరుడు ఆసియా క్రీడల తుదిపోరులోనూ క్వియాన్‌ చేతిలోనే లవ్లీనా ఓడింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఈ టోర్నీ మంచి సన్నాహకంగా ఉపయోగపడిందని లవ్లీనా చెప్పింది. ‘‘ఈ టోర్నీలో పాల్గొనడం నాకో మంచి అనుభవం. ఒలింపిక్స్‌ సన్నాహకాల పరంగా చూసుకుంటే ఈ టోర్నీలో రజతం గెలవడం నాకెంతో ముఖ్యమైంది. దీంతో ఉపయోగం ఉంది’’ అని లవ్లీనా తెలిపింది. లవ్లీనా ప్రదర్శన పట్ల నూతన కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్‌ మాండవీయా ఆనందం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో 75 కేజీల విభాగంలో లవ్లీనాతో సహా నలుగురు బాక్సర్లే పోటీపడ్డారు. 


గ్రెచెన్‌ ప్రపంచ రికార్డు 

ఇండియానాపొలీస్‌: మహిళల స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. యుఎస్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌లో గ్రెచెన్‌ వాల్ష్‌ 100 మీటర్ల బటర్‌ఫ్లై సెమీస్‌లో 55.18 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 2016 రియో ఒలింపిక్స్‌లో సారా (స్వీడన్, 55.48 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. 21 ఏళ్ల వాల్ష్‌.. ఇంకా అమెరికా ఒలింపిక్‌ జట్టులోకి ఎంపిక కాలేదు. ఫైనల్లోనూ సత్తా చాటితే ఆమె పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. తుదిపోరులో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన టోరీ హస్కె, రెగాన్‌ స్మిత్, క్లైయిర్‌ కజాన్‌ నుంచి గ్రెచెన్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది. 


పాకిస్థాన్‌ కష్టంగా.. ఐర్లాండ్‌పై గెలుపు

లాడర్‌హిల్‌: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా లాంటి పసికూన చేతిలో ఓడి చివరికి సూపర్‌-8కు కూడా దూరమైన పాకిస్థాన్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ అతికష్టంగా గట్టెక్కింది. ఆదివారం గ్రూప్‌-ఏ పోరులో 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట ఇమాద్‌ వసీమ్‌ (3/8), షహీన్‌షా అఫ్రిది (3/22), మహ్మద్‌ ఆమిర్‌ (2/11) ధాటికి ఐర్లాండ్‌ 106/9కే పరిమితమైంది. గారెత్‌ (31), లిటిల్‌ (22 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో మెకార్టీ (3/15), కాంఫెర్‌ (2/24) దెబ్బకు పాక్‌ తడబడింది. 11 ఓవర్లకు 62/6తో ఓటమి ముప్పును ఎదుర్కొంది. కానీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌  (32 నాటౌట్‌), అబ్బాస్‌ (17)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. అబ్బాస్‌ ఔటైనా అఫ్రిది (13 నాటౌట్‌)తో కలిసి బాబర్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్‌ 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


కోహ్లి ఫామ్‌పై ఆందోళన లేదు 

లాడర్‌హిల్‌: విరాట్‌ కోహ్లి వైఫల్యాలపై ఆందోళన చెందట్లేదని భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. నెట్స్‌లో విరాట్‌ ఆకట్టుకుంటున్నాడని.. సూపర్‌-8కు ముందు పరుగుల దాహంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెప్పాడు. ‘‘కోహ్లి ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సి అవసరమే లేదు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన అనంతరం విరాట్‌ టీ20 ప్రపంచకప్‌కు వచ్చాడు. ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే ఔటైనంత మాత్రాన అతడి సత్తా ఏమి తగ్గిపోదు. పరుగుల ఆకలితో ఉండడం మంచిదే. నెట్స్‌లో అతడు ఆకట్టుకుంటున్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కోహ్లి సత్తా చాటుతాడనే విశ్వాసం ఉంది. త్వరలోనే అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌ను ఆశించొచ్చు’’ అని రాఠోడ్‌ అన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఎలాంటి పరిస్థితులు, పిచ్‌లు ఎదురైనా ఎదుర్కోనే సత్తా జట్టుకుందని అతడు తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని